ర్యాంప్ మీద వయ్యారంగా నడిచే భామలు వేసుకునే దుస్తులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కాగితం, లెదర్, మెటల్స్ తో పాటు ప్లాస్టిక్ తోనూ తయారైన దుస్తులు కనిపిస్తూ ఉంటాయి. అంతవరకూ ఎందుకు? మనం నిత్యం ధరించే దుస్తుల్లోనూ ప్లాస్టిక్ ఉంటుందని తెలుసా?
ప్లాస్టిక్ అనగానే సీసాలు, డబ్బాలు, కవర్లు మాత్రమేనా? ఇంకా అంటే సముద్రాలు, బీచుల్లో చెత్త రూపంలో చూసినంతవరకే అనుకుంటారు. అంతవరకూ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందా అంటే చాలదంటున్నారు నిపుణులు. ఒంట్లో పేరుకుంటున్న ప్లాస్టిక్ ని, ఆరోగ్య సమస్యలను గుర్తించమంటున్నారు. ఒంట్లోనా? అదెలా? ప్లాస్టిక్ వాడటం లేదుకదా అని కొట్టి పారేయద్దు. ధరించే దుస్తులు కూడా మీ ఒంట్లోకి ప్లాస్టిక్ ని పంపిస్తాయి. దీనికి సంబంధించిన పరిశోధనలో వెల్లడైన అంశాలు మానవజాతి మేలుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
మూడు దశాబ్దాల క్రితమే దుస్తుల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, విడిగా నైలాన్, పోలియెస్టర్ తయారు చేసేవారి ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ అవశేషాలు కనుగొన్నారు. వారిలో తరచూ దగ్గు , ఆయాసం, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి లక్షణాలు కనిపించాయి. యూనివర్సిటీ అఫ్ గ్రోనింగ్ జెన్, నెదర్లాండ్స్ ఇటీవలి పరిశోధన మరింత వివరంగా దుస్తులద్వారా ప్లాస్టిక్ ఆరోగ్యానికి హాని చేస్తోందని వెల్లడించింది. ఎక్కువకాలం పాలిస్టర్, నైలాన్ దుస్తులు వాడితే శ్వాస కోశ సమస్యలు పెరుగుతాయని కూడా వెల్లడించింది. అదీ ఏ విధంగా అంటే-
- ప్లాస్టిక్ రేణువులు మనచుట్టూ ఉన్న పర్యావరణంలో వ్యాపించి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.
- సూక్ష్మ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు సులభంగా చర్మం పొరల్లోకి, కణజాలం లోకి చొచ్చుకుని పోతున్నాయి. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
- సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల కారణంగా శరీరంలో అనేక భాగాల్లో వాపు వస్తుంది. ఫలితంగా శ్వాస సమస్యలు, గుండె జబ్బులు, కాన్సర్ వంటి వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది.
- ఈ రేణువుల కారణంగా శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురయ్యే అవకాశం ఉంది ( యాంటీ ఆక్సిడెంట్స్- ఆక్సిజన్ కణజాలం మధ్య అసమతుల్యత)
- ప్లాస్టిక్ మన చుట్టూ వ్యాపించి రకరకాలుగా పంటల్లో, తినే కూరగాయల్లోకి కూడా చొచ్చుకునిపోతుంది.
ఏ యే దుస్తులు ప్లాస్టిక్ మయం?
సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు దుస్తుల ద్వారా శరీరంలోకి చొచ్చుకు పోకుండా ఉండాలంటే మనం వాడే దుస్తుల ఎంపికలో జాగ్రత్త పడాలి. కొన్ని రకాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో ప్రధానమైనవి:-
- పాలిస్టర్: చాలా విస్తృతంగా వాడుకలో ఉన్న వస్త్రం. ఉతికిన ప్రతిసారీ మైక్రో ఫైబర్స్ విడుదల అవుతాయి. టీ షర్ట్ నుంచి అనేక స్పోర్ట్స్ దుస్తుల వరకు వాడే పాలిస్టర్ సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల విడుదలలో ముందు ఉంటుంది
- నైలాన్ : ఇది కూడా ఎక్కువగా , ఆటలు, ఈత దుస్తులు, లో దుస్తుల తయారీ లో ఉపయోగిస్తారు. వాడేకొద్దీ, ఉతికినప్పుడల్లా ప్లాస్టిక్ రేణువులు విడుదల చేస్తుంది
- ఆక్రిలిక్ : ఆక్రిలిక్ తో తయారైన స్వెట్టర్లు ఊలు కన్నా మెత్తగా ఉంటాయేమో గానీ ఉతికినప్పుడల్లా పెద్ద సంఖ్యలో మైక్రో ప్లాస్టిక్స్ విడుదల అవుతాయి
- పోలీ ప్రొపీలీన్ : థర్మల్, ఇతర దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు.
- లైక్రా- స్పాండెక్స్ : ఒంటికి అతుక్కుని ఉండే లెగ్గింగ్స్ , స్పోర్ట్స్ బ్రా తయారీలో వాడే ఈ ఎలాస్టిక్ ఫైబర్ సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులకు వాహకం.
- మైక్రో ఫైబర్ ఫాబ్రిక్ : ఇల్లు శుభ్రం చేసే బట్టలు, స్పోర్ట్స్ దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు. మెత్తగా ఉంటుందని పేరే గానీ ప్లాస్టిక్ మోసుకొస్తుంది
మరి ఏ దుస్తులు వాడాలి?
ఒకప్పుడు నూలు, పట్టు ఎక్కువ వాడేవారు. మన్నిక ఎక్కువ , ఖర్చు తక్కువ అనే కారణంతో సింథటిక్ దుస్తులు వాడటం ఎక్కువైంది గానీ నిజానికి పర్యావరణ హితమైన దుస్తుల వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే మేలు అనుకుంటే కింది రకాల దుస్తులు ఎంచుకోవడం మంచిది.
- కాటన్: జీన్స్, చీరలు, ఆధునిక దుస్తుల వరకు ఎన్నో రకాలుగా వాడే కాటన్ ఒంటికి చాలా మంచిది. పురుగుమందులు వాడని ప్రత్తి నుంచి తయారైన ఆర్గానిక్ నూలు ధరిస్తే మేలు
- లినెన్ : అవిసె నుంచి తయారయ్యే లినెన్ హాయిగా చల్లగా ఉంటుంది
- సిల్క్ : పట్టు పురుగులనుంచి తయారయ్యే సిల్క్ వస్త్రాలూ శరీరానికి మంచివే
- ఊలు: గొర్రెలనుంచి తీసే ఊలు దుస్తులు చలి కాలంలో వెచ్చగా వేసవిలో చల్లగా ఉంటాయి
- హెంప్ ( జనపనార ): పర్యావరణ హితమైన జనపనారతో తయారయ్యే దుస్తులు యూవీ కిరణాలను నియంత్రిస్తాయి
- వెదురు: వెదురు నుంచి తయారయ్యే వస్త్రాలు మెత్తగా హాయిగా ఉంటాయి. తడి పీల్చుకోని లక్షణం వల్ల స్పోర్ట్స్ దుస్తులు, లో దుస్తుల తయారీ కి అనుకూలంగా ఉంటుంది
- కాశ్మీరీ: కాశ్మీరీ మేకలనుంచి తీసే దారాలతో తయారవుతాయి
ఈ మధ్య వెదురు, సీతాఫలం, తామర, అరటి వంటి చెట్లు, పళ్ళ తొక్కలనుంచి నుంచి దుస్తులు తయారు చేస్తున్నారు. కొనే ముందు ఏ దారాలతో తయారైందో తెలుసుకుంటే ఎంపిక సులభం అవుతుంది.
మేలుకుందామా?
మన వంతుగా ప్లాస్టిక్ వాడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.
- బట్టలు, దుప్పట్లు ఏవైనా ప్లాస్టిక్ లేనివి ఎంచుకోవాలి
- ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ అసలు వాడకపోవడమే మంచిది
- తాగునీటిలో ఉండే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను వడపోసే సామర్ధ్యమున్న వాటర్ ఫిల్టర్ ఎంచుకోవాలి. లేదా మట్టి కుండ, స్టీల్, రాగి పాత్రలు మంచిది
అన్నిటి కన్నా ముఖ్యంగా ప్లాస్టిక్ మానవ జీవితాలకు చేస్తున్న చేటు గుర్తించడం ముఖ్యం. అందుకోసం మన ఇంటినుంచే మార్పు మొదలైతే రేపు సమాజానికీ దారి చూపుతుంది. ఎవరికి వారుగా దీన్నొక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆపై కలసికట్టుగా పోరాడాలి. ఇది మనకి, ముందుతరాల ఆరోగ్యానికి కూడా అత్యావశ్యకం.
-కె. శోభ