పరుగుల కీర్తి శిఖరం మిల్కా సింగ్ మృతికి నివాళిగా మీడియాలో చాలా వార్తలు, వ్యాసాలు, సంతాపాలు, ఫోటోలు వచ్చాయి. అమూల్ ప్రకటన అన్నిటిలోకి విభిన్నంగా, అద్భుతంగా ఉంది. రెండు కాలాల న్యూస్ ఐటెమంత చోటులో దశాబ్దాలుగా ప్రతి నిత్యం ఒక ప్రకటనను అమూల్ విడుదల చేస్తోంది. కొన్ని వందల సంపాదకీయాలతో సమానంగా ఉంటుంది ఒక్కొక్క ప్రకటన. ఇంగ్లీషు, హిందీలోనే ప్రకటన తయారయినా వాల్మీకి సరళమయిన సంస్కృతం ఏ భాష వారికి ఆ భాషకు దగ్గరగా అనిపించినట్లు, అమూల్ ప్రకటన భాష ఏ భాష వారికయినా దగ్గరగా ఉంటుంది. నిజానికి ప్రకటనల రంగంలో ఉన్నవారు, భాషా ప్రేమికులు పాఠంగా ఫాలో కావాల్సిన స్థాయిలో ఉంటాయి అమూల్ ప్రకటనలు.
ఉదాహరణ ఈరోజు మిల్కాకు నివాళి ప్రకటన. రోజూ రంగుల్లో వచ్చే ప్రకటన ఈరోజు బ్లాక్ అండ్ వైట్ లో ఉంది- సంతాప సూచకంగా.
“ఐతిహాస్ కో కలమ్ సే నహీ;
కదమ్ సే లిఖా”
రెండే రెండు లైన్లు. నాలుగే నాలుగు పదాలు.
కింద-
“మిల్కా సింగ్
1929-2021”
అని పెట్టారు.
రన్నింగ్ ట్రాక్ లక్ష్యాన్ని ఛేదించినట్లుగా రిబ్బన్ ను దాటిన త్రిమూర్తి రూపాలతో అమూల్ మిల్కాల ఆర్ట్ వర్క్ ఉంది.
తెలుగులోకి అనువదిస్తే-
“చరితను
కలంతో కాదు,
కాలితో లిఖించాడు”
ఎంత చిన్న రాత అయినా యతి- ప్రాసలు పడితేనే అందం. గుభాళింపు. అది మళ్లీ కంటిని మించిన కాటుక కాకూడదు. కలం- కదం సొగసయిన, సహజమయిన ప్రాస. పరుగుల చరిత పాదాక్రాంతం కావడం భావం. మిల్కాకు లిఖా అంత్య ప్రాస. మిల్కా కాలికి గౌరవపూర్వకంగా నమస్కరించాలి. ఈ స్క్రిప్ట్ రాసినవారి పాదాలకు కూడా భాషాభిమానులు నమస్కరించాలి.
“ఏవో ఏవో బాధలు,
భరించె మూగ జీవితం;
ఎన్నో ఎన్నో ఆశలు,
లిఖించె తెల్ల కాగితం”
-పమిడికాల్వ మధుసూదన్