His life with Literature: సంస్కృతాంధ్ర భాషా కోవిదుడు, నిఘంటు నిర్మాత, అర్ధ శతాబ్ద కాలం ఆచార్యుడిగా పని చేసిన రవ్వా శ్రీహరి గారి మృతికి నివాళిగా నా మాటల కంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం- టీ టీ డి ప్రచురించిన అన్నమయ్య పదకోశం నిఘంటువు ముందు మాటలో ఆయనన్న మాటలే కొన్ని యథాతథంగా చదవండి.
“తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహ బిరుదాంచితుడు తాళ్లపాక అన్నమాచార్యులు పదహారవ ఏటనే వెంకన్న సాక్షాత్కారం పొంది…తన్మయుడై…రోజుకొకటి తక్కువ కాకుండా 32 వేల సంకీర్తనలు రచించి ధన్యుడయిన భక్తవరేణ్యుడు.
ఇందులో మనకు లభించినవి 14,358 మాత్రమే. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యులు ఈ సంకీర్తనలన్నిటిని రాగి రేకులపై చెక్కించి అమూల్యమయిన సంకీర్తన సాహిత్యాన్ని మనకందించినాడు.
ఈ కీర్తనల్లో నాలుగు అంశాలు ప్రధానంగా గోచరిస్తాయి. 1. భక్తి; 2. సాహిత్యం; 3. సంగీతం; 4. భాష.
వీటన్నిటిలో అన్నమయ్య తన విశ్వరూపాన్ని ప్రదర్శించినాడనడంలో సందేహం లేదు.
అన్నమయ్య కీర్తనల్లో భాష ఎంతో విలక్షణమయినది. సమకాలంలో వస్తున్న ప్రబంధాల్లోని దీర్ఘ సమాసభూయిష్ఠమయిన సంస్కృతపద బహుళ శైలిని తోసిరాజని…ప్రజల వ్యవహారంలో ఉన్న తెలుగు భాషకు పట్టం కట్టిన మహానుభావుడు. తన సంకీర్తనల ద్వారా భక్తి భావాన్ని సామాన్య ప్రజల్లో కూడా వ్యాప్తి చేయాలనే లక్ష్యమే ఇందుకు కారణం. ఒక విధంగా అన్నమయ్య తొట్టతొలి వ్యాహారిక భాషోద్యమ నిర్మాత అని చెప్పవచ్చు. ఆయన భాష విలక్షణమయినది. జనవ్యవహారం ముందు వ్యాకరణ నియమాలు పట్టించుకోనవసరం లేదన్న భావంతో వ్యాకరణ విరుద్ధాలయిన ప్రయోగాలకు కూడా జనవ్యవహారం కారణంగా సాహసంతో తన సంకీర్తనల్లో ప్రయోగార్హత కల్పించినాడు. భాషా వ్యవహారానికి జీవం పోసే ప్రాంతీయ మాండలిక పదాలనెన్నింటినో వాడి…కాలక్రమంలో ప్రామాణిక భాష పేరుతో మనం పోగొట్టుకున్న మన తెలుగు సంపదను గుర్తు చేసినాడు. వెలిబుచ్చే అభిప్రాయాన్ని సమర్థంగా, రమణీయంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పడానికి ఉపయోగించే జాతీయాలను, సామెతలను పరశ్శతంగా వాడి భాషకు సహజత్వాన్నీ, రమణీయతనూ సాధించినాడు. తిక్కనవలె కొన్ని సంస్కృత పదాలకు అచ్చ తెలుగు పదాలను సృష్టించి భాషా విషయంలో తన సృజన శక్తిని ప్రకటించుకోవడమే కాకుండా…తెలుగు భాషకున్న శక్తిని తెలియజేసినాడు.
ఒబ్బుద్ధి, నియ్యెడ లాంటి వింతసంధులను;
దినపెండ్లి, నిత్యకొత్తలు లాంటి వైరి సమాసాలను;
మహా ప్రాణాలకు బదులు ఉద్దేశపూర్వకంగా అల్పప్రాణాలను సుకం, వీది, బాద, బోజనము అని ప్రయోగించినాడు.
అన్నమయ్య సాహిత్యంలో విశేష కృషి చేసిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు, శ్రీ వేటూరి ఆనంద రామమూర్తి గారు మొదలయిన పండితులు కొన్ని పదాలకు అర్థ నిర్ణయం చేసి పఠితలకు మహోపకారం చేసినారు. అయినా అర్థ నిర్ణయం కావలిసిన పదాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి.
నా శక్తి మేరకు, ఎరుక మేరకు ఈ పదకోశాన్ని సిద్ధం చేసి మీ ముందుంచుతున్నాను. ఇందులోని బాగోగులను తెలియజేస్తే…సహృదయతతో స్వీకరిస్తాను. ఇందులో ఇంకా చేర్చవలసిన పదాలు లేకపోలేదు. వాటి అర్థ విషయంలో సందిగ్ధత ఉండడం వల్ల ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం లేదు”
-రవ్వా శ్రీహరి
రవ్వా శ్రీహరి గారి మరణ వార్తకు మెయిన్ స్ట్రీమ్ మీడియా తగిన ప్రాధాన్యం ఇచ్చింది. ఆ విషయాలన్నీ చెబితే చర్విత చర్వణం అవుతుంది. యాదాద్రి జిల్లాలో నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన సంస్కృత పాఠశాలలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తారన్న ఆశతోనే అక్కడ చేరారు. ఆ ఆకలి పొట్టతో ప్రారంభమై…కడుపు నిండిన తరువాత…మెదడు ఆకలిగా మారి మనకు మహోపకారం చేసింది.
ఆయన ఎప్పుడు పుట్టారు? ఏయే ఉద్యోగాలు చేశారు? 80 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఎన్నెన్ని కావ్యాలను తెలుగులో నుండి సంస్కృతంలోకి అనువదించారు? ఎన్ని నిఘంటువులను ఒంటి చేత్తో నిర్మించారు? అన్న వివరాలు గూగుల్ నిండా దొరుకుతాయి.
సాధారణంగా ఒక పుస్తకం రాయగానే నేల మీద నడవడం మానేసి…కవి సింహాలు…కవి వృషభాలు…కవి కేసరులు అయి గండపెండేరాల అహంకార పంజరాల్లో ఇరుక్కుని తమను తాము ప్రత్యేకమయిన గ్రహాంతరవాసుల్లా భావించుకునే ఎందరో కవులు, రచయితలతో పోలిస్తే- రవ్వా శ్రీహరి గారు కొన ఊపిరి వరకు అత్యంత సామాన్యుడిలా ఎలా నేల మీదే నడవగలిగారు? అన్నదే ఏ గూగుల్ చెప్పలేని విషయం. అదొక్కటే మనకు మనం ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాల్సిన విషయం.
రవ్వా శ్రీహరి గారు నిగర్వి. నిరాడంబరులు. అతి సామాన్యుడిలా ఉండడానికే ఇష్టపడేవారు. కానీ సంస్కృతాంధ్ర భాషలకు ఆయన చేసిన సేవ మాత్రం అసామాన్యం. కొన్ని వందల మంది పండితులు ఉమ్మడిగా చేయాల్సిన పనులను ఆయన ఒక్కడిగా చేశారు. కొన్ని సంస్థలు, పీఠాలు చేయాల్సిన పనులను ఆయన ఒక్కరే చేశారు.
అష్టావధాని, వ్యాకరణ శాస్త్రం అంటే చెవి కోసుకునే మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ ద్వారా ఆయన నాకు తెలుసు. కలిసి మాట్లాడింది కొన్ని సార్లే. ఎంత చిన్నవారితో అయినా ఎంతో మర్యాదగా మాట్లాడే ఆయన వినయ సంపద చాలా గొప్పది. తెలంగాణాలో పుట్టి అన్నమయ్య మాటలకు “అన్నమయ్య పదకోశం” పేరిట సాధికారికమయిన నిఘంటువును తయారు చేసిన పండితుడిగా ఆయనంటే నాకు ఆరాధన. అన్నమయ్య కీర్తనల్లో మాటల అర్థాలకు సంబంధించి ఆయన నిఘంటువే నాకు దిక్సూచి. ఆయన్ను దగ్గరగా చూసినవారు “ఈ కాలపు వాల్మీకి” అంటారు.
మనకు వెంకన్నను చూపించడానికి అన్నమయ్య పుట్టాడు. ఆ అన్నమయ్యను చూపించడానికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి; వేటూరి ప్రభాకర శాస్త్రి; రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ; ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, రవ్వా శ్రీహరులు పుట్టారు.
తెలుగు భాషాభిమానిగా, వ్యాకరణ విద్యార్థిగా, అన్నమయ్య సాహిత్యాన్ని ఆరాధించే వ్యక్తిగా రవ్వా శ్రీహరిగారి మృతికి నివాళిగా సూర్యుడి ముందు దివిటీ పెట్టినట్లు ఈ నాలుగు మాటలు.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]