Saturday, November 23, 2024
HomeTrending NewsOdisha: న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధానికి తప్పిన ముప్పు

Odisha: న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధానికి తప్పిన ముప్పు

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దుర్ఘటన మరవకముందే జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్‌ రైల్వే క్రాసింగ్‌ సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్‌ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్‌కు మధ్యలో ఇరుక్కు పోయింది. అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. ట్రాక్‌ మధ్యలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ను గమనించిన లోకో పైలెట్‌ వెంటనే అప్రమత్తమై రైలును ఆపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే డీఆర్‌ఎమ్‌ మనీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వస్తున్న సమయంలో బొకారో జిల్లాలోని భోజుదిహ్‌ స్టేషన్‌ సంతాల్దిహ్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద రైల్వే గేటు వేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ట్రాక్టర్‌ రైలు గేటును బలంగా ఢీ కొట్టింది. అనంతరం రైలు గేటు, పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో రైలు ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది’ అని తెలిపారు. ఘటన తర్వాత ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్