లారెన్స్ ఇంతవరకూ ఎక్కువగా హారర్ కామెడీ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ జోనర్లో చేసిన సినిమాల్లోనూ తన మార్క్ మాస్ యాక్షన్ ను ఆయన వదిలిపెట్టలేదు. అలాంటి లారెన్స్ నుంచి అదే జోనర్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. అయితే లారెన్స్ మాత్రం ఈ సారి ఆ జోనర్ వైపు వెళ్లకుండా .. తాను మెగాఫోన్ పట్టకుండా కథిరేసన్ అనే నిర్మాతకి దర్శకుడిగా ఛాన్స్ ఇస్తూ ‘రుద్రుడు’ సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా నిన్న విడుదలైంది.
సాధారణంగా ప్రతి కథకి ఒక లీడ్ ఉంటుంది .. అసలు కథకు ఫ్లాట్ ఫామ్ వేయడానికి కొంత సమయం తీసుకుంటారు. కాకపోతే ఈ సినిమాలో ఆ సమయాన్ని కాస్త ఎక్కువగా తీసుకున్నారు. ఆరంభంలోనే ప్రధానమైన రెండు పాత్రలను ఒక రేంజ్ లో పరిచయం చేసిన తరువాత, కథ కావాల్సినంత వేగాన్ని పుంజుకోదు. కథ ఎటువెళుతోంది? హీరో మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? అనేది మనకి అర్థం కాదు. ఆ తరువాత కథ ట్రాకులో పడుతుంది. ఇక అప్పటి నుంచి క్లైమాక్స్ వరకూ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు.
ఆడియన్స్ అంచనాలను కాదని కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి యాక్షన్ .. ఎమోషన్ రెండూ కలిసి నడుస్తుంటాయి. క్లైమాక్స్ వరకూ ఎక్కడ కథలో ఎక్కడా సడలింపు కనిపించదు. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. లారెన్స్ స్టెప్పులు .. ఫైట్లు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. జాతరలో జరిగే ఫైట్ ను కంపోజ్ చేసిన తీరు బాగుంది. ఇక క్లైమాక్స్ లో కూడా లారెన్స్ మార్క్ హడావిడి కనిపిస్తుంది. మొదటి అరగంట కాస్త ఓపికతో కూర్చుంటే, ఆ తరువాత మనం కూర్చున్నామనే సంగతి గుర్తుండదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ .. అది ఇచ్చే మెసేజ్ అలా ఉంటుంది మరి.