Friday, September 20, 2024
HomeTrending NewsDelhi Floods: సుప్రీంకోర్టు..రాజఘాట్ చేరిన వరద

Delhi Floods: సుప్రీంకోర్టు..రాజఘాట్ చేరిన వరద

రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యమున నది శాంతించకపోవడంతో హస్తిన ఓ నదిలా మారింది. ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల ఇళ్లు, సచివాలయం సహా చారిత్రక కట్టడం ఎర్రకోట, రాజఘాట్ ను సైతం వరద ముంచెత్తింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు మేర నీరు చేరింది. పలు కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ వరద సుప్రీంకోర్టు కాంప్లెక్స్ లోకి కూడా ప్రవేశించింది.

యమునా నదిలో వరద ఉధృతి కొంత మేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉన్న నీటి మట్టం. శుక్రవారం ఉదయం 6 గంటలకు 208.46కు తగ్గింది. మధ్యాహ్నం 1 గంటకు 208.30 మీటర్లు తగ్గొచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. మరోవైపు వరదల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. లఖింపుర్ ఖేరీ జిల్లాలోని శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఉన్న పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కర్దాహియా మన్ పూర్ గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నదిలో కొట్టుకుపోయింది.

ఆ సమయంలో పాఠశాలలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉధృతి కారణంగా వారం రోజుల్లోనే దాదాపు డజనుకు పైగా ఇళ్లు, గుడిసెలు కొట్టుకుపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని వాపోయారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్