Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవడ్లగింజలో బియ్యపు గింజ

వడ్లగింజలో బియ్యపు గింజ

Rush for Rice:

ప్రశ్న:- సార్! మీరు కడుపుకు ఏమి తింటారు?

సమాధానం:- మీ ప్రశ్నలో శ్లేష, వ్యంగ్యం, చమత్కారం, డబుల్ మీనింగ్, నీచార్థం, నిందార్థం, అధిక్షేపణార్థాలు, శాపనార్థాలు నా మనోభావాలను గాయపరిచినా…నేను ప్రజాసేవలో ఉన్నందువల్ల చేత కొరకు కై పట్టి…అణచుకుని సమాధానమిస్తాను.

ప్ర:- మీరు కడుపుకు గడ్డి తింటారని నేనన్నానని…మీరనుకుని…నన్నవసరంగా అపార్థం చేసుకుంటున్నారని నేను తెలియజేసుకుంటున్నాను.

స:- నిజానికి మా పెరట్లో లాన్ స్విట్జర్లాండ్ నుండి దిగుమతి అయిన పరిమళభరిత, ప్రోటీన్ సహిత గ్రాసమే. అయినా ఇప్పుడు నానా గడ్డి కరవడానికే టైమ్ చాలట్లేదు. దాంతో పెరటి గడ్డి కడుపుకు రుచించదు కాబట్టి…మా ఇంటి సొంత గడ్డి తినడం మానేశానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.

ప్ర:- సార్! అమెరికాలో భారతీయులు, ప్రత్యేకించి దక్షిణాది వారు బియ్యమో రామచంద్ర! అని ఎందుకు ఎగబడి వీధుల్లో పడ్డారు?

స:- అది అమెరికా అధ్యక్షుడిని అడగాల్సిన ప్రశ్న. నన్నడిగితే ఎలా?

ప్ర:- అడిగాము సార్. బాస్మతేతర బియ్యం ఎగుమతులను భారత ప్రభుత్వం నిషేధించింది. దాంతో అమెరికాకు బియ్యం దిగుమతి కాక మీ సోదరులు పొట్ట చేత పట్టుకుని…ట్రాలీలు తోసుకుని...ఆఫీసులకు సెలవులు పెట్టి…బియ్యాన్వేషణ కోసం అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నిటిని సంయుక్తంగా తిరుగుతుంటే కడుపు తరుక్కుపోతోంది అని జో బైడెన్ సుదీర్ఘ, సుస్పష్ట, సముచిత వివరణ ఇచ్చారు.

స:- భారత్ అన్నపూర్ణ. భారత్ సదా పూర్ణ. భారత్ గతంలో పూర్ణ. భారత్ వర్తమానంలో పూర్ణ. భారత్ భవిష్యత్ లో కూడా పూర్ణ. భారత్ లో కావాల్సినంత ధాన్యం నిల్వలు ఉన్నాయి. మొన్ననే కొన్ని కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఉచితంగా ఇచ్చిన దానకర్ణి మన పూర్ణ భారత్.

ప్ర:- సార్ మేమడుగుతున్నది వండుకునే బియ్యం గురించి. మీరు చెబుతున్నది కరోనా వ్యాక్సిన్ గురించి. ఏమి మాట్లాడుతున్నారో మీకు కొంచెమయినా అర్థమవుతోందా?

స:- వ్యాక్సినే లేకుంటే విదేశాల దేహాలు ఈపాటికి దేహం లేనివి అయి…బియ్యం కోసం ఇలా రోడ్ల మీద పడి తిరగగలిగి ఉండేవారా? బతికించే వ్యాక్సిన్ కంటే ఆఫ్టరాల్ పిడికెడు బియ్యం గొప్పవి కావు. అర్థమవుతోందా? విధానపరమయిన సంక్లిష్టమయిన, గంభీరమయిన ఇలాంటి విషయాలను సున్నితంగా ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఇది వడ్ల గింజలో బియ్యపు గింజ- అంతే! కొంచెం ఓపిక పడితే నోట్లో బియ్యం పోస్తాం…

(ప్రశ్నలడుగుతున్నవారందరూ మూకుమ్మడిగా స్పృహదప్పి పడిపోయారు!)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్