Wednesday, November 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలంగాణ హైకోర్టులో తొలి తెలుగు తీర్పు

తెలంగాణ హైకోర్టులో తొలి తెలుగు తీర్పు

Local Justice:  తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తొలిసారి తెలుగులో తీర్పును వెలువరించడంతో భాషాభిమానులకు ఆనందంగా ఉంది.

ఇందుకు చొరవ చూపిన ఇద్దరు న్యాయమూర్తులకు భాషాభిమానులు కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఏనాడో జరిగి ఉండాల్సింది…ఈనాటికయినా జరిగినందుకు సంతోషం.

2006లో నిజామాబాద్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ న్యాయమూర్తిగా మంగారి రాజేందర్ తెలుగులో తీర్పు వెలువరించారు. ఆయన మంచి రచయిత. మూడు దశాబ్దాలుగా “జింబో” కలం పేరుతో న్యాయసంబంధమయిన విషయాలతో పాటు సాహితీ వ్యాసాలు కూడా రాశారు. రాస్తున్నారు. తెలుగు భాషాభిమాని. మాండలికాల మీద లోతయిన అవగాహన ఉన్నవారు. న్యాయసంబంధమయిన చిక్కుముళ్లు అందరికీ అర్థమయ్యేలా అత్యంత సరళమయిన తెలుగులో ఆయన రాసిన రచనలు ఒక్కో అంశంతో విడివిడి పుస్తకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు సాహిత్య కార్యక్రమాల్లో కలిసిన పరిచయంతో ఆయనతో అప్పుడప్పుడూ మాట్లాడుతుంటాను. తెలంగాణా ఉన్నత న్యాయస్థానం తెలుగు తీర్పు వార్తను చాలా మంది ఆనందంగా నాకు పంపారు. దీనిమీద నాలుగు ముక్కలు రాయాలని అడిగారు.

వెంటనే మంగారి రాజేందర్ గారికి ఫోన్ చేసి కొన్ని వివరాలు సేకరించాను. ప్రశ్న- సమాధానం రూపంలో ఆ వివరాలు:-

ప్రశ్న:-
తెలుగులో తీర్పు ఇవ్వాలని మీకెందుకు అనిపించింది?

మంగారి రాజేందర్:-
సామాన్యులకు మాతృభాషలో చెబితే వెంటనే అర్థమవుతుంది. మన భాషలోనే తీర్పు ఎందుకివ్వకూడదు అనిపించి…ప్రయత్నించాను.

ప్రశ్న:-
తొలిసారి తెలుగులో తీర్పు ఇచ్చాక తెలుగు సమాజం నుండి ఎలాంటి స్పందన వచ్చింది?

రాజేందర్:-
తొలిసారి అవునో కాదో తెలియదు. అంతకుముందు కూడా ఇచ్చి ఉండవచ్చు. ఇన్నేళ్ళుగా కథలు, కవితలు, వ్యాసాలు రాస్తున్నా…ఏనాడూ లేనంత స్పందన తెలుగు సమాజం నుండి వచ్చింది. ప్రవాసాంధ్రులు అనేక మంది ప్రత్యేకంగా ఫోన్లు చేసి అభినందించారు. మీడియాలో కూడా తగిన ప్రాధాన్యం రావడంతో…తరువాత తెలుగు తీర్పులకు నా ప్రయత్నం ఒక ఒరవడి అయ్యింది.

ప్రశ్న:-
న్యాయస్థానాల్లో వాదోపవాదాల్లో కానీ, విచారణల్లో కానీ, ఉత్తర్వులు, తీర్పుల్లో కానీ తెలుగును వాడడంలో ఉన్న ఇబ్బందులేమిటి?

రాజేందర్:-
ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి ఇబ్బందులూ లేవు. న్యాయ పరిభాష(లీగల్ టెర్మినాలజీ) తెలుగులో సరిగ్గా లేకపోవడం, ఉన్నా అది కఠినంగా ఉండడం ఒక్కటే సమస్య. ఈరోజుల్లో గూగుల్ అనువాదాలతో పాటు అనేక ట్రాన్స్ లేషన్ యాప్స్, కృత్రిమ మేధ పరికరాలు వచ్చాయి కాబట్టి…పరిభాష సమస్యను కూడా సులభంగా అధిగమించవచ్చు. సాఫ్ట్ వేర్ అనువదించాక మరీ కృతకంగా ఉన్న పదాలను మాత్రం చూసి మార్చుకోవచ్చు.

ప్రశ్న:-
భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయా?

రాజేందర్:-
హై కోర్టుల్లో లేకపోయినా…జిల్లా కోర్టులు, అంతకంటే కింది కోర్టుల వరకు హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ భాషల్లో ఎప్పటినుండో స్థానిక భాషలోనే తీర్పులను వెలువరిస్తున్నారు.

న్యాయ పారిభాషిక పద నిఘంటువును తెలుగులో సమగ్రంగా తయారు చేసుకుంటే తెలుగులో విరివిగా తీర్పులు రావడానికి రాచబాట పడుతుంది.

ఇంగ్లీషులో తీర్పు ఎలాగూ ఉండనే ఉంటుంది కాబట్టి తెలుగు తెలియనివారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్