Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒక కూతురి స్ఫూర్తి

ఒక కూతురి స్ఫూర్తి

తెలుగులో “నీ కుడిభుజం నేనవుతా…” అని ఒకానొక వాడుక మాట. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పని చేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన కథనమిది. భువనగిరిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎల్లయ్యకు ఆరు నెలల క్రితం పక్షవాతం సోకి కుడి చేయి పడిపోయింది. దోమకాటుకు, చీమకుట్టుకు కూడా ఆత్మహత్య చేసుకునేవారు కొందరు. కాళ్లకింద భూమి రెండుగా చీలినా…మిన్ను విరిగి మీద పడినా చలించక…రేపటి వెలుగులు వెతుక్కుంటూ…తమను తాము ముందుకు నడుపుకునేవారు కొందరు. ఎల్లయ్య రెండో రకం.

“ఎన్నాళ్లని ఇంట్లో ఇలా దిగులుపడుతూ కూర్చోవడం? కుడి చేయే కదా పని చేయదు…ఎడమ చేయి బాగానే ఉంది…జీవితంలో అప్పుడే అలసిపోతే ఎలా?” అని తనకు తానే ధైర్యం చెప్పుకుని ఎడమ చేత్తోనే ఆటో నడపడం మొదలుపెట్టాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు ఊర్మిళ తండ్రి తపనను, సంకల్పాన్ని అర్థం చేసుకుంది. ఎడమ చేత్తో ఎల్లయ్య ఆటో గేరు మారుస్తూ…ఎడమ కాలితో బ్రేక్ తొక్కుతుంటే…ఊర్మిళ కుడి చేత్తో ఎక్సలేటర్ పట్టుకుని నడుపుతోంది. స్కూల్ అయిపోగానే రోజూ సాయంత్రం ఊర్మిళ తండ్రితోపాటు ఆటో నడుపుతోంది. అక్షరాలా తండ్రికి కుడి భుజమయ్యింది.

అనితరసాధ్యమైన ఐ ఐ టీ లు చదువుతూ మార్కులు సరిగా రాలేదని ఆత్మహత్యలు చేసుకునే రోజుల్లో ఊర్మిళ చొరవ, పరిపక్వత, శ్రమ మార్గం చాలా గొప్పవి. తండ్రికి తగ్గ తనయ.

జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం...అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం.

దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతూనే ఉంటుంది.
అలలను సవాలు చేసి…చేప పిల్ల ఈదుతూనే ఉంటుంది.
గ్రీష్మంలో ఎండిన కొమ్మే చైత్రంలో చిగురించి…ప్రకృతికి పట్టు చీరల సారె పెడుతుంది.
మావి చిగురుకోసం కోయిల నిరీక్షిస్తూ ఉంటుంది.
కోయిల పిలుపు కోసం మావి కొమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది.
చీకటి రాత్రి కొమ్మ మీదే రేపటి వెలుగుల సూరీడు ఎదురుచూస్తూ ఉంటాడు.
కష్టాల వెంట సుఖాలు; సుఖాల వెంట కష్టాలు; కష్టాల వెంట కష్టాలను తలచుకుని తలచుకుని బాధపడుతూ ఉంటే…గుండె మరింత బరువెక్కి దిక్కుతోచదు.

జీవితమంటే బరిలో గిరిగీసి నిలవడం.
జీవితమంటే బతికి…బతికించడం.
జీవితమంటే మనను మనమే నడిపించుకోవడం.
మన యుద్ధం ఇంకెవరో చేయరు.

“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది
సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటైతే

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల
మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
త్రి విక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధిసైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా”

చిత్రం : పట్టుదల (1992)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : కె.జె.ఏసుదాస్

ప్రాణం ఉన్నంతవరకూ పోరాడాలి. ప్రాణం పోయేంతవరకూ పోరాడాలి. ప్రాణం పోతున్నా పోరాడుతూనే ఉండాలి. పోరాడుతూనే పోవాలి. పొతే చరిత్రగా మిగిలిపోవాలి.

ఎల్లయ్య కుడిభుజమైన తనయ ఊర్మిళ నడుపుతున్నది ఆటో కాదు…
నడుపుతున్నది అక్షరాలా కొండంత జీవన పోరాటాన్ని; పెద్ద ఆదర్శాన్ని. మొక్కవోని ధైర్యాన్ని. సముద్రమంత సహనాన్ని.

శెభాష్ తల్లీ!
నువ్వు నడిచి…గెలవాల్సిన దారులు ఇంకా ఎన్నెన్నో ఎదురుచూస్తున్నాయి.
నువ్వు చేరాల్సిన విజయాల తీరాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్