One & Only: శ్రద్ధాళువుకు ప్రశ్న గొప్ప దోహదకారి. ఒక విషయాన్ని విశ్లేషించడం కోసం, లేదా ఒక సమస్యను ఛేదించడం కోసం ఉన్న ఒకే ఒక పనిముట్టు అది, బహుశా. గమ్మత్తైన ఒక పని ఏమంటే, ఒక విషయవిశ్లేషణకోసం వేయబడ్డ ఒక ప్రశ్నను విశ్లేషించడం. దాని వల్ల ఒక ప్రశ్నకు ఉండే బరువు తెలిసివస్తుంది. తద్వారా జరిగే ఆత్మవిమర్శ అంతశ్శుద్ధతను పదింతలు చేస్తుంది. ప్రశ్నా-సమాధానం ఈ రెండూ ఎల్లప్పుడూ ఒకే పరిమాణంలో వ్యతిరేకదిశలో ఉండే వస్తువులు కావు. ప్రశ్న ఎలా వచ్చిందో సమాధానమూ అలానే రావాలి అన్న నియమం లేదు. అలానే ఎల్లవేళలా ప్రశ్నకూ సమాధానానికీ పరస్పరం ఒకదానిని మరొకటి తప్పనిసరిగా తట్టిలేపాల్సిన బాధ్యత ఏమీ లేదు. ప్రశ్న వేయడం ద్వారా సమాధానాన్ని ఇవ్వాల్సిన వ్యక్తి ప్రాశ్నికుడి చేతులలోకి వెళ్లిపోవడం అనేది జరుగదు – మరీ ముఖ్యంగా ఆధ్యాత్మికప్రపంచంలో.
రాముడెవరు అనే ప్రశ్న ఎటువంటిది? నా చేతికి ఉన్న వేళ్లెన్ని అన్న ప్రశ్నవంటిదా? కారు తాళం కనబడడం లేదు, ఎక్కడుంది? అనే ప్రశ్న వంటిదా? పీకలలోతు వరకూ ముంచిన అప్పులు తీరేందుకు మార్గమేది అన్న ప్రశ్నవంటిదా? కుల, మత రాజకీయాలను నిర్మూలించడం ఎలా అన్న ప్రశ్నవంటిదా? దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న నా బంధువు కోలుకునేదెలాగ? అన్న ప్రశ్నవంటిదా? లేదా భూమి ఎందుకు గుండ్రంగా ఉంది అన్న ప్రశ్నవంటిదా?]
పై ప్రశ్నలతో రాముడెవరు? అన్న ప్రశ్నను పోల్చడం ఉచితమేనా అని మరొక ప్రశ్న. పైవన్నీ భౌతికమైన లౌకికమైన ప్రశ్నలు అన్నది ఒక అంశమైతే, ఆయా ప్రశ్నలద్వారా నాకు లభించే సమాధానమూ, నా సమస్యకు సాధనా ఏమిటో అన్నది మరొక అంశం. ఇప్పుడు రాముడెవరు అన్న ప్రశ్నతో నాకు ఒరిగే ప్రయోజనమేమిటి అన్నది మూలోద్దేశం. వీటి ఆధారంగానే ఆ ప్రశ్నతో మన వినిమయం ముందుకు వెళుతుంది.
- మొదటిది:- రాముడిలోని ఆదర్శగుణాలను నేర్చుకోవడానికి ప్రయత్నించడంకోసం
- రెండవది:- అందరూ శిరసులువంచే రామాయణం నిజంగా అంత గొప్పదా అన్న వివేచన తప్పొప్పుల పరిశీలన ఇత్యాదులకోసం.
- మూడవది:- రామాయణం పై ఒక రచన చేయడం
- నాలుగవది:- ఆదిపురుష్ వంటి ఒక సినిమా తీయడం
ఇలా రకరకాల ప్రయోజనాలను ఉద్దేశించి, ఈ ప్రశ్నను రకరాకల స్వభావవంతులు వేస్తున్నారు. లౌకికప్రపంచంలో ఉన్న తరహా మాదిరిగా, ప్రశ్నవేయడమంటే సమాధానానికి గాలం వేసినట్లుగానే, రాముడెవరని ప్రశ్నించి, ఆ గాలంతో లాగితే మనవైపుకు వచ్చే రాముడు ఎవరు?
“నా రాముడా?”
“నా రామాయణము”, “నా రాముడు” అని ఎవరైనా భగవంతుడిని, భగవచ్చారిత్రమును ఓన్ చేసుకోవచ్చా? ఎంతవరకూ? చేసుకుని వారి వారికి నచ్చినట్లుగా బ్రతికే ఒక సినిమా నటుడు, సినిమా నాయిక, ఒక దర్శకుడు – వీలైనంత ఉపవాసాలూ దైవదర్శనాలూ చేసుకుని సినిమాగా తీసి హనుమంతుడికి ఒక సీటు అట్టేపెట్టి మరీ ప్రకటిస్తేనో; లేదా ఒక రచయిత పుస్తకంగా వ్రాసి రామాంకితంగా ప్రకటిస్తేనో మనకు దక్కే రాముడెవరు?
“నేను రామదాసును”, “నేను తులసీదాసును”, “నేను సుందరదాసును” అనో, లేదా “రాముడు త్యాగరాజనుతుడు” ,”రాముడే పరమదైవము”, “రాముడు మూర్తీభూతధర్మము” ఇత్యాదిగా భక్తులచేత, భాగవతుల చేత ఋషులచేతా ప్రతిపాదింపబడిన రాముడెవరు?
రాముడెవరు?
రాముడికి కోరమీసముండేదా? సీతాదేవి లంకలో తనను అన్వేషిస్తూ వచ్చిన హనుమంతుడికి ఇచ్చింది చేతిగాజునా? ఇత్యాది ప్రశ్నలు మనలో పుట్టించి, గ్రాఫిక్సు మీద ప్రేమతోనో, హీరో, హీరోయిన్లపై మోజుతోనో సినిమాకు రప్పించే రాముడూ;
మనం ఆయన చరిత్రమైనా మార్గంపైనా మన బుద్ధితో సంధించే నానాప్రశ్నలకు ఆవలవైపు సమాధానమివ్వాల్సిన చోటులో ఉన్నాడని మనం భావించే రాముడూ;
తమకు నచ్చే హీరో లేదా మానవ ముఖాన్ని గ్రాఫిక్సు ద్వారా ఒక రూపానికి అంటిస్తే తయారయ్యే రాముడూ;
రామాయణంపై జోకులు వేసుకుని కొందరు నవ్వుకుంటూ ఉంటారే…ఆ రాముడూ;
కోప్యహమ్మతిర్ గోచరం వినా
లోకధాత్రి తే రూపభావనా అని గణపతి ముని నిర్వచించినట్లుగా అనన్యభక్తితో శాస్త్రప్రకారంగా రాముడి రూపభావననూ, కోట్లకుకోట్లుగా మంత్రభావననూ, తన గాన కవిత్వాది నివేదననూ, రామాయణ గానాన్నీ తపస్సునూ ఆజీవితాంతం చేస్తే ప్రత్యక్షమై దుఃఖాన్ని పెకల్చి శాశ్వతానందసుఖాన్ని దయచేసే అద్వితీయదయామూర్తి రాముడూ…
వీరిలో అసలు రాముడెవరు? మనం ఏ రాముడి భక్తులం?
రాముడెవరు?
యే ముక్తావపి నిస్పృహాః ప్రతిపద
ప్రోన్మీలదానందదాం
యామాస్థాయ సమస్తమస్తకమణిం
కుర్వంతి యం స్వే వశే
తాన్ భక్తానపి తాం చ భక్తిమపి తం
భక్తప్రియం శ్రీహరిం
వందే సంతతమర్థయేఽనుదివసం
నిత్యం శరణ్యం భజే
ఎవరైతే ముక్తియందు కూడా నిస్పృహతో ఉంటారో,
పదం పదం లోనూ వికసించే ఆనందాన్నిచ్చేటువంటి దేనిని ఆశ్రయించి, సర్వోత్కృష్టుడైన పరమాత్మను కూడా తమ వశంలో ఉంచుకుంటారో
ఆ భక్తులనూ,
ఆ భక్తినీ;
ఆ భక్తప్రియుడైన శ్రీహరినీ
నేను నిరంతరం శరణు వేడుతూ
నాకు హితవు చేకూరడం కోసం ప్రతిదినమూ నమస్కరిస్తాను.
-పరిమి శ్రీరామనాథ్