ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఐసీఎంబీని నార్త్ కొరియా పరీక్షించినట్లు జపాన్, దక్షిణ కొరియా దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ దూరం వెళ్లే ఆ క్షిపణి దాదాపు గంటన్నర వరకు గాలిలో ప్రయాణించినట్లు తెలిపారు. జపాన్ కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం సుమారు పదకొండు గంటల తర్వాత ఆ మిస్సైల్ జపాన్ సముద్ర జలాల్లో పడినట్లు వెల్లడించారు. ఇటీవల అమెరికా నిఘా విమానాలు ఉత్తర కొరియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా మరోసారి ఐసీఎంబీ పరీక్షతో అమెరికాకు వార్నింగ్ ఇచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏదో విధంగా దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ లతో కయ్యానికి కాలు దువ్వెందుకు ఉత్తర కొరియా తరచుగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తోంది.
ఒకవేళ అమెరికా యుద్ద విమానాలు తమ గగనమార్గంలోకి ప్రవేశిస్తే వాటిని షూట్ చేస్తామని కూడా ఉత్తర కొరియా హెచ్చరించిన విషయం తెలిసిందే. నార్త్ కొరియా చేసిన ఆరోపణల్ని అమెరికా ఖండించింది. తమ సైనిక విమానాల పెట్రోలింగ్ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు వెల్లడించింది. ఇటీవల నార్త్ కొరియా వరుసగా క్షిపణుల్ని పరీక్షించడంతో ఉద్రిక్తత మొదలైంది. ఆ తర్వాత అమెరికా, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టాయి.
ఈ మధ్య కాలంలో డజన్ల సంఖ్యలో ఉత్తర కొరియా పరీక్షలు చేపట్టింది. దాంట్లో ఓ నిఘా శాటిలైట్ కూడా ఉంది. అయితే ఆ పరీక్షలో ఉత్తర కొరియా విఫలం అయ్యింది. ఘన ఇంధనానికి చెందిన ఐసీబీఎంను పరీక్షించినట్లు నార్త్ కొరియా ఏప్రిల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.