Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

That is Important: అనుకుంటాం కానీ…పెళ్లికి పురోహితుడు లేకపోయినా పరవాలేదు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లేకపోతే పెళ్లి జరగనే జరగదు. ఆ మాత్రం జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించి, పసుపు తాడు ఫోటోగ్రాఫర్ కట్టించలేడా? ఏమిటి? పసుపు బియ్యం వచ్చిన వాళ్ల చేతిలో పెట్టి చల్లించలేడా? ఏమిటి? ఎవరికీ ఎప్పటికీ కనిపించని అరుంధతీ నక్షత్రాన్ని పట్టపగలే చూపించలేడా? ఏమిటి? రెండో మూడో కొంగు ముళ్లు బిగించి…పుల్లలు పేర్చి…నెయ్యి వేసి…హోమం చుట్టూ…మూడు రౌండ్లు ప్రదక్షిణలు చేయించలేడా? ఏమిటి? పెళ్లి పందిట్లో ఎలాగూ పంతులు మంత్రాలు మైకులో వినపడవు. వినపడినా అర్థం కావు. అలాంటప్పుడు “నాతి చరామి” అన్న రెండే రెండు పదాలు ఫొటోగ్రాఫరే చేప్పించలేడా? ఏమిటి?

ఎందుకు చెప్పించలేడు? శుబ్బరంగా చెప్పించగలడు. చెప్పిస్తున్నారు కూడా. చాలా మంది పురోహితుల కంటే ఇప్పుడు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకే పెళ్లి తంతు ఎక్కువ తెలుసేమో అని అసూయ పడాల్సిన పనిలేదు. అనేక వృత్తులు సార్వజనీనం అవుతున్న కాలంలో…పురోహితులు కెమెరాలు పట్టుకోవచ్చు. కెమెరామెన్ పోరోహిత్యం చేయవచ్చు. ఈవెంట్ మేనేజర్ యజ్ఞం చేయవచ్చు. ఋత్వికుడు షామియానాలకు గుంజలు పెట్టుకోవచ్చు. కులానికి- వృత్తికి లంకె ఏనాడో తెగిపోయింది. ఇప్పుడు ఎవరు ఏ పని అయినా చేయవచ్చు. చేస్తున్నారు కూడా.

ఒకప్పుడు పెళ్లి పదహారురోజుల పండుగ. తరువాత పది, ఆపై మూడు రోజులకు తగ్గి చాలా కాలం రెండ్రోజుల పండుగగా ఉంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో నే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పెళ్లిళ్లు వేరువేరుగా జరగాలి కాబట్టి గంటల్లోకి వచ్చాము. ట్రాఫిక్ లో చిక్కుకుని ఆలస్యంగా వెళితే మనం వేదరాశివారి పెళ్లికి వెళ్లాల్సి ఉండగా అక్కడ పేదరాశివారి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఎవరి పెళ్లికి వచ్చారని అక్కడ అడిగేవారుండరు. యుద్ధ విద్య సినిమా షూటింగ్ లా సాగే ఆ తంతులో పెళ్లి మండపం దాకా వెళ్లి అక్షింతలు చల్లి రావడానికి మనకు సాహసలు వచ్చి ఉండవు కాబట్టి- సోమాలియా శరణార్థులు ఐక్యరాజ్యసమితి ఆహారం పొట్లాలకోసం బొచ్చెలు పట్టుకుని దీనంగా క్యూలో నిలుచున్నట్లు బఫే ప్లేట్లలో మృష్టాన్నం ముష్టి వేయించుకుని నిలువు భోజనం ముగించి వచ్చేస్తాం. తాళికట్టు శుభవేళ-

రత్తాలు రత్తాలు…
బొత్తాలు బొత్తాలు…
లాంటి అర్థవంతమయిన పెళ్లికొడుకుకు ఓరచూపులను నేర్పే పాటలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. దాంతో ఆ పెళ్లి మండపమంతా-
కెవ్వు కేక..!

కర్ణాటక, రాయలసీమలో ఎలా వచ్చిందో కానీ పెళ్లికి ముందు రోజు సాయంత్రమే రిసెప్షన్ జరుగుతుంది. తాళి కట్టడానికి ముందే దంపతులుగా వారిని లోకం ఆశీర్వదించి వెళుతుంది. పెళ్లికి రాకపోయినా తప్పు కాదు. రిసెప్షన్ కు మాత్రం విధిగా హాజరు కావాలి. తొందరపడి ఒక కోయిల ముందే కూస్తే మనకేమిటి అభ్యంతరం! చాలా చోట్ల పెళ్లి తరువాత రిసెప్షన్ జరుగుతోంది.

ఉత్తరాదిలో హల్దీ, మెహందీ, సంగీత్ అనాదిగా ఉంది. పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ. ఇప్పుడు దక్షిణాదిలో పెళ్లి తంతులో గౌరీ పూజ నిమిత్తమాత్రమయ్యింది. వర పూజ మొక్కుబడి. కాశీ యాత్ర ఎగతాళి. తాళి తేలిపోయింది. హోమం పొగచూరి మసకబారింది. తలంబ్రాలు రంగుమారాయి. థర్మాకోల్ తలంబ్రాలు తేలుతున్నాయి. ఫోటోగ్రాఫర్ చెప్పింది సంప్రదాయం. వీడియో కెమెరా చేసేది పౌరోహిత్యం.

పెళ్లి ఇప్పుడొక ఈవెంట్.
ఒక షూటింగ్.
ఒక డ్యాన్స్.
ఒక వినోదం.
ఒక డెస్టినేషన్ విహారం.

Bride Rejected Marriage

ఒకందుకు ఇదీ మంచిదే. తాళి కట్టాక ఆ నవదంపతుల చేతిలో ఇంకెప్పుడయినా గోరింట పండుతుందా? ఇంకెప్పుడయినా పసుపు చల్లుకుని హల్దీ ఆనందం మిగులుతుందా?
బతుకు పాటగా నిత్య సంగీతంగా సాగుతుందా?
తాళి కట్టడానికి ముందయినా ఈ ఆనందాలు ఉండనీ!
అవి ఫొటోలుగా, వీడియోలుగా కలకాలం మిగలనీ!!

డెస్టినేషన్ పెళ్లి సంగీత్ కు సందర్భ శుద్ధి గీతం- సినిమా సూపిస్త మావా!

ఇలాంటి పెళ్లి నిశ్చయ తాంబూలాలు/ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్, వ్రతం…అన్నీ వాటికవిగా ఫోటోలకు, వీడియోలకు ఈవెంట్లు. అద్భుతమయిన సందర్భాలు. కొన్ని నెలలపాటు ఎన్నో వ్యయ ప్రయాసలతో రెడీ అయ్యాక…పెళ్లి ముహూర్తానికి పెళ్లి కొడుకు రాకపోయినా పరవాలేదు కానీ…ఫోటోగ్రాఫర్/వీడియోగ్రాఫర్ రాకపోతే…మనసు చివుక్కుమంటుంది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. పెళ్లి మీద వైరాగ్యం పుడుతుంది. అసలు పెళ్లే వద్దనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్ లో ఒక పెళ్లి పందిట్లో అదే జరిగింది. పెళ్లి వేళకు అబ్బాయి తరుపువారు మాట్లాడి పెట్టుకున్న ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మధ్య తీవ్రమయిన అభిప్రాయ భేదాలు వచ్చి…పెళ్లి ముహూర్తానికి ఇద్దరూ డుమ్మా కొట్టారు. ఫోటో/వీడియో లేని పెళ్లి పెళ్లే కాదు అని అమ్మాయి తెగేసి చెప్పింది. ఆఫ్టరాల్ ఫోటోగ్రాఫర్ నే టైమ్ కు అరేంజ్ చేయలేని వాడివి…ఇక నన్నేమి ఏలుకుంటావురా అర్భకుడా? అని పెళ్లి పందిట్లో నుండి లేచి వెళ్లిపోయింది. రెండు వైపులవారు ఎంత సర్ది చెప్పినా సయోధ్య కుదరలేదు. పెళ్లి ఆగిపోయింది.

బాబ్బాబూ!
ఫొటోగ్రాఫర్లూ! విడియోగ్రాఫర్లూ!
మీ కెమెరాల వల్ల నాలుగు సంసారాలు పది కాలాలు పచ్చగా నిలబడాలి కానీ...ఇలా మీరు రాక…మీరు లేక…కట్టాల్సిన తాళి ఎగతాళి కావడం ఏమీ బాగాలేదు.
కాస్త పెద్ద మనసు చేసుకోండిరా నాయనలారా!

తాళిదేముంది? అది ఒట్టి తాడు.
మీ ఫొటోలే/వీడియోలే కలకాలం నిలిచేవి. సంసారాలను నిలబెట్టేవి. అర్థం చేసుకోండి నాయనా!

పెళ్లి మంత్రం కన్నా మీ ఫ్లాష్ లైట్లకు మూర్ఛనలు పోనివ్వండి.
మీ ఫోటో/వీడియోల కోసం వెర్రి గొంతుక విచ్చి పలికే హృదయఘోషలను విని…వదిలేయకండి.
కెమెరా పౌరోహిత్య యజ్ఞంలో లెన్సునొక్కటి ఆహుతివ్వండి.
చిత్ర దృష్టికి ఫ్రేము ఒక్కటి ధారపోయండి.
దృశ్యవృష్టికి వీడియో ఒక్కటి దానమివ్వండి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

శుభం పలకరా పెళ్లి కొడకా…అంటే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com