మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో ప్రజలు దినమొక గండంగా జీవనం సాగిస్తున్నారు. రాజధాని ముంబై తో పాటు పూణే, నాగపూర్ లు సహా గ్రామీణ మహారాష్ట్రలో కరోనా తో జనజీవనం కకా వికలమైంది. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మహారాష్ట్రానే ఎక్కువగా అవస్థలు పడింది. కరోనా కుదిపేసిన తర్వాత దేశ ఆర్ధిక రాజధాని ముంబై తో పాటు మహారాష్ట్రలోని అనేక జిల్లాలు ఇప్పుడు వర్షాలు, వరదలతో సతమతమవుతున్నాయి. భివండి, చెంబుర్, విక్రోలి తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంబై జీవనాడిగా చెప్పుకునే లోకల్ రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనాతో నిలిపివేసిన లోకల్ రైళ్ళు ఇటీవలే ప్రారంభం కాగా వరదలతో మరోసారి మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మాత్రం నడుస్తున్నాయి. చేనేత మగ్గాలు, పరిశ్రమకు పేరుపొందిన భివండి నగరం జలమయమైంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ లతో పాటు విద్యాలయాలు, ఆస్పత్రులు జల దిగ్బంధంయ్యాయి.
తాజాగా రాయఘడ్ జిల్లా మహద్ సమీపంలోని రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి భారీగా ప్రాణ నష్టం జరిగింది. కుండపోత వర్షాలతో గ్రామాలు, చెరువులు, రోడ్లకు హద్దులు చెరిగిపోయాయి. కొండ చరియలు విరిగిపడి చనిపోయినవారి సంఖ్య 50 కి చేరింది. ఒక తలై గ్రామంలోనే 35 మంది మృత్యువాత పడ్డారు. ఆస్పత్రుల్లో సుమారు 40 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రాయఘడ్ జిల్లాలో మొత్తం ఆరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. మరో 50 మది శిథిలాల్లో చిక్కుపోయారు. వారిని కాపాడేందుకు ఈ రోజు కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎడతెరిపి లేని వర్షాలతో మహారాష్ట్రలో ఇప్పటివరకు సుమారు 150 మంది చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. చిప్లున్ గ్రామ సమీపంలో ఓ వంతెన వరదలో కొట్టుకుపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని 20 గ్రామాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు పడవల ద్వారా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
వరద బాధిత ప్రాతాలలో ఈ రోజు ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా, వరద సహాయ కార్యక్రమ పర్యవేక్షణకు రాయఘడ్ కలెక్టర్ అధ్వర్యంలో ప్రత్యేకంగా అధికార బృందం 24 గంటలు పనిచేస్తోంది.