Friday, November 22, 2024
HomeTrending Newsవరకట్న నిషేధానికి కేరళ కొత్త ఫార్ములా!

వరకట్న నిషేధానికి కేరళ కొత్త ఫార్ములా!

మన దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం అనుకుంటారు కానీ అంతకు మించిన సమస్య వరకట్నమే అనేది విషాద వాస్తవం. పెళ్లి పేరుతో జరిగే విచ్చలవిడి ఖర్చు మన దేశంలో ఎన్నో కుటుంబాలకు పెట్టించేది కన్నీరే.  ఒకప్పుడు కన్యాశుల్కం దురాచారం ఉండేది. తర్వాత వరకట్నం వచ్చింది. ఏదయినా బాధితులు మహిళలే. ఇప్పటికి అరవై ఏళ్లయింది వరకట్న నిషేధ చట్టం వచ్చి. ఎక్కడన్నా ఏదన్నా మార్పు కనిపిస్తోందా? అంటే ఉంది, కానీ ఆ మార్పు మంచిదని చెప్పలేం. పెళ్లిళ్లలో హంగులు ఎక్కువయ్యాయి. పిండికొద్దీ రొట్టె కాదు, పిండుకున్నవాడికి అందినంత అన్నట్టు తయారైంది పరిస్థితి.

అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నా ఆమె తెచ్చే కట్న కానుకల పైనే మక్కువ. అలాగే పెద్ద హోదా ఉంటే మరింత కట్నం వస్తుందనే ఆశతో ఉన్నతోద్యోగం  కోసం ప్రయత్నించే  ప్రబుద్ధులూ  ఎక్కువే.

     ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే తమ పిల్లలు, బంధువుల పెళ్లిళ్లకోసం  ఆర్భాటంగా కోట్లు ఖర్చుపెడుతుంటే సామాన్యులకు చట్టం గురించి అవగాహన ఆశించగలమా? అయినా సరే కేరళ ప్రభుత్వం ఆశించిన మార్పుకోసం చట్టబద్ధంగా ముందుకెళ్తోంది.

     కేరళ అనగానే మనకు అందమైన కొబ్బరి, రబ్బరు తోటలతో పాటు అక్షరాస్యత కూడా గుర్తు వస్తుంది. అయితే ఇదంతా మేడిపండు చందం అని కొందరి భావన. అక్కడ అంతగా చదువురాని అబ్బాయిలు గల్ఫ్ వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ డబ్బు కూడబెట్టి ఊళ్లలో ఆస్తులు కొంటున్నారు.  చదువుకుని పై స్థాయికి చెందిన వారిని చేసుకోవాలనుకునే అమ్మాయిలు కట్నం ఇవ్వలేక అంతగా చదువుకోని వారిని చేసుకోవలసి వస్తోంది. మరోపక్క చదువుకున్న అబ్బాయిల కోరికలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిజానికి కేరళలో వరకట్నం అనే పధ్ధతి లేదు. కానీ అబ్బాయి హోదా, ఆస్తిని బట్టి అమ్మాయికి బంగారం, ఆస్తి ఇస్తారు. అందుకే చాలా కేరళ పెళ్లిళ్లలో వధువులు నడిచే నగల దుకాణాల్లా అనిపిస్తారు. ఆ నగలపై అమ్మాయిలదే అధికారం. అత్తింటివారు అడగడానికి లేదు. అందుకే చాలామంది దీన్నొక సమస్యగా భావించరు. కానీ ఇటీవలి కాలంలో వరకట్న వేధింపులకు  కొందరు మహిళలు బలయ్యారు. దాంతో కేరళ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులంతా వరకట్నం తీసుకోలేదని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పురుషులు వివాహమైన నెలరోజుల లోపు ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానిపై భార్య, ఆమె తండ్రి సంతకాలు కూడా తప్పనిసరి.  ఈ మధ్యనే కేరళ గవర్నర్ విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాలకు కట్నం తీసుకోమనే డిక్లరేషన్ ఇవ్వాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వ తాజా చర్యలు గమనార్హం. ఎంత దూరమైనా అడుగే ప్రారంభం.  ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు ..నడవరా ముందుగా అన్నట్లు కేరళ లో ప్రారంభమైన ఈ అడుగులు దేశమంతా విస్తరించాలి.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్