Saturday, November 23, 2024
HomeTrending NewsFloods-Projects: తెలంగాణ ప్రాజెక్టుల్లో జల కళ

Floods-Projects: తెలంగాణ ప్రాజెక్టుల్లో జల కళ

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వచ్చిచేరుతున్నది. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 1,49,995 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పూర్తిస్థాయికి చేరుకుంటున్నది. శ్రీరాంసాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1079.10 అడుగుల వద్ద ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు 49.968 టీఎంసీలు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కులు వస్తున్నది. జలాశయం 1405 అడుగులుకాగా, ప్రస్తుతం 13972.52 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. కౌలాస్‌ నాలా ప్రాజెక్టుకు 462 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం 456.60 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు.

నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి 9200 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా, ప్రస్తుతం 1180 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కడెం ప్రాజెక్టుకు వరద పోటిత్తింది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 84,269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ఇప్పుడు 688.22 అడుగులకు చేరింది. జిల్లాలోని గడ్డెన్న జలాశయం పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 358.78 మీటర్లు కాగా, ప్రస్తుతం 358 మీటర్లుగా ఉన్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్