Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచైనాలో పెళ్లిపై డిగ్రీ కోర్సు

చైనాలో పెళ్లిపై డిగ్రీ కోర్సు

సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు.

పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ ఈ డీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను తామే తగ్గించుకున్నాయి. ఇప్పుడు ఫంక్షన్ హాళ్లు దొరకడం ముఖ్యం కాబట్టి ఒకే ఫంక్షన్ హాల్లో పొద్దున ఒక పెళ్లి, సాయంత్రానికి మరో పెళ్లి జరగాలి కాబట్టి ఆధునిక వివాహాలు గంటల్లోకి కుచించుకుపోయాయి. భవిష్యత్తులో నిముషాల్లోకి దిగుతాయి.

“పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు
తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..
మొత్తం కలిసీ నూరేళ్ళు

పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు
ముగ్గులు.. ముత్తైదు భాగ్యాలూ….
ముద్దూ ముచ్చట్లు.. మురిసే లోగుట్లు..
చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు..

గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో…

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ…
హృదయాలు పెదవుల్లో..
ఎరుపెక్కు ఏకాంత వేళల్లో
వలపు పులకింతలో..
వయసు గిలిగింతలో..
వింతైన సొగసుల వేడుకలో…

కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో…

సిరిమువ్వ రవళుల మరిపించు
నీ నవ్వు సవ్వడిలో…
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో
సామగానాలము..
సరసరాగాలము
ప్రేమికులమన్న కులమున్న లోకంలో
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు…”

అని ఆత్రేయ అన్నట్లు పెళ్లి పందిరి సందడి నుండీ దంపతుల సరస రాగాల సంసార సరిగమల సామగానం మొదలయ్యేదాకా ఎన్నెన్నో పనులు.

“ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు” అని అందుకే అన్నారు. వెయ్యేళ్ల చెలిమికి సంకెళ్లుగా మూడు ముళ్లు వెయ్యడం చిటికెలో పనే. ఆ చిటికెలో మూడు ముళ్లు వేసే పెళ్లికి మూడు నాలుగేళ్లు కష్టపడినా ఇంకా ఏవో చేయాల్సిన పనులు మిగిలిపోయే ఉంటాయి.

సంప్రదాయాల్లో తేడాలుండవచ్చు కానీ…ఏ దేశంలో అయినా పెళ్లి పెద్ద వ్యవహారమే. అతి పెద్ద వ్యాపారమే. చైనాలో కూడా పెళ్లిళ్లు ఇప్పుడు మంచి ప్రామిసింగ్ బిజినెస్. దాంతో అనేక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు పెళ్లిళ్లకు సకల ఏర్పాట్లు చేసి పెట్టే వ్యాపారంలో పోటీలు పడుతున్నాయి. ఎటొచ్చీ…మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు తగిన చదువు, జ్ఞానం, అనుభవం ఉన్న వృత్తి నిపుణులు దొరకడం లేదు. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి చైనా సివిల్ అఫైర్స్ యూనివర్సిటీలో “మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్” పేరుతో ప్రత్యేక డిగ్రీని ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారు.

పూరి గుడిసెలో దుప్పటి బ్యాగ్రవుండ్ గా పెట్టి తాళి కట్టే నిరుపేదల పెళ్లి నుండి…సముద్రమధ్యంలో ద్వీపంలో డబ్బుచేసినవారి సెవెన్ స్టార్ డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు ఏ పెళ్లి ఎలా చేయాలో ఈ కోర్సులో నేర్పిస్తారు.

పిండి కొద్దీ రొట్టె. పెళ్లికి మన చేతి చమురు ఎంత వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నామో చెబితే వీరు ఆ ప్రకారంగా అన్నీ సిద్ధం చేసి పెడతారు. ముహూర్తం వేళకు వెళ్లడమొక్కటే మన పని.

చూడబోతే- ఈ విషయంలో చైనా బాగా వెనుకబడి ఉన్నట్లుంది. మన దగ్గర పెళ్లి వ్యవహారాలన్నీ ఏనాటినుండో అంతా అవుట్ సోర్సింగే కదా! స్టేజ్ మీద పురోహితుడి భుజం మీద కాలు పెట్టి మన ఫోటోగ్రాఫర్ కట్టించే తాళి వీడియో ఒక్కటైనా యూ ట్యూబ్ లో చైనా చూడలేదో! ఏమిటో!

మన దగ్గర చదువుకున్నవాడు పుస్తకంలో; చదువులేనివాడు ప్రపంచంలో ఉంటాడు కాబట్టి…ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అన్న కీర్తి కిరీటాన్ని చైనా నుండి కష్టపడి, చెమటోడ్చి లాక్కున్న మనకు “మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్” కోర్సు అవసరం లేదేమో!

కొసమెరుపు:-
చైనా పెళ్లి డిగ్రీ పేరు చూసి ఇది కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ విద్య అనుకునేరు. పెళ్లి సంబంధాలు కుదిర్చి…పీటల మీద దంపతులను కూర్చోబెట్టడం మొదలు…పెళ్లి పెటాకులయ్యేవారికి డైవోర్స్ కౌన్సిలింగ్, సపరేషన్ రాతకోతలు, ధూమ్ ధామ్ విడాకుల అంగరంగ వైభవ బ్రేకప్ పార్టీలు ఏర్పాటు చేయడం దాకా “అంతకు మించి…” అన్నట్లు ఇంకా చాలా ఉన్నాయి.
పెళ్లే కాదు…ఈ చదువు చదివినవారు మన మాటల మాంత్రికుడు పింగళి చెప్పినట్లు “గిళ్లి” కూడా మహా రంజుగా చేయగలరట!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్