Karnataka with Congress: కొన్ని ప్రధానమయిన ఘట్టాలకు పతాక శీర్షికలు (బ్యానర్ హెడ్ లైన్స్) పెట్టడం ప్రింట్ మీడియాలో ఒక సవాలు. ఒక విద్య. ఒక నేర్పు. ఒక సృజనాత్మక రచనా విన్యాసం. మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా, ఒక్కసారి చూడగానే జీవితాంతం గుర్తుండిపోయేలాంటి హెడ్డింగులు పెట్టగలిగిన జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, రకరకాల పరిమితులు, యాజమాన్యాల పాలసీలు, ఇష్టాయిష్టాల వల్ల హెడ్డింగులు పెట్టేవారు చాలా పరిమితులకు లోబడి పని చేయాల్సి వస్తోంది.
హెడ్డింగ్ చూడగానే వార్త చదవాలనిపించేంత ఆసక్తిగా, వార్త సారం మొత్తం హెడ్డింగులో ప్రతిబింబించేలా, కవితాత్మకంగా, యతి ప్రాసలతో, చమత్కారంగా, తీయతేనియల తెలుగును పిండినట్లుగా రాయగలిగిన సమర్థులు చాలా మంది ఉన్నారు. కానీ, వారికి ఆ స్వేచ్ఛ, సమయం ఇవ్వడంలేదేమోనని అనిపిస్తుంది.
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు పత్రికలన్నీ తిరగేస్తే…నాకు తెలుగు పత్రికల పతాక శీర్షికల కంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీషు హెడ్డింగులే మెరుపులా అనిపించాయి.
“కాంగర్డ్” “కర్-నాటు…నాటు”
ఇంగ్లీషులో కాంకర్డ్ అంటే ఆక్రమించడం. కర్ణాటకను కాంగ్రెస్ ఆక్రమించింది అన్న అర్థం వచ్చేలా cong వరకు ఒక రంగు పెట్టి ఆ విరుపు మాటతో కాంగర్డ్ అన్న పతాక శీర్షిక పెట్టిన జర్నలిస్ట్ రచయిత విన్యాసం అసాధారణంగా ఉంది. అంతకు మించి లోపల పేజీలో “how congress did Kar- Naatu, Kar-Naatu?” అని ఈ మధ్య ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాట ఊతపదాన్ని కర్నాటులోకి ముడి వేసిన రచనా చమత్కారం మరింత అందంగా ఉంది. ఒక పాపులర్ విషయంతో ముడి పెట్టి చెప్పినప్పుడు దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎంత పరాయి భాష అయినా…మనసు పెడితే దాన్ని బాగా లోకలైజ్ చేయవచ్చు అనడానికి ఈ “హౌ డిడ్ కర్-నాటు నాటు?” పెద్ద ఉదాహరణ. దీని కొనసాగింపుగా “Double engine that powered cong quest” కూడా చాలా అర్థవంతంగా ఉంది.
రాష్ట్రంలో, కేంద్రంలో బి జె పి ప్రభుత్వాలే ఉంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ అన్నది బి జె పి నినాదం. దాన్ని తుత్తునియలు చేసిన కాంగ్రెస్ సిద్దరామయ్య- డి కె శివకుమార్ డబుల్ ఇంజిన్ వ్యూహం అన్నది ఆ వార్త సారాంశం. ఆ హెడ్డింగ్ చూస్తే చాలు…లోపలి కథనం చదవకపోయినా అంతా అర్థమయిపోతుంది.
తెలుగులో ఈ స్థాయి విరుపులు, మెరుపులు లేకపోయినా…మరీ చప్పగా అయితే లేవు. ఆంధ్రజ్యోతి, సాక్షి కాంగ్రెస్ చేతి గుర్తును శీర్షికలో పట్టుకున్నాయి. ఈనాడు శీర్షిక కాంగ్రెస్ కు ఊపిరిగా భావించింది.
కాంగ్రెస్ కు ఊపిరి- ఈనాడు:
కన్నడ సీమలో చేతికే ఫుల్ పవర్- సాక్షి:
చెయ్యెత్తి జై కొట్టిన కర్ణాటక- ఆంధ్ర జ్యోతి:
కొసమెరుపు:-
అన్నిటికంటే ఫలితాల తరువాత ప్రెస్ మీట్లో సిద్దరామయ్య- డి కె శివకుమార్ ఖాళీ కుర్చీని తదేకంగా, తమకంగా చూస్తున్న ఫోటో కోటి సంపాదకీయాల పెట్టు. ఆ క్షణాన అలాంటి ఫోటో తీసిన ఆ ఫోటోగ్రాఫర్ సమయస్ఫూర్తికి, జడ్జ్ మెంట్ కు చేతులెత్తి మొక్కాలి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]