Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవెతకబోయిన వీణ తీగలు చేతికి దొరికినట్లు...

వెతకబోయిన వీణ తీగలు చేతికి దొరికినట్లు…

Tribute to Annamayya:  పదకవితా పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య 615 జయంతి ఉత్సవాలను వారం రోజులపాటు తాళ్లపాకలో, తిరుపతిలో టీ టీ డి ఘనంగా నిర్వహించింది. రోజూ సాహిత్య, సంగీత సభలు జరిగాయి. మే 06 నుండి 12 వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో ఒకరోజు సాహిత్య కార్యక్రమానికి నన్ను అధ్యక్షుడిగా ఆహ్వానించారు టీ టీ డి- అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు.

ప్రారంభంలో అధ్యక్షోపన్యాసం నాలుగు మాటలు చెప్పి…ఆపై సభను నిర్వహించడం నాకు అప్పజెప్పిన పని. నాపక్కన వక్తలు సంస్కృతాంధ్ర పండితుడు, జగమెరిగిన శతావధాని, అచ్చతెలుగులో అవధానం చేయడంలో అందెవేసిన చేయి అయిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసి పదవీ విరమణ చేసిన వ్యాకరణ పండితుడు రేమిళ్ళ వెంకటరామకృష్ణ శాస్త్రి, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకుడు, పండితుడు, వ్యాఖ్యాత ఆకెళ్ల విభీషణ శర్మ. అన్నమయ్య సాహిత్యం మీద వేన వేల వ్యాసాలు రాసిన, ఉపన్యాసాలు ఇచ్చిన తెలుగు ప్రొఫెసర్ కె. సర్వోత్తమరావు, ప్రొఫెసర్ మలయవాసిని లాంటి పెద్దలు, సాహిత్య విద్యార్థులు శ్రోతలు.

అన్నమయ్య సాహిత్యం లేకపోతే తెలుగు భాషకు, మాండలికానికి ఎంత అన్యాయం జరిగి ఉండేది? అన్న విషయం మీద కాసేపు నా పరిమిత అవగాహన మేరకు నేను మాట్లాడాను. ఆకెళ్ల, రేమిళ్ల, పాలపర్తి అనేక విషయాల మీద లెక్కలేనన్ని ఉదాహరణలతో మాట్లాడారు.

ఈ సాహిత్య సభకు అధ్యక్షత వహించే అవకాశంతో ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకోగలిగాను. ఎప్పటి నుండో వారిని కలవాలని అనుకున్నా…నన్ను నేను అంత పెద్దవారితో ఎలా పరిచయం చేసుకోవాలో తెలియక మిన్నకుండిపోయాను. ఒకరు తిరుపతిలో ఉంటున్న అన్నమయ్య వంశంలో పన్నెండో తరం వ్యక్తి తాళ్లపాక హరినారాయణాచార్యులు. రెండో వ్యక్తి మంగళగిరిలో స్థిరపడ్డ అచ్చ తెలుగులో శతావధానం చేయగలిగిన పండితుడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్.

సాహిత్య సభ తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో కాబట్టి…అన్నమయ్య నిలువెత్తు విగ్రహం ముందే వేదిక. అక్కడ అన్నమయ్యకు హారతితో సభ మొదలవుతుంది. ఆ హారతి ఇచ్చి, ప్రార్థన గీతంగా అన్నమయ్య కీర్తన పాడిన వ్యక్తి తాళ్లపాక హరినారాయణాచార్యులు. ఆయన కనపడగానే కాళ్లకు నమస్కారం పెట్టి నన్ను నేను పరిచయం చేసుకుని…తాళ్లపాక పక్కనే పెనగలూరులో పుట్టిన నాకు తాళ్లపాకతో ఉన్న అనుబంధాన్ని, అన్నమయ్య సాహిత్యంలో ఉన్న పారవశ్యాన్ని చెప్పి…మీరు అనుమతిస్తే మీతో ఒక ఫోటో తీసుకోవాలి అని అడిగాను. సరేనన్నారు. సభ కాగానే ఆయన అన్నమయ్యకు నీరాజనం ఇచ్చి నన్ను ఆశీర్వదించారు.

దాదాపు అయిదు వందల ఏళ్లుగా తాళ్లపాక వంశస్థుల సుప్రభాతంతోనే తిరుమలలో స్వామికి సేవలు మొదలవుతున్నాయి. తాళ్లపాక హరినారాయణాచార్యులు, తాళ్లపాక నాగభూషణాచార్యులు, తాళ్లపాక రాఘవ అన్నమాచార్యులు ముగ్గురిలో ఒక్కో రోజు ఒకరు స్వామికి తొలి సేవ చేస్తున్నారు. అలాంటి అన్నమయ్య వంశస్థుడు పౌరోహిత్యం చేసిన సభలో అన్నమయ్య గురించి చెప్పడం ఒక మధురానుభూతి.

ఇంట్లో నాన్న అష్టావధాని కావడం వల్ల చిన్నప్పటి నుండి పద్యం అంటే నాకు పులకింత. ఎన్నో పద్యాలకు ఇప్పటికీ అర్థాలు తెలియకపోయినా…అలా పాడుకుంటూ గాల్లో తేలిపోతూ ఉంటాను. పద్యం పలకని రోజు నాకు రోజే కాదు. నాకొచ్చిన ఆవగింజంత భాషా జ్ఞానం పద్యాల వల్లే వచ్చిందని నా నమ్మకం. అత్యంత సరళంగా పద్యం రాయడం చాలా కష్టం. యతి, ప్రాస, ఛందస్సు, పాదాల్లో ఒదగడం…అంతా రాకెట్ సైన్సు కంటే సంక్లిష్టమయినది. అలాంటిది అవధానాల్లో ఆశువుగా పద్యాలు చెప్పడం, మళ్లీ వాటిని చివర అప్పజెప్పడం గొప్ప విద్య. ఆట. తెలుగువారికి మాత్రమే సొంతమయిన ఒకానొక సాహిత్య ప్రక్రియ.

అలాంటి ప్రక్రియలో అచ్చ తెలుగులో శతావధానాలు చేయడం ఇంకా కష్టం. పండిత కుటుంబంలో పుట్టి…సంప్రదాయ విధానంలో ఛందస్సు, వ్యాకరణాలు నేర్చుకుని, తెలుగు సంస్కృత భాషల్లో అపార పాండిత్యం సంపాదించి శతావధానిగా పేరు తెచ్చుకున్న పాలపర్తి శ్యామలానంద ప్రాసాద్ అవధాన విద్యను కొత్త తరానికి నేర్పుతున్నారు కూడా. గొప్ప విద్యా యజ్ఞం చేస్తున్న ఆయన్ను సభకు పరిచయం చేసే అవకాశంతో పాటు…ఇన్నేళ్లకు ఆయన్ను కలవగలిగే అవకాశం కూడా ఇలా కలిగింది. నాతో మాట్లాడాక “మీ నాన్నగారిని కలిసినట్లుంది” అని ఆయన నన్ను ఆశీర్వదించారు. మంగళగిరిలో నేను ఎక్కువగా ఉంటుంటాను కాబట్టి నా అజ్ఞానంతో మిమ్మల్ను విసిగించడానికి మీ ఇంటికి వస్తుంటాను అని ఒప్పందం కుదుర్చుకున్నాను.

టీ టీ డి ప్రచురించిన అన్నమయ్య ప్రథమ సంపుటి గ్రంథంతో పాటు ఇతర పుస్తకాలను, స్వామి వారి ప్రసాదాలను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ నా చేతిలో పెట్టి ఆశీర్వదించారు.

కొస విరుపు:-
అన్నమయ్య పదకవితల్లో తెలుగు గురించి ఈ సాహిత్య సభలో మాట్లాడ్డం కోసం అన్నమయ్య మీద వివిధ కోణాల్లో పొన్నా లీలావతమ్మ రాసిన 50 వ్యాసాల సంకలనం “పద కవితా వైజయంతి” పుస్తకాన్ని విమానంలో చదువుతుంటే…గగనసఖి ఇంగ్లీష్, హిందీ చిలుక పలుకుల్లో చెప్పిన మాట-
“ఈ విమానం తిరుపతికి వెళుతుంది. గంట ప్రయాణంలో మీకు మేము ఇంగ్లీష్, హిందీ, మరాఠీలో (తెలుగు తప్ప) సేవలు చేస్తాము” అని.
రాత్రి తిరుగు ప్రయాణంలో మరో గగనసఖి అయితే-
“ఆప్ అంగ్రేజీ, హిందీ, మరాఠీ, నేపాలీ, పంజాబీ (తెలుగు తప్ప) మే బోల్ సక్తే” అని నా మనో భావాలను తీవ్రంగా గాయపరిచింది. దానికి నిరసనగా ఆకలిగా ఉన్నా పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకోలేదు. సరిగ్గా రాత్రి తిరుపతిలో విమానం గాల్లోకి ఎగురుతుండగా Tirupati Airport తిరుపతి విమాశ్రయం అన్న ఎల్ ఈ డి అక్షరాలు కనిపించి మనసు విరిగిపోయింది. విమా తరువాత “నా” అక్షరం లోపల లైటు పోయి ఎన్ని రోజులయ్యిందో పాపం!

కాకి కాకినాడ మీద రెట్టేసింది అన్న మాటలో
కా మీద
కి మీద …రెట్టేసింది అని వరుసగా చెప్పు అని మా చిన్నప్పుడు ఆట పట్టించేవారు. వరుసగా చెబుతూ పోయి మధ్యలో “నా మీద రెట్టేసింది” అనగానే నవ్వేవారు.

ఆ కాకి కాకినాడ మధ్యలో “నా” అన్న అక్షరం మీదే రెట్ట వేయడంలో ప్రాంతీయ అసమానత ఉంది. అందువల్ల ఎక్కడ “నా” ఉన్నా రెట్ట వేసి మూసి చీకట్లోకి తోసినట్లుందనుకుని…విమానాశ్రయం మానాన్ని రాత్రిళ్లు కాపాడే “నా” ఎప్పటికి వెలుగుతుందో అనుకుంటూ… గగనసఖి శూర్పణఖ పైశాచి భాష వింటూ హైదరాబాద్ లో విమానం తలుపు తీయగానే పరుగులు తీశా!

“నాహం కర్తా”
అని అదే టీ టీ డి ఈ ఓ గా పని చేసిన పి వి ఆర్ కె ప్రసాద్ రాసిన పుస్తకం శీర్షిక. “నాదేమి లేదు…అంతా భగవంతుడిదే” అని అర్థం. అలా నాది…నాది…అనుకున్నది నీది కాదు అని చెప్పడానికి “నా” అక్షర దీపం ప్రతీకాత్మకంగా ఆర్పి రాత్రుళ్లు గాల్లో ఎగిరే ప్రయాణికులకు వేదాంత పాఠం చెప్పదలుచుకున్నారేమో!
దీపం వెలిగితే జ్ఞానం ప్రసరించడం సాధారణం. ఒక్కోసారి దీపం ఆర్పినా చీకటి కూడా పాఠం చెప్పగలదు అనుకోవడానికి…విమానాశ్రయంలో ఆశ్రయ కాంతి కోల్పోయిన ఈ “నా” నే ఒక ఉదాహరణ!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్