Friday, September 20, 2024

రుచి-పచి

Old food in New Plate:  ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? ఏదయినా పాశ్చాత్య రుచుల పనిపడదాం అని మా ఆవిడ ఒక ఆదివారం సాయంత్రం పక్షులు గూళ్లకు తిరిగి వెళ్లే వేళ సంకల్పం చెప్పుకుంది. ఎర్రమంజిల్ ఇంటి నుండి బంజారా హిల్స్ మీదుగా బి ఆర్ ఎస్ ఆఫీసు దాటుకుంటూ…ఫిలిం నగర్ కొండ అంచున స్లమ్ ఏరియాను ఆనుకుని ఉన్న నోరు తిరగని ఏదో పేరుతో ఉన్న హోటల్లోకి వెళ్లాము. మరో లోకంలా ఉంది. అక్కడున్నవారి మధ్యలో మేము అప్పుడే పాతరాతియుగం గుహల నుండి బయటి ప్రపంచంలోకి వచ్చినవారిలా, ఆ టేబుళ్ళకు అతకని వారిలా…మాకు మేమే సంతలో దారి తప్పి…అమ్మానాన్నల కోసం దీనంగా వెతుక్కుంటున్న పిల్లల్లా అయోమయంగా కూర్చోవడానికి టేబుల్ వెతుక్కున్నాం.

అది పెద్ద ఇల్లంటే ఇల్లు. పెద్ద హోటలంటే హోటల్. లాన్ అంటే లాన్. ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్. అన్నీ తెలిసినట్లే ఉంటాయి. ఏదీ అర్థం కాదు.

టేబుళ్ల ముందు కుర్చీల్లో కూర్చున్న అందరూ అవనత శిరస్కులై సెల్ ఫోన్లలో మునిగి ఉన్నారు. ఎంతకూ ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో ఏదో అనుమానం వచ్చి పక్క టేబుళ్లవారు ఎలా ఆర్డర్ ఇచ్చారో కనుక్కున్నాం. ఫోన్ కెమెరాతో స్కాన్ చేసుకోవడానికి క్యూ ఆర్ కోడ్ ఉన్న చెక్క ముక్క ఒకటి టేబుల్ మీద ఉంది. అందరూ అలా స్కాన్ చేసుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు బుద్ధిగా ప్రభుత్వ లైబ్రరీ ఆవరణల్లో దించిన తల ఎత్తకుండా చదువుకునే పిల్లల్లా ఫోన్లలో డిజిటల్ మెనూ కార్డు బట్టీ పడుతున్నారని తెలిసింది. మేము కూడా యు పి ఎస్ సి ఇంటర్వ్యూకు ముందు గట్టిగా ప్రిపేర్ అయినట్లు పదిహేను నిముషాలు ఆ మెనూ కార్డును పరిశీలనగా చదువుకున్నాం.

ఒక్కో టేబుల్ దగ్గర తినడానికి ఆర్డర్ ఇస్తున్నట్లు లేదు. ఆయా పదార్థాలను ఎలా వండుతారో? అందులో ఏమేమి వేస్తారో? ఎంతగా కాల్చుకుని తింటారో? టీ వీ డిబేట్లలోలా చర్చిస్తున్నట్లు వాయిస్ అంతా ఓవర్ ల్యాప్ అవుతోంది.

మనుషులు తినేవి ఏవయినా ఆర్డర్ ఇవ్వాలని అనుకుని పేరులో ఒక పదం మాత్రమే అర్థమయిన రెండు వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. తీరా టేబుల్ మీదికి అవి వచ్చాక అందులో ఒకటి ఉడకబెట్టిన మొక్క జొన్న ముక్క అని అర్థమయ్యింది. రెండోది చీజ్ పిజ్జా. పిజ్జా ముక్క నోట్లో పెట్టుకోవాలంటే అర కిలో మీటరు సాగే చీజ్ ను ఒడుపుగా హ్యాండిల్ చేయాలి. అప్పటికే ఆరు కిలో మీటర్లు ట్రాఫిక్లో విసిగిపోయి ఉన్నాం. మళ్లీ సాగదీత ఎందుకని…చీజ్ ను పక్కకు తోసి పిజ్జా ముక్క నోట్లో పెట్టుకున్నాం. ఈలోపు దాహమేసింది. ఇలాంటి చోట్ల మంచి నీళ్లు ఇవ్వరు కాబట్టి…గొంతు తడారిపోయే లోపు ఏదయినా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడ్డాము. వాడు పుణ్యాత్ముడు…వాడి సమయం ప్రకారం తెచ్చి ఇచ్చాడు.

కొసమెరుపు:-
మెనూలో బేబీ కార్న్ అంటే భాషా పరిజ్ఞానం ప్రకారం మొక్కజొన్న పిందెలు అనుకుని తినబోయాం. అది బేబీ కాదని కొరికాక తెలిసింది. వీధుల్లో బండ్ల మీద ఉడకబెట్టినట్లు మామూలు పెద్ద మొక్కజొన్నే. అప్పుడు పళ్లతో గింజలు మాత్రమే తిని…పిప్పిని పరిహరించాలో! వద్దో! తెలియక…చివరకు ధైర్యం చేసుకుని పరిహరించాం. మనకు తెలిసిందే భాష కాదు. ప్రపంచ భాష వేరే ఉంటుంది. ఇలాంటి చోట్లకు అనుభవజ్ఞులను తోడుబెట్టుకుని వెళ్లకపోతే అభాసుపాలవుతామని తెలిసి తెలిసి…వెళ్లి…అభాస అనుభవంతో వెనుదిరిగి వస్తూ ఉంటాను.

చివర బిల్లు కూడా స్కాన్ చేసి మా ఆవిడ పే చేసింది కాబట్టి…తిన్న పావు మొక్కజొన్న ముక్కకు, పాము విడిచిన కుబుసంలా చీజ్ విడిచిన పిజ్జా ముక్కకు ఎంతయ్యుంటుందని తెలుసుకోవాలని నాకనిపించలేదు. తెలిస్తే…ఈ అజీర్తికి ఆ అజీర్తి కూడా తోడై కడుపుకు కొల్లాటరల్ డ్యామేజ్ అవుతుంది!

నోరు తిరగని పేరే కాదు…పేరుకు తగినట్లు నోట్లో కూడా ఏదీ తిరగలేదు.

“ఆకలి రుచి ఎరుగదు- డబ్బుకు విలువ లేదు” అంటే ఏమిటో తెలియడానికి ఇలాంటివాటికి వెళుతూ ఉండాలి.
తగిన మూల్యం చెల్లిస్తే తప్ప-
జ్ఞానం ఎవరికీ ఊరికే రాదు. రాకూడదు!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్