Karma Phalam:
“సారపు ధర్మమున్విమల సత్యము, పాపముచేత బొంకుచే
పారము పొందలేక చెడబారినదైన యవస్థదక్షులె
వ్వారలుపేక్ష చేసిన అదివారల చేటగుగాని ధర్మని
స్తారకమయ్యెయు సత్యశుభదాయకమయ్యెయు దైవముండెడిన్ “
ధర్మం కాల మహిమవల్ల దారి తప్పినప్పుడు, సరిచెయ్యగలిగిన దక్షత ఉండి చేతలుడిగి కూర్చున్న వారికే అది ఒకనాటికి చేటవుతుంది అని అర్థం. ఆంధ్ర మహాభారతంలో సంజయ రాయబార సందర్భంలో తిక్కన సోమయాజి కలంనుంచిజారిన ఆణిముత్యం ఈపద్యం. వందల సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికీ అన్వయించుకోగలగిన నీతిసూత్రాలవి.
ఒక్కసారి గతంలోకి వెళ్తే –
1946వ సంవత్సరం మొదట్లో, 20 వేల మందికి పైగా రాయల్ ఇండియన్ నావికాదళం, రాయల్ వైమానిక దళం సైనికులు చేసిన తిరుగుబాటుతో, భారతదేశం మీద నియంత్రణ కోల్పోయిన విషయం, ఆంగ్లేయులకు అర్థమైంది. ఇక పరిపాలన కొనసాగించలేమన్న నిర్ణయానికి వచ్చారు. మనం చరిత్ర పాఠాలలో సరీగా చదువుకోలేదు కానీ, ఆ సైనిక తిరుగుబాటును మన చివరి స్వాతంత్ర్య సమరంగా చెప్పవచ్చు. ఎందుకంటే నాటి రెండవ ప్రపంచ యుద్దంలోజర్మన్, జపాన్ దేశాల సైన్యాలతో పోరాడి విజయవంతంగా తిరిగివచ్చిన భారత సైనికదళం అది. అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తలదూర్చకపోతే, 1946లోనే దేశానికి స్వాతంత్రం వచ్చేదెమో. కానీ, అప్పటికే మన దేశంలో పెరిగిన మతకలహాలు, భారతీయులు ఒక్కజాతిగా కలిసి ఉండలేని పరిస్ఠితులు, దేశ విభజనకు ఆ బూచితో ఇంకో సంవత్సరం తెల్లవారిపాలన సాగే అవకాశం కల్పించాయి.
నిజానికి, అప్పటి వరకూ సాగిన దారుణ మారణకాండను అదుపు చెయ్యలేని అసమర్థ పాలకులు, దేశవిభజనకు మాత్రం తగుదునమ్మా అంటూ పెద్దరికం తీసుకొన్నారు.
“తుటుములై భూసురుల తుండెములు మొండెములు
యిటువలె భూతములు ఎట్టు మోచెనో
అటు బాలుల రొదలు ఆకాశమెట్టోరిచెనో
కటకటా యిట్లాయ గలికాలమహిమ
నిరపరాధుల జంపి నెత్తురు వారించగానూ
తెరలకెట్టుండిరో దిక్పాలులు
నిరసవర్తనులుండె విపరీతకాలమున
గరువాలు గపటాలె కలికాలమహిమ”
తెగిన తలలతో మొండెముల బరువును భూమాత ఎలాభరించిందో? పసిపిల్ల ఆక్రందనలతో దద్దరిలిన రోదనలను ఆకాశమెట్లాభరించిందో? అమాయక ప్రజలను చంపుతుంటే చూస్తూ ప్రతిఘటన చూపించని రక్షకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేకదా! ఎంతటి దారుణం ఈ కలికాల మహిమ!! అంటాడు అన్నమయ్య.
పాలన చివరినాళ్ళలో విభజన పెత్తనం తీసుకున్నపెద్దలు, పోనీ అదైనా సక్రమంగా చేశారా అంటే, ఈ దేశ జాతులతోనూ సంస్కృతులతోనూ ఏమాత్రం సంబంధంలేని, అసలు దేశం మొహం ఒక్కసారి కూడా చూసి ఎరుగని రాడిక్లిఫ్ అనే పెద్దాయనకి ఆ బాధ్యత అంటగట్టారు. నలుగురితో చర్చించి వీలైనంతవరకూ అమోదయోగ్యంగా ఉండవలసిన నిర్ణయాలు, కొద్దిమంది చేతుల్లో నాలుగు గోడల మధ్య జరిగాయి. విభజన గాయాలు పచ్చిగా ఉండగానే, తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అంటూ పాలకులు దేశం విడిచి వెళ్ళడం కూడా అయ్యింది. (పై మాటలు అన్నీఒకనాటి దేశ విభజన గురించిమాత్రమే, వేరే విభజనలు ఏవన్నా గుర్తుకు వస్తే అది కేవలం యాదృచ్ఛికం అంతే.)
ఇక వర్తమానానికి వస్తే –
ఇంగ్లండ్ లోని లీసెస్టర్ అనే నగరంలో ఇటీవల భారత-పాకిస్తాని సంతతికి చెందినవారి మధ్య జరిగిన ఘర్షణలు ఆ నగర జీవన స్తంభనకు కారణం అయ్యాయి. ఈ దాడుల్లో 16 మంది బ్రిటిష్ పోలీసులు గాయాల పాలయ్యారు. ఇంగ్లండ్ నలుమూలల నుంచి రక్షకదళాలను లీసెస్టర్ కు తరలించాల్సివచ్చింది.
సరిగ్గా అది బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు, పలు ప్రపంచదేశాధినేతలు ఇంగ్లండ్ కు వచ్చి ఉన్న సందర్భం. రాణి అంత్యక్రియల విధులనుంచి, దేశాధినేతల రక్షణ భాధ్యతల నుంచి పలువురు అధికార్లను పక్కకు తప్పించి మరీ ఈఘర్షణల సర్దుబాటుకు పంపించాల్సి రావడం ఒకప్పటి కర్మ ఫలితాలను గుర్తు తెచ్చిన సందర్భం కూడా. ముఖ్యంగా, రాణి అంత్యక్రియల వార్తల పక్కనే ఈ గొడవల వార్తలు రాకుండా చూడడానికి ప్రసార మాధ్యమాలుపడ్డ కష్టం వర్ణనాతీతం. కానీ అసలుకు వడ్డీతో సహా కలిపి అప్పజెప్పే సోషల్ మీడియా మాత్రం, మొత్తం చరిత్రను ఒక్కమాటతో కళ్ళముందుకట్టింది- “And the Britishers thought they wouldn’t pay for the partition.”
కాలమహిమ ఏంటంటే, ఇదంతా జరిగిన కొద్దికాలానికే, భారత సంతతికి చెందిన రిషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ కు ప్రధాని కావడం. సమస్య మూలాల మీద అవగాహన ఉన్నవాడు కనుక, గొడవలు పెరగకుండా చర్యలు తీసుకొంటాడని ఆశిద్దాం.
– నూచర్ల మహేశ్
(Source:
https://www.bbc.co.uk/news/uk-england-leicestershire-62943952
(రచయిత ఆంధ్ర దేశం నుండి ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ వృత్తి నిపుణుడు. తెలుగు సాహితీ పిపాసి. ఎక్కడున్నా తెలుగు వెలుగులను వెతుక్కునే అన్వేషి)