Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఫలించిన దింపుడు కల్లం ఆశ

ఫలించిన దింపుడు కల్లం ఆశ

Not Yet: అంత్యక్రియలు ఒక సంస్కారం. చాలా శ్రద్ధతో చేసేది లేదా చేయాల్సింది కాబట్టి శ్రాద్ధం. ఆచారాన్ని బట్టి పూడ్చడం, కాల్చడం రెండే పద్ధతులు. భారతీయ సంప్రదాయంలో అంత్యక్రియలు రకరకాలు. ఆ వివరాలన్నీ ఇక్కడ అనవసరం.

హిందూ సంప్రదాయంలో శవాన్ని అంత్యక్రియల కోసం శ్మశానం దాకా తీసుకెళ్లాక నేరుగా చితి మీదో, తవ్విన గోతిలోనో పెట్టడానికి వీల్లేదు. పాడెను దించాలి. కట్లు విప్పాలి. చనిపోయిన వ్యక్తి చెవిలో అంత్యక్రియలు చేసే వ్యక్తి పేరు పెట్టి లేదా బతికి ఉండగా ఏ బంధుత్వంతో పిలిచేవారో అలానే మూడు సార్లు పిలవాలి. ప్రదక్షిణ చేస్తూ మళ్లీ మళ్లీ పిలవాలి. అప్పుడు చితి మీదికో, గుంతలోకో తీసుకెళతారు. ఈ మొత్తం ప్రక్రియను “దింపుడు కల్లం ఆశ” అంటున్నాం. అదేమిటో తెలియకపోయినా…జరగదని తెలిసి తెలిసి చివరి ప్రయత్నంగా చేసే పనిని దింపుడు కల్లం ఆశ అని అనాదిగా ఒక వాడుక మాటను ఉపయోగిస్తున్నాం.

ఎన్నో ఆచారాలు ఇప్పుడు మనకు పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించవచ్చు కానీ…ఆయా ఆచారాలు ఏర్పడినప్పుడు వాటి అవసరం చాలా ఉండి ఉంటుంది. కొంత కాలానికి అవి ఏదో ఒక తంతుగా మిగిలి ఉంటాయి. పాటించేవారు పాటిస్తుంటారు. లేనివారు లేదు.

తమిళనాడులో అరవై ఏళ్ల షణ్ముఖం ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆసుపత్రిలో రోజుకు రోజుకు పరిస్థితి దిగజారుతోంది. ఒక రోజు తుది శ్వాస వదిలాడు…తీసుకెళ్లండి అన్నారు వైద్యులు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శవ యాత్ర పూర్తయ్యింది. వారి ఆచారం ప్రకారం దింపుడు కల్లం ఆశలో భాగంగా తండ్రి శవం నోట్లో కొడుకు పాలు పోసి అప్పా! అప్పా! అని గట్టిగా పిలవాలి. అలాగే చేశాడు కొడుకు. పాలు పోసి కొడుకు పిలవగానే ఆ తండ్రికి నిజంగానే ప్రాణం లేచి వచ్చింది. ఏమిరా నాయనా! ఏమయ్యింది? ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు? అని పాడె మీద లేచి కూర్చున్నాడు షణ్ముఖం. అంతే…కొడుకు ముఖంలో కోటి కాంతులు వెలిగాయి. శ్మశానం తెల్లబోయి… కొయ్యబారింది. బంధువులు ఏడుపు ఆపి నవ్వుతూ ఎవరి దారిన వారు పోయారు.

దింపుడు కల్లం సంప్రదాయమే లేకుంటే…ఈపాటికి కాలి బూడిదయి ఉండేవాడిని అని అనుకుంటూ కొడుకు చేతి గ్లాసులో మిగిలిన పాలు తాగి జేబులో చేతులు పెట్టుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు షణ్ముఖం.

ఈసారి దింపుడు కల్లం దగ్గర గట్టిగా తట్టి పిలవండి. నోట్లో కొబ్బరి నీళ్లు, ఎలెక్ట్రోల్, పాలు చుక్క చుక్క జాగ్రత్తగా పోయండి.

మనం సరిగ్గా పిలవక కదా ఎందరో మనవాళ్లు పిలుపు కోసం అలమటించి…అలమటించి…పోయారు. నోరారా పిలవాలే కానీ…
పోయే ప్రాణాలు నిలబడవా!
పోయిన ప్రాణాలు లేచి రావా!

(కొందరు తెలియక దింపుడు కళ్లెం అని అంటున్నారు. కళ్లెం అంటే గుర్రం లాంటి వాటికి మూతికి కట్టే తాడు లాంటిది. కల్లం అంటే పొలం, పూరిగుడిసె, పెరడు, దొడ్డి లాంటి అర్థాలున్నాయి. కాబట్టి దింపుడు కల్లం అనే అనాలి)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

కర్మలు చేసే కంపెనీ

Also Read :

దయ్యాల్లేవన్నది ఎవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్