A Mothers Quest :
అది దక్షిణ కొరియా లోని సియోల్ నుంచి అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానం. పది గంటల ప్రయాణం. నాలుగు నెలల జాన్ వూ తల్లి విమానంలోని 200 మంది ప్రయాణికులకు తలా ఒక బాగ్ ఇచ్చింది. అందులో కొన్ని స్వీట్స్, ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ పాపాయి ఏడిస్తే వినపడకుండా ఇయర్ ప్లగ్స్ వాడుకోమని. అన్నిటికంటే ఆకట్టుకునేది అందులో ఉన్న సందేశం. ఇంతకీ ఏముంది అంటారా? ‘ హలో, నా పేరు జాన్ వూ. మా అమ్మ, అమ్మమ్మ, ఆంటీతో అమెరికా వెళ్తున్నాను. నాకిదే మొదటి విమాన ప్రయాణం. చిన్నపిల్లలు ఏడవడం, చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించడం సాధారణం. అయినా వీలయినంత ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేస్తాను. కానీ ప్రమాణం చెయ్యలేను. ఒకవేళ నేను ఏడిస్తే నన్ను క్షమించండి. అందుకే మా అమ్మ మీకోసం బాగ్స్ తయారుచేసి ఇచ్చింది. నా ఏడుపు వల్ల మీకు ఇబ్బంది కలిగితే బ్యాగ్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి. స్వీట్స్ తినండి. మీ ప్రయాణం సుఖంగా జరగాలి. మీ అందరికీ థాంక్స్’
ఇలా ఎక్కడైనా చూశారా? అందుకే ఈ అమ్మ కథ వైరల్ అయింది. అర్ధరాత్రి బాజాలు, చిన్నపిల్లలున్నా బాంబులు కాల్చడం, శబ్దకాలుష్యం … ఇవన్నీ అలవాటయిపోయిన మనకి ఇంత సున్నితత్వం అర్థమవుతుందా? పక్కోడి బాధతో పనేంటి? నా ఇష్టం అనుకునేవారు ఈ వార్త చదివి ఒకసారి ఆలోచించినా సార్థకత లభించినట్లే.
-కె. శోభ