టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయం సాధించింది. నేడు జరిగిన పూల్ ‘ఏ’ మ్యాచ్ లో స్పెయిన్ పై 3-0 తేడాతో గెలుపొందింది. జూలై 24 శనివారం జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూ జిలాండ్ పై 3-2 తేడాతో విజయం సాధించిన ఇండియా, ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో 7-1 తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆ ఓటమిని దిగమింగుకుని నేడు జరిగిన కీలక మూడో మ్యాచ్ లో గెలిచి మళ్ళీ ట్రాక్ లో పడింది.
మొదటి క్వార్టర్ లోనే ఇండియా రెండు గోల్స్ చేసింది, సిమ్రన్ జీత్ సింగ్, రుపీందర్ సింగ్ లు చెరో గోల్ చేశారు. రెండు, మూడో క్వార్టర్ లో రెండు జట్లూ గోల్స్ సాధించలేకపోయాయి. నాలుగో క్వార్టర్ లో రూపీందర్ మరో గోల్ సాధించాడు. అదే ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఇండియా 3-0 తేడాతో మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసుకుంది.
భారత జట్టు ఎల్లుండి గురువారం అర్జెంటీనాతో, శుక్రవారం ఆతిథ్య జపాన్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లలో గెలిస్తేనే క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకునేందుకు అర్హత సాధిస్తుంది.