Sunday, November 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅంతా నెహ్రూనే చేశారు

అంతా నెహ్రూనే చేశారు

Agony of Azad: గులాం నబీ అజాద్ కాంగ్రెస్ ను వదిలి వెళతారని ఎవరయినా అనుకున్నారా? పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ గులాం నబీకి వీడ్కోలు ఉపన్యాసంలో బి జె పి ప్రధాని మోడీకి ఉద్విగ్నతతో గొంతు బొంగురుపోయి…కంట్లో నీటి చెమ్మ వస్తుందని ఎవరయినా కలగన్నారా?
“అనుకున్నామని జరగవు అన్నీ…
అనుకోలేదని ఆగవు కొన్ని…
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని”.

మోడీని ఎంతగా విమర్శించినా…ఆయన తనపట్ల చూపిన అపారమైన గౌరవాభిమానాలకు ముగ్ధుడినయ్యానని గులాం నబీ అన్ని వేదికల మీద నిండు మనసుతో చెబుతున్నారు. జమ్ము కాశ్మీర్లో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. అది వేరే కథ.

గులాం నబీ అజాద్ ఆత్మకథ (Azad- An Autobiography) పుస్తకం రాశారు. “కాంగ్రెస్ దేశవ్యాప్తంగా క్రమంగా పతనం కావడానికి 1963లో మొదలయిన కామరాజ్ ప్రణాళికే కారణం” అని అజాద్ తన ఆత్మకథలో సూత్రీకరించారు. ఈ విషయం మీద జాతీయ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుండీ బయటికి వెళ్లిపోయారు కాబట్టి కాంగ్రెస్ పతనానికి ఆయన చెప్పిన కారణాలను కాంగ్రెస్ సహజంగా పట్టించుకోదు. ప్రజాస్వామ్యం, ప్రత్యేకించి రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఆలోచించేవారు మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలివి.

1. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్ 1963 లో ప్రధాని నెహ్రూకు ఒక పార్టీ నిర్వహణ ప్రణాళిక ఇచ్చారు.
2. “రాష్ట్రాల్లో బలంగా ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్రంలో బలంగా ఉన్న మంత్రుల దగ్గర రాజీనామాలు తీసుకుని…వారిని పార్టీ పనుల్లో పెట్టాలి. పార్టీ అధిష్ఠానం ఆయా స్థానాల్లో కొత్త వారిని నియమించాలి” అన్నది కామరాజ్ ప్రణాళిక.


3. ఈ ప్రణాళికను అనుసరించి కామరాజ్ ముఖ్యమంత్రి పదవిని వదులుకుని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. తిరుగులేని జనామోదం ఉన్న బిజూ పట్నాయక్, ఎస్ కే పాటిల్, ప్రతాప్ సింగ్ కైరాన్, భక్షి గులాం మొహమ్మద్ లాంటి ముఖ్యమంత్రులు అయిష్టంగా రాజీనామాలు చేయాల్సి వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి, జగ్జీవన్ రామ్, మొరార్జీ దేశాయ్ లాంటి దిగ్గజాలైన కేంద్ర మంత్రులు కూడా పదవులు వదులుకుని పార్టీ ఆఫీసుల్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు.
4. ఈ దెబ్బకు 1967 లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సీ కే అన్నాదురై స్థాపించిన ప్రాంతీయ పార్టీ ఆకాశమే హద్దుగా ఎదిగింది.
5. ఇలా చేయడం వల్ల పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంది కదా? అని భారత రాష్ట్రపతి అయిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని గులాం నబీ అడిగారు. (బహుశా అనితర సాధ్యమయిన జ్ఞాపకశక్తి ఉన్న వ్యక్తి అన్న గులాం మాటలను బట్టి- ప్రణబ్ ముఖర్జీ అయి ఉండాలి).
6. దానికి ఆయన సమాధానం ఏమి చెప్పారో చచ్చినా నేను చెప్పలేను అని అజాద్ అన్నారు. (ఏ స్థాయిలో ఎవరూ బలంగా ఉండకూడదు. ఎంతటివారయినా పార్టీ అధిష్ఠానం ముందు డూ డూ బసవణ్ణల్లా ఉండాలి. విపరీతమయిన జనాదరణ ఉన్నవారితో ప్రమాదం. అందుకే మాట వినే తోలుబొమ్మలను సీల్డ్ కవర్లో పంపాలి. ఇదే నెహ్రూకు నచ్చి…వెంటనే అమల్లో పెట్టిన కామరాజ్ ప్రణాళిక- అని ఆ రాష్ట్రపతి చెప్పి ఉంటారు అని ఊహించుకోవడానికి వీలుగా ఎంత చెప్పాలో ఒడుపుగా అంతవరకు చెప్పకనే చెప్పారు అజాద్)]


7. అస్సాంలో హిమంత- తరుణ్ గోగొయ్ జుట్లు పట్టుకుంటూ ఉంటే…హిమంతకే జనామోదం, పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తాను ఎంతగా చెప్పినా రాహుల్ వినకుండా తరుణ్ గోగోయ్ వైపే నిలబడ్డంతో హిమంత పార్టీని వదిలి వెళ్లారని…ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నారని అజాద్ పేర్కొన్నారు.
8. ఇంకా ఇలాంటివే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్స్ ను అజాద్ పూస గుచ్చినట్లు తన పుస్తకంలో వివరించారు.

మనలో మన మాట-
కాంగ్రెస్ పతనానికి అజాద్ ఆత్మకథ సిద్ధాంత గ్రంథాలు చదవాల్సిన పని లేదు. ఇటీవల పది, పదిహేనేళ్లలో పైలట్లు, సింధియాలు, సిద్ధరామయ్యలు…ఎవరిని చూసినా తెలిసిపోతుంది కదా? ఎవరు కాటికి కాళ్లు చాచి…వారెలా బతికి ఉన్నారో వారికే ఆశ్చర్యంగా ఉన్నవారిని కాంగ్రెస్ ఏరి కోరి నెత్తిన పెట్టుకుంటుంది.

1. హిందువులు కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టారో కాంగ్రెస్ కు తెలుసు. కానీ ఏమీ చేయలేదు.
2. దేశ యువత కాంగ్రెస్ కు ఎందుకు దూరమయ్యిందో కాంగ్రెస్ కు తెలుసు. అయినా ఏమీ చేయలేదు.
3. ఇరవై, ముప్పయ్ ఏళ్లు రాష్ట్రంలో తిరుగులేని బలమయిన నాయకులుగా, పార్టీకి స్తంభాలుగా ఉండాల్సినవారు…సొంత పార్టీలు పెట్టుకుని అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే కారణమని కాంగ్రెస్ కు తెలియక కాదు. తెలిసినా…ఏమీ చేయలేదు.
4. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా దేశం పట్టనంత సంపన్నులై…కాంగ్రెస్ పార్టీ దేశం పట్టుకుని వీధి వీధి తిరగాల్సిన నిరుపేద ఎందుకయ్యిందో కాంగ్రెస్ కు తెలుసు. అయినా ఏమీ చేయలేదు.
5. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని దేశ ప్రజలకు తెలుసు. కానీ కాంగ్రెస్ కే దేశంతో అవసరం ఉన్నట్లు తెలియడం లేదు. అంతే.

మొత్తమ్మీద-
కాంగ్రెస్ పతనావస్థకు కామరాజ్ ప్రణాళిక పౌరోహిత్యం; నెహ్రు దురాలోచనే కారణమని గులాం నబీ అజాద్ ఒక్క మాటలో తేల్చి పారేశారు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

తనను తానే దహించుకునే కాంగ్రెస్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్