Perfect Marriage:
“దేవుడి సాక్షిగా
కులం సాక్షిగా
గోత్రం సాక్షిగా
పచ్చని పందిరి సాక్షిగా
సభ సాక్షిగా
పెళ్ళికి వచ్చిన పెద్దల సాక్షిగా
పంచ భూతాల సాక్షిగా…
ఇష్టపూర్వకంగా తాళి కడుతున్నాను”
అని పురోహితుడు మైకులో చెప్పిస్తే…పెళ్లి కొడుకు అలానే చెప్పి…తరువాత మాంగళ్య ధారణ మంత్రాలు, మేళ తాళాల మధ్య మూడు ముళ్లు వేశాడు. అందరూ అక్షింతలు చల్లి…నూతన వధూ వరులను ఆశీర్వదించారు. నేను కూడా అక్షతలు చల్లి ఆశీర్వదించి వచ్చాను.
ఆత్మీయ మిత్రుడు వారి ఇంట్లో పెళ్లికి ఆహ్వానిస్తే వెళ్లాను. అది హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్. విష్ణువు దశావతారాల ప్రతిమలతో పెళ్లి పందిరి చూడముచ్చటగా ఉంది. మధ్యలో లక్ష్మీ నారాయణుల ముందు మాంగళ్య ధారణ జరిగేలా పందిరి ఏర్పాటు చేశారు. ఏనుగులు పందిరిని మోస్తున్నట్లు…పూల అలంకరణ అంతా బాగుంది.
ఈమధ్య ఏ పెళ్లికెళ్లినా పది నిముషాలకు మించి ఉండలేని అనివార్య పరిస్థితులు. ఇక్కడ మహా అయితే అయిదు నిముషాలు ఉండి…మిత్రుడికి కనిపించి…అటెండెన్స్ వేయించుకుని వచ్చేద్దామనుకుని వెళ్లాను. కానీ రెండున్నర గంటలు కూర్చుని…మొత్తం పెళ్లి తంతును కళ్లతో చూడగలిగాను. చెవులతో వినగలిగాను.
పెళ్లి కూతురు- పెళ్లి కొడుకు ఇద్దరూ తెలంగాణ వారు. ఇద్దరు పురోహితులు చక్కటి తెలుగులో మంత్రానికి ముందు ఆ మంత్రం అర్థమేమిటో, ఎందుకో అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పారు. పెళ్లి పందిట్లో ఇలాంటి మంత్ర వ్యాఖ్యానం నేనెక్కడా చూడలేదు. వినలేదు. పచ్చని పందిరి సాక్షిగా తెలుగు మాటలు సంస్కృతం మంత్రం కంటే గొప్పగా వినిపించాయి. అనిపించాయి.
కులం సాక్షిగా; గోత్రం సాక్షిగా; పెద్దల సాక్షిగా; పంచ భూతాల సాక్షిగా…ఇష్టపూర్వకంగా…అని చెప్పిస్తూ…తాళి కట్టిస్తున్న ఈ పద్ధతి ఎప్పటి నుండి ఉందో! ఇప్పుడే నా కంట పడింది.
సంస్కృత మంత్రం, ప్రవర చెప్పడం కూడా చక్కటి స్వరంతో సాగింది.
మంత్రాన్ని యథాతథంగా చెబుతూ…దాని అర్థం ఇలా విడమరిచి చెప్పే ఈ పద్ధతి చాలా అవసరం. పందిట్లో పెద్దలందరూ చెవి ఒగ్గి మంత్రం కంటే మామూలు భాష వ్యాఖ్యానాన్నే వినడం నేను గమనించాను.
ఇంతటి మంత్రమయమయిన వాక్కు ఉన్న పురోహితుల పౌరోహిత్యం కంటే వేదిక మీద ఉన్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల, డ్రోన్ కెమెరా ఆపరేటర్ల పౌరోహిత్యమే ఎక్కువగా ఉంది. ఎక్కడయినా జరిగేది ఇదే కాబట్టి…లోకం దీన్ని అంగీకరించింది. పురోహితులు కూడా అర్థం చేసుకుని…సర్దుకుపోయారు.
మంత్రాన్ని ఆపి ఆపి…ఇలా చెప్పకూడదు అనే వాదన ఒకటుంది. అర్థం కాని మంత్రాలను వందే భారత్ కంటే వేగంతో చదివేసి…తంతును ముగించడంతో పోలిస్తే…ఆ మంత్రాల అర్థాలు, అంతరార్థాలు, పరమార్థాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెబుతూ తాళి కట్టించడం చాలా మంచిది….అవసరం కూడా అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]