Saturday, November 23, 2024
HomeTrending NewsNetherlands: నెదర్‌లాండ్స్‌ ప్రధాని రాజీనామా

Netherlands: నెదర్‌లాండ్స్‌ ప్రధాని రాజీనామా

నెదర్‌లాండ్స్‌ ప్రధాని మార్క్ రట్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్‌ రట్‌ తప్పుకున్నారు. తనతోపాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వలసల విధానంపై ఏకాభిప్రాయం కోసం కొన్ని రోజులుగా పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

వలసలను అడ్డుకునే విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని ప్రధాని మార్క్‌ రట్‌ అన్నారు. ఈసారి చర్చల్లోనూ భాగస్వామ్యపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయని, దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. రాజీనామా లేఖను నెదర్‌లాండ్స్‌ రాజు విల్లెమ్ అలెక్సాండర్‌కు అందజేశారు. అధికారం చేపట్టిన ఏడాదికే సంకీర్ణం ప్రభుత్వం కూలిపోవడం గమనార్హం.

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మార్క్‌ రట్‌ నిలిచారు. 2010లో ఆయన తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాగా, రట్‌ రాజీనామాతో పార్లమెంటులోని దిగువసభలో ఉన్న 150 సీట్లకు ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

కాగా, విదేశీ శరణార్థులతో వలసల శిబిరాలు కిక్కిరిసిపోయిన విషయం గతేడాది వెలుగులోకి రావడం దేశంలో సంచలనానికి దారితీసింది. దీంతో, వలసల కట్టడికి వీవీడీ పార్టీ నేత మార్క్ రట్ ప్రయత్నించారు. విదేశీ శరణార్థుల కుటుంబసభ్యులను దేశంలోకి అనుమతించడంపై పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్