చెక్ రిపబ్లిక్ స్టార్ వొండ్రుసోవా- ట్యునీషియా ప్లేయర్ ఆన్స్ జేబ్యూర్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు చేరుకున్నారు.
నేడు జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన వొండ్రుసోవా 6-3;6-3 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్విటోలినాపై అలవోకగా గెలుపొంది టైటిల్ రేసులో నిలిచింది. వొండ్రుసోవా 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు చేరుకొని ఓటమి పాలైంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో రెండో స్థానంలో నిలిచింది.
మరో సెమీ ఫైనల్లో బెలారస్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 2 ర్యాంకింగ్ లో ఉన్న అరీనా సబలంక పై ట్యునీషియా ప్లేయర్, ఆరో సీడ్ ఆన్స్ జేబ్యూర్ 6-7; 6-4;6-3 తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగు పెట్టింది. జేబ్యూర్ గత ఏడాది కూడా వింబుల్డన్ ఫైనల్ చేరుకున్నా ఎరీనా రిబకినా చేతిలో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగు పెట్టడం గమనార్హం.
పురుషుల డబుల్స్ లో నేడు జరిగిన సెమీస్ పోరులో ఇండియా ఆటగాడు రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ పై 7-5; 6-4 తో వెస్లీ కూల్ హోప్ (నెదర్లండ్స్)-నీల్ కుప్సి (ఇంగ్లాండ్) ద్వయం గెలుపొంది ఫైనల్స్ కు చేరుకుంది.
మరో సెమీ ఫైనల్లో జర్మన్ జోడీ టిమ్ పుట్జ్-కెవిన్ క్రాత్జ్ పై 6-4;6-3 తేడాతో మార్సిన్ గ్లానోరస్ (స్పెయిన్)- హోరేసియో (అర్జెంటినా) ద్వయం గెలుపొంది ఫైనల్లో ప్రవేశించారు.