రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. అయన వయస్సు 82 సంవత్సరాలు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ తో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.
1986లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అజిత్ సింగ్ ఆ తర్వాత ఆరుసార్లు లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. కేంద్రంలో వి పి సింగ్, పి.వి. నరసింహా రావు, అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ మంత్రివర్గాల్లో పని చేశారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బలమైన నేతగా పేరుపొందారు. అజిత్ సింగ్ కుమారుదు జయంత్ చౌదరి కూడా మధుర నియోజకవర్గం నుంచి 2009లొ లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలంగాణా ఉద్యమానికి అజిత్ సింగ్ మద్దతుగా నిలిచారు. కెసిఆర్ ఉద్యమ సమయంలో నిర్వహించిన అనేక భారీ సభల్లో అజిత్ సింగ్ పాల్గొన్నారు.
ఏప్రిల్ 20 న అజిత్ సింగ్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటినుంచి గుర్గావ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొదుతున్నారు.పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం అయన మరణించారు. అయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అన్ని పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.