Water Ponds to Drain Canals:
“అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము;
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ”
తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన గొడవ అప్పు గురించి కాదు. వరద ముప్పు గురించి. ఎప్పుడు ఎడతెగక పారే ఏటి గురించి. అలా పారే మూసీని మింగేసిన ఆక్రమణలతో మూసీ గుండె చెరువు కావడం గురించి. అంతకంటే ముఖ్యంగా మూసీ పుట్టు పూర్వోత్తరాల గురించి. మూసీని కన్న అనంతగిరి అందచందాల గురించి.
ఇప్పుడంటే చంద్రమండలం మీద కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు, భూమ్యాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఆకాశంలో తేలే అపార్ట్ మెంట్లు కొంటున్నారు కానీ– వేల ఏళ్లుగా ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరంవెంబడే పురుడు పోసుకుని పెరిగి పెద్దవయ్యాయి. భూగోళం మీద సాటిలేని మేటి నగరాలన్నీ సముద్ర తీరంలోనే ఉంటాయి. త్రేతాయుగ రామాయణంలో తమసా, సరయూ, గోమతి, గంగ, యమున, గోదావరి, పంపా నదులమీద పడవల్లోనే ప్రయాణం చేశారు. తిరుగులేని అయోధ్య సరయూ పక్కనే ఉంది. ఆటవిక తెగల రాజ్యం శృంగిబేరపురం గంగ ఒడ్డున ఉంది.
సుదీర్ఘమయిన చరిత్ర ఉండి, దక్కన్ పీఠభూమి కేంద్ర స్థానంలో ఉన్న భాగ్యనగరానికి సముద్రతీరం లేదని మరీ అంతగా బాధ పడాల్సిన పని లేదు. నిజాం రాజుల కాలంగా ఒక అయిదు వందల సంవత్సరాల చరిత్రనే హైదరాబాద్ కు ఆపాదించాం. వేల సంవత్సరాల క్రితం ముచుకుంద మహర్షి వికారాబాద్ దగ్గరి అనంతగిరి కొండల్లో తపస్సు చేశాడు. బలరామకృష్ణులమీద దాడి చేసిన కాలయవనుడు ఇక్కడే ముచుకుందుడి కోపాగ్నికి బూడిద అయిపోయాడు. ఆ ముచుకుందుడే నదిగా మారి కృష్ణుడి కాళ్లు కడిగి అనంతగిరి నుండి ప్రవహిస్తూ కృష్ణా నదిలో కలుస్తున్నాడు. ఇదే మూసీనది. చాలా పురాణ ప్రాశస్త్యం ఉన్నా ఎందుకో అనంతగిరికి విహారస్థలంగానే గుర్తింపు వచ్చింది. ముచుకుంద మహర్షి- అనంతగిరి అనుబంధాన్ని ప్రఖ్యాత పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి అనేక పురాణాల సమన్వయంతో నిరూపించారు.
ఇప్పుడంటే నగరం మురికిని మింగడంవల్ల మూసీ మురికిదయ్యింది కానీ- ఒకప్పుడు మూసీ తెలంగాణ గంగ. మూసీ పరీవాహక ప్రాంతంలో వెలసిల్లిన నాగరికతకు చాలా చరిత్ర ఉంది. పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేసి కాగితం మీద దక్కిన దక్కన్ చరిత్రను మాత్రమే మనం అంగీకరించాలి! అందునా వామనేత్రంతో చూసి రాసిన చరిత్ర అయితే మరీ శ్రేష్ఠం!
తెలుగులో అప్పుడప్పుడు గుండె చెరువు అవుతూ ఉంటుంది. గుండెకు చిల్లులు పడతాయి. లేదా గుండె కవాటాల్లో అడ్డు పడతాయి. గుండె బరువెక్కుతుంది. గుండె తేలికవుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. లేదా కొట్టుకుని కొట్టుకుని అలసితి సొలసితి అంతర్యామీ! అని ఆగిపోతుంది. మరి గుండె చెరువు కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అన్వయించుకోవాలి? నిజానికి హైదరాబాద్ గుండె ఇప్పుడు చెరువయ్యే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో గుండెలోపల కన్నీటి చెరువు ఏర్పడ్డం అనే అర్థంలో అంతులేని బాధల్లో మునిగిపోవడాన్ని గుండె చెరువుగా చెప్పుకుంటున్నాం.
దుర్గం చెరువు
పీరం చెరువు
హుస్సేన్ సాగర్ చెరువు
గండిపేట చెరువు
సఫిల్ గూడ చెరువు
సరూర్ నగర్ చెరువు
అల్వాల్ చెరువు
రామంతాపూర్ చెరువు
శామీర్ పేట్ చెరువు
జీడిమెట్ల చెరువు
మీర్ ఆలం చెరువు
ఇలా మొత్తం భాగ్యనరంలో అక్షరాలా 185 చెరువులుండేవి. ఇప్పుడు వాటి పేర్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని చెరువులు మొండివి కాబట్టి బతికి బట్టగలిగాయి. 185 లో మహా అయితే ఇరవై శాతం చెరువులను మాత్రమే బతకానిచ్చాము. మిగతావి విస్తీర్ణాన్ని కుచించుకుని చావలేక బతుకుతున్నాయి. బతకలేక చస్తున్నాయి. మనిషికి ఏడుపొస్తే “గుండె చెరువయ్యింది” అంటున్నాం. చెరువుకే ఏడుపొస్తే-
“చెరువు గుండె చెరువయ్యింది” అనాలా? చెరువుకు మాత్రం గుండె ఉండదా? ఆ గుండెకు ఒక స్పందన ఉండదా? ఆ స్పందనకు ఒక అర్థం ఉండదా?
మనకు ఏడుపొస్తే చెక్కిళ్ల మీద కన్నీళ్లు కనిపిస్తాయి.
చెరువుకు ఏడుపొస్తే దాని కన్నీళ్లు నీళ్లలోనే కలిసి ఉండడంవల్ల కనిపించవు. గుర్తుపట్టలేము.
భాగ్యనగరం చెరువులు దశాబ్దాలుగా రోడ్లమీద పడి గుండెలు బాదుకుంటున్నాయి. మనం ఆక్రమించినమేర ఖాళీ చేయాలని చెరువులు మూసీ పక్కనే ఉన్న కోర్టును న్యాయం అడగలేవు.
సందర్భం:-
ఒక శనివారం మధ్యాహ్నం కారులో లాంగ్ డ్రయివ్ వెళ్లి…అనంతగిరి కొండా కోన, వాగు వంకల మధ్య స్వయంభువుగా వెలిసిన అనంతపద్మనాభస్వామి దర్శనం చేసుకుని…సూర్యుడు అలసి పడమటింటికి తిరిగి వేళ్లే వేళ…వికారాబాద్, చేవెళ్లల మీదుగా తిరిగి ఇంటికి వచ్చేశాము. అనంతగిరి వెళ్లిన ప్రతిసారీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు చెప్పిన మూసీనది పుట్టు పూర్వోత్తరాలు, వేల ఏళ్ల పురాణ ప్రాశస్త్యం ఉన్న అనంతగిరి కొండల కథలు వెంటాడుతూ ఉంటాయి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]