Mini Review: …అవును. కానీ ఇది సినిమాకి సంబంధించిన విషయం. నిజజీవితంలో కూడా చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే. చదువుకుని, ఉద్యోగం చేసే అమ్మాయిలు ఆత్మ విశ్వాసంతో సమస్యలు దాటగలరనడానికి నిదర్శనం ‘హలో మీరా’ సినిమా. హీరోయిన్ గా గార్గేయి యల్లాప్రగడ చాలాబాగా చేసి, మీరా పాత్రలో జీవించింది.
చాలామంది అమ్మాయిలు తమ జీవితంలో ఇటువంటి సందర్భం ఎదుర్కొంటారు కూడా. ఏదో ఒక దశలో స్నేహం పరిధి దాటి ప్రేమలో పడటం చూస్తూనే ఉంటాం. ఒక్కో సారి ఈ ప్రేమలు పెళ్లిదాకా వెళ్లవు. చాలావరకు రాజీ పడి వేరేవారిని చేసుకుంటారు. కొంతమంది మాత్రం తమకు దక్కని ప్రేమ అవతలివారికీ దక్కకూడదని ఇబ్బందులు సృష్టిస్తారు. ఇదే హలో మీరా సినిమా కూడా. అయితే ఒకేఒక్క పాత్రతో సినిమా నడిపించిన దర్శకుడు శ్రీనివాస్ కాకర్ల ధైర్యం అభినందనీయం. కథ పై ఎంతో నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం. అతని నమ్మకం వమ్ము కాలేదు కూడా.
దాదాపు ప్రతి అమ్మాయి తనని తాను మీరా పాత్రలో చూసుకుంటుంది. తల్లిదండ్రుల బాధ్యతలు, పెళ్లి లో నిజాయతీ వంటి అంశాలనూ సున్నితంగా చూపారు. చూసేది ఒక్క అమ్మాయినే అయినా మాటలద్వారానే అనేక పాత్రలు పరిచయమవుతూ పరుగెత్తిస్తాయి. మీరా పట్ల సానుభూతి పెరిగి ఆమె సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటాం. చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయే వారికి సమస్యను ధైర్యంగా ఎలా ఎదుర్కోవచ్చో చూపే సినిమా. మానవ జీవితాలని సంక్లిష్టం చేస్తున్న టెక్నాలజీ, దాన్నే ఉపయోగించి సమస్య లోంచి బయట పడటం బాగుంది. మొత్తమ్మీద హాయిగా సరదాగా చూసేయదగ్గ సినిమా.
P. S – హీరోయిన్ కి కాబోయే శ్రీవారు కళ్యాణ్ పాత్రధారి మాటలు ‘విస్మయ’ రుచుల గాత్రాన్ని గుర్తుచేస్తాయి.
కె. శోభ