Unity in Diversity: మౌర్యుల నుంచి లోహియా, జయప్రకాశ్ నారాయణ్ దాకా భారత రాజకీయ చరిత్రలో ఎత్తుగడలకు పెట్టింది పేరు పాటలీపుత్రం (పాట్నా). యాదృచ్చికమో, మరొకటో గానీ ప్రతిపక్షనేతలంతా (ప్రధాన పార్టీల) పాట్నాలో శుక్రవారం సమావేశం కాబోతున్నారు. ఇటీవలి కాలంలో విపక్షాలన్నీ ఈమాత్రమైనా ఏకతాటిపైకి రావటం ఇదే తొలిసారి. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోడీ సారథ్యంలోని భాజపాను ఓడించడమే ఈ సమావేశ ఏకైక లక్ష్యం అనేది బహిరంగ రహస్యం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవతో జరుగుతున్న ఈ భేటీ లక్ష్యాన్ని సాధించగలుగుతుందా అనే ప్రశ్న తలెత్తటం సహజం. దీనికి సమాధానం దొరకాలంటే ఈ కూటమికున్న అవకాశాలు, అవరోధాలను విశ్లేషించుకోవాలి.
జాతీయ స్థాయిలో ప్రస్తుతం భాజపాకు బలమైన ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చాలా కాలంగా విపక్ష నాయకత్వ సీటు ఖాళీగా ఉంది. కాంగ్రెస్ కు నెహ్రు కుటుంబ సారథ్యం పెద్ద బలహీనతగా మారింది. ఎన్ని అవకాశాలు, ఎంత సమయం ఇచ్చినా రాహుల్ గాంధీ, ప్రియాంక లాంటి వారు ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతున్నారనేది కళ్ళకు కనిపిస్తున్న దృశ్యం. భాజపాకు పోటీగా కాంగ్రెస్ ను బలంగా నిలబెట్టలేక పోతున్నారనేది అంతా అంగీకరించే వాస్తవం.
మోడీని విమర్శించడం, ఆయనపై వ్యంగాస్త్రాలు సంధించటం నేర్చుకున్న రాహుల్ గాంధీ, తానెలా ప్రత్యామ్నాయ శక్తిగా అవుతాడో, భవిష్యత్ భారతంపై తన ఆలోచనలేంటో మాత్రం స్పష్టంగా, ఆకట్టుకునేలా చెప్పలేకపోతున్నాడు. అనేక ఇంటర్వ్యూ ల్లో మాటలు రాక, నిమిషాలపాటు పదాలకోసం వెతుక్కుంటూ…తడబడుతూ మాట్లాడుతున్న తీరు, విదేశీ వేదికలపై పదే పదే మన దేశ పరువు తీస్తున్న వైనం ఆయన నాయకత్వాన్ని పలుచన చేస్తోంది. మొత్తానికి నెహ్రూ కుటుంబ నీడలో కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు భాజపాకు ధోకా లేని పరిస్థితి కనిపిస్తోంది. భాజపా స్యయంకృతాపరాధాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకొని, వీరు తప్ప ఎవ్వరైనా ఫర్వాలేదనేంత దారుణంగా తయారైతేనే కాంగ్రెస్ కు అధికారం సాధ్యమనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అడపా దడపా నెగ్గుతున్నా అది స్థానిక పరిస్థితుల కారణంగానే తప్ప, జాతీయ స్థాయి విజయానికి దారితీసేది కాదు.
ఉదాహరణకు కర్ణాటక అలాంటిదే. కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి కారణం ఆ పార్టీ గొప్పతనమో, రాహూల్ నాయకత్వ మహిమో ఎంతమాత్రం కాదు. భాజపా అసమర్ధ పాలనపై, స్థానిక నాయకత్వంపై ప్రజలు వెలిబుచ్చిన ఛీత్కారం. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీని పరిమితంగా వాడుకున్నకాంగ్రెస్, నెగ్గగానే ఆయన జోడో యాత్ర వల్లే గెలిచామని చెప్పడం వారి ఆత్మవంచనకు నిదర్శనం. కర్ణాటక ఫలితంతో మోడీపై, భాజపాపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందనే ధీమాలో రాహుల్ ను విపక్ష నేతగా భావిస్తే మోడీని మించి సంతోషించేవారు మరొకరు ఉండరు. అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. భారత ఓటర్లు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భిన్నంగా ఓటు వేస్తున్నారనే సంగతి మరవరాదు. కర్ణాటకలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇదే స్థాయిలో సీట్లు సాధిస్తుందని చెప్పలేం.
విపక్ష కూటమికి అతిపెద్ద బలహీనత కాంగ్రెస్, రాహూల్ పెద్దన్న పాత్రే! రేపటి సమావేశానికి వస్తున్న నేతలందరికీ ఈ దేవతా వస్త్రం లాంటి నిజం తెలుసు. ప్రస్తుతానికి పైకి అనలేరంతే. అలాగని కాంగ్రెస్ ను పూర్తిగా కొట్టిపారేయటానికీ లేదు. ప్రాంతీయ పార్టీలు, ఇతరత్రా ఎన్ని పార్టీలు వచ్చినా, చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినా ఇప్పటికీ దేశ వ్యాప్తంగా భాజపాకు పోటీ కాంగ్రెస్సే! దాదాపు 200 లోక్ సభ సీట్లలో ప్రాంతీయ పార్టీలు లేనేలేవు. కాబట్టి ప్రాంతీయ పార్టీలెంత బలంగా ఉన్నా కాంగ్రెస్ లేకుండా విపక్షాన్ని తయారు చేయటం అసాధ్యం. ఎంత కాదనుకున్నా ఆ పార్టీ కేడర్ బలంగా ఉంది, లేనిదల్లా బలమైన లీడర్. ఆ ఒక్కటీ కుదురుకుంటే దేశ రాజకీయ ముఖ చిత్రమే మారుతుంది, వచ్చే ఎన్నికల్లో మోడీకి, భాజపాకు బలమైన పోటీ ఇస్తుంది. అందుకే కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం అవసరం.
కొంత కాలంగా దేశంలో జరుగుతోన్న ఎన్నికలు అర్జెంటీనా-భారత్ సాకర్ మ్యాచ్ ను పోలి ఉంటున్నాయి. ఎవరు గెలుస్తారనే దానికంటే కూడా అర్జెంటీనా ఎంత తేడాతో గెలుస్తుంది? ఎన్ని గోల్స్ కొడుతుందనే దానిపైనే అందరి ఆలోచన. దేశంలో ఎన్నికలు కూడా సరిగ్గా అలాగే… నరేంద్ర మోడీ సారథ్యంలోని భాజపా అర్జెంటీనా , విపక్షం భారత ఫుట్ బాల్ జట్టులా మారిపోయాయి. ఏ ఎన్నిక తీసుకున్నా అదే శైలి!
విపక్షాలు ఐక్యత సాధించలేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలు కూడా కాస్త అటూ, ఇటూగా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఇలా కాకుండా ఎన్నికలు హోరాహోరీగా జరగాలంటే ఏం అవసరం? కాంగ్రెస్ ను దాటి మరో రాజకీయ శక్తి ధీటుగా ఎదగాలి. పంజాబ్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. గుజరాత్ ఎన్నికలు ఓ దారి చూపిస్తాయి. రాజకీయం అనాసక్తంగా, విపక్షం అశక్తంగా, అసమర్ధంగా మారిన చోట్ల కేజ్రీవాల్ పార్టీ ఓ ప్రత్యామ్నాయంగా, ఆప్ హామీలు ఓ ఆసక్తికర పరిణామంగా ప్రజలను ఆకట్టుకోవడం గమనార్హం.
దాదాపు 3 దశాబ్దాలుగా భాజపాకు ఏకపక్షంగా మారిన గుజరాత్ లో మొన్నటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో కొత్త కళ వచ్చింది. కొద్దినెలల కిందట జరిగిన ఈ ఎన్నికల్లో భాజపా మళ్ళీ ఘన విజయం సాధించినా ఆప్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈజీగా గెలవాల్సిన పరిస్థితి నుంచి అప్రమత్తం కావాల్సిన స్థితి బిజెపికి ఎదురైంది. మోడీ సైతం కష్టపడి ప్రచారం చేసి, వారి మనసును గెల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి. సంస్థాగత బలం లేక ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినా ఆప్ తన మార్కు చాటింది. పంజాబ్ లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగి తద్వారా ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. అలాగని ప్రతి రాష్ట్రంలో ఇలానే జరుగుతుందని ఆశించలేము. దేశవ్యాప్తంగా భాజపా, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఆప్ మారే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. బలమైన పార్టీలున్నప్పుడే భారత ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది. ఎన్నికలపై ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది.
రాహూల్ గాంధీ పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్రస్తుతం ప్రజా ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హత కోల్పోయిన రాహూల్ పెద్దగా చేసేదేమీ లేదు. అనర్హత సమయం పూర్తయ్యేదాకా నిష్పక్ష స్వీయ సమీక్ష నిర్వహించుకోవటం మంచిది. ఈలోపే కోర్టు తీర్పు ద్వారా ఏదైనా ఉపశమనం లభిస్తే, సంబరపడి మళ్ళీ మోడీపై తిట్ల దండకం మొదలెట్టకుండా, విదేశాల్లో భారత్ ను వెక్కిరించకుండా తనను తాను మోడీకి ప్రత్యామ్నాయంగా మలచుకోవడం మీద దృష్టి పెట్టాలి.