ఉత్తరఖండ్ లో పర్వతారోహణకు వెళ్ళిన బృందం తప్పిపోయింది. 11 మందితో కూడిన పర్వతారోహకుల బృందం లంఖగా పాస్ వద్ద తప్పిపోయినట్టు ఉత్తరఖండ్ డిజిపి అశోక్ కుమార్ డెహ్రాడున్ లో వెల్లడించారు. లంఖగా కనుమ ఉత్తరఖండ్ – హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉంటుంది. భారీ వర్షాల నేపథ్యంలో పర్వత ప్రాంతాల్లో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ఈ రోజు మిలిటరీ హెలికాప్టర్ల సాయంతో గాలింపు జరుపుతామని ఉత్తరఖండ్ ప్రభుత్వం తెలిపింది. పర్వతారోహకుల బృందం తప్పిపోయింది వాస్తవేమనని అటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా దృవీకరించారు.
మరోవైపు ఉత్తరఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డెహ్రాడున్ చేరుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి తో కలిసి హోం మంత్రి షా ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మూడు రోజులుగా పడుతున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు ఇప్పటికే 46 మంది చనిపోయారు. కుండపోత వానలతో దేవభూమిలో జనజీవనం స్థంభించింది. నైనిటాల్, పౌరి గర్వాల్, చంపావత్, ఉదం సింగ్ నగర్ , రుద్రాపూర్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.