అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా కనుచూపుమేర ప్లే గ్రౌండ్. ఇప్పుడంటే ఊరికో పాఠశాల. నేను అక్కడ చదివిన 1980-84 రోజుల్లో దాదాపు ఇరవై ఊళ్లకు అది చదువుల దేవాలయం. 1400 మంది గ్రామీణ విద్యార్థులతో మిసమిసలాడుతూ, తుళ్లుతూ, పొంగుతూ ఉండేది.
“గో ఇన్ ద లైన్” అని అరివీర భయంకరమయిన అరుపుతో హెడ్మాస్టర్ తిప్పరాజు సార్ చేతిలో రాజదండాన్ని అదలించారంటే…చీమల బారుల్లా బుద్ధిగా లైన్లోకి ఒదిగిపోయేవాళ్ళం. స్కూల్లో రుద్రుడిగా ఉండే ఆయన బయట మెత్తటి మనిషి. నున్నగా ఉండి పాలిష్ పట్టిన వెదురు కర్ర ఆయన చేతికి ఆభరణం. హెడ్మాస్టారు సీట్లో కూర్చున్నప్పుడు కూడా చేతికి అందుబాటులో ఆ కర్ర ఉండాల్సిందే. ఆయన ఆ కర్ర లేకుండా స్కూల్లో తిరుగుతున్నప్పుడు మాత్రమే ఎవరయినా ఎదురు పడడానికి సాహసించేవాళ్లు. చేతిలో కర్ర ఉంటే 1400 మంది గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
సాయంత్రం అయిదు గంటలకు స్పోర్ట్స్ క్లాస్ అయిపోతుంది. నాలుగున్నరకు వర్షం మొదలయ్యింది. అక్కడి నుండి లేపాక్షి రెండు కిలో మీటర్లు. నడిచి వెళ్లేవాళ్లం. ఈలోపు లేపాక్షి వెళ్లే లారీ వస్తే పాతిక మంది పిల్లలం ఎక్కేశాము. మరుసటి రోజు ఉదయం అసెంబ్లీలో ప్రేయర్ కాగానే…తిప్పరాజు సార్ రుద్రావతారం చూడాల్సివచ్చింది. నిన్న క్లాసు కాకుండానే లారీ ఎక్కిన మొనగాళ్లంతా పక్కకు వచ్చి వరుసగా నిలుచోండి…అన్నారు. పాతిక మంది తలవంచుకుని పక్కకు వచ్చాము. ఒక్కొక్కరు చేయి ముందుకు చాచితే రాజదండంతో ఒక్క దెబ్బే వేస్తున్నారు. దాదాపు చేయి విరిగిన సౌండ్ వస్తోంది. నా వంతు వచ్చింది. చేయి చాచాను. ఈలోపు నాపక్కనున్న సునిల్…సార్! వీడు రానన్నాడు…మేమే బలవంతంగా ఎక్కించాము… అన్నాడు. “సిగ్గులేదురా! నీకు? ఇంకోసారి చేస్తే ఎముకలు విరిచి చేతిలో పెడతా!” అని నన్నొదిలేసి మిగతావారిని కొట్టుకుంటూ వెళ్లారు.
తరువాత మధ్యాహ్నం భోజనాలప్పుడు సునీలూ! సునీలూ! నన్ను రక్షించావురా! అని వాడికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. అప్పుడు వాడన్నమాట- “చూడు నా చేయి వాతతో ఎలా అయ్యిందో? నువ్వయితే తట్టుకోగలవా?” అని. కొందరిలో వయసుకు మించిన పరిణితి, దయాగుణం ఉంటాయి. మా సునీల్ ఆ టైపు. ఆ క్షణాన సునీల్ గాడు నిజంగా నాకు గాడ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్.
అదే స్కూల్లో మాకు ఆరేడు తరగతుల్లో తెలుగు బోధించిన లోకభూషణం సార్ గొప్ప చిత్రకారుడు. తెలుగు పద్యాలను రాగయుక్తంగా తను పాడడంతో పాటు మా చేత పాడించేవారు. ఆయనకు రోజూ ఒక చింత కొమ్మను విరిచి ఆకులు దూసి…మమ్మల్ను కొట్టడానికి వీలుగా ఆయన చేతికి ఉదయాన్నే ఇచ్చే బాధ్యతను మాలో రషీద్ గాడికి అప్పగించారు. వాడు తరువాత గొప్ప లారీ డ్రయివర్ అయి…నేను హిందుపూర్లో రిపోర్టర్ గా ఉండగా ఒకసారి నన్ను ప్రేమపూర్వకంగా లారీలో తిప్పాడు కూడా. లోకభూషణం సార్ చేతిలో పైన బెరడు తీసిన చింత కర్ర రాజదండంలా రాణించేది. సార్ రాజదండం దండన తీవ్రతకు గురయిన కొందరు విద్యార్థులు రెండు, మూడు నిక్కర్లు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని పసిగట్టిన సార్… రెండు, మూడు నిక్కర్లు ఒక శుభ ముహూర్తాన ఊడబెరికించి…అలా వేసుకొచ్చినవారందరికీ అదనపు కోటా చింత బర్రె ట్రీట్మెంట్ ఇచ్చారు. “చింత చచ్చినా పులుపు చావదు” అన్న సామెత ప్రత్యక్షర సత్యంగా అప్పుడే తెలిసింది.
ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో సైన్స్ టీచర్ నిర్మలా మేడం చెప్పిన పాఠాలు సైన్స్ మీద అంతులేని ఆసక్తిని రేకెత్తించాయి. మేడం ఎప్పుడూ ఎవరినీ కొట్టగా చూసినవారు లేరు. క్లాసులో బోర్డు మీద అలవోకగా సైన్స్ బొమ్మలు వేస్తూ మేడం చెప్పిన ప్రతి పాఠం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. చెవుల్లో మారుమోగుతోంది. మేడం చేతిలో అలంకారానికి ఒక కర్ర ఉండేది. బాగా కోపం వస్తే కన్నెర్ర చేసి…గొంతు పెంచి…దగ్గరిదాకా వచ్చి…గాల్లోకి కర్రెత్తి…బెంచి మీద గట్టిగా కొట్టి…ఖబడ్దార్! అని వెళ్లిపోయేవారు.
డ్రిల్ మాస్టర్ చేతిలో ఒకటి కాదు. అనేక రాజదండాలు ఉండేవి. 1400 మందిలో కనీసం రోజుకు 140 మందినయినా ఆయన కొట్టాల్సి వచ్చేది. కర్రలు విరిగితే…స్టోర్ రూములోకెళ్ళి అప్పటికప్పుడు కొత్త కర్రలు తెచ్చివ్వడానికి విద్యార్థుల్లో కొందరికి ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ స్కూల్లో యాభై, అరవై ఏళ్ళల్లో మమ్మల్ను కొట్టడానికి టీచర్లు తెంచిన, నరికిన కొమ్మల, రెమ్మల దెబ్బకు స్కూల్ చుట్టూ ఉన్న చెట్లన్నీ నామరూపాల్లేకుండా పోయాయేమో సార్! అని నేను రిపోర్టర్ గా ఉండగా ఒక టీచర్ తో అన్నాను. “చెట్లమీద నీ ప్రేమ సంతకెళ్లా…భలేవాడివే! ఇప్పుడు టీచర్లనే పిల్లలు కొట్టాలి. మేము చేతులు కట్టుకు నిలుచోవాలి. రోజులు మారాయి…” అని నిట్టూర్చారు.
“నన్ను కొట్టారు కదా!
మా నాయన సర్పంచ్. రేపు మా నాయన్ను తీసుకొస్తా…” అని ఏడుస్తూ నా ఫ్రెండ్ ఒకడు టీచర్ ను బెదిరించాడు. దానికి మా సోషల్ టీచర్ నంజుండప్ప సార్ ఇచ్చిన సమాధానం-
“ఒరేయ్! మీ నాయన్ను కూడా ఇట్లనే ఇదే క్లాసులో కొట్టినా. తోడుకొని రా! రేపు మీ నాయన్ను, నిన్ను కలిపి మళ్లీ కొడతా…”
అంతే. మా ఫ్రెండు ఏడుపు ఆపి…కామ్ గా వెళ్లి కూర్చుని…చేతి వాతలను ఆప్యాయంగా తడుముకుని…తరతరాలుగా టీచర్ చేతి రాజదండం దండించిన సందర్భాలను ఈస్ట్ మన్ కలర్లో ఊహించుకున్నాడు.
కొందరికి టీచరు దండం దండనగా తగిలించిన వాతలు వారానికి తగ్గేవి. కొందరికి రెండు వారాలకు తగ్గేవి. కొందరికి వాపు తగ్గినా వాత ఎరుపు నలుపు కలిసిన రంగు మచ్చగా జీవితాంతం అలాగే ఉంది. ఒక క్లాసు అయిపోయాక మరో క్లాసుకు చేతిలో రాజదండాన్ని దారంతా తీసుకెళ్లాల్సిన పనిలేకుండా చాక్ పీసు, డస్టర్ తో పాటు దండాన్ని కూడా టేబుల్ మీద ఒద్దికగా అమర్చి వెళ్లేవారు. రాముడి చెప్పులే అయోధ్యను పద్నాలుగేళ్లు నిరాఘాటంగా పరిపాలించినట్లు…మా టీచర్ల చేతి కర్రలు కూడా ఎన్నో సార్లు వారు లేకున్నా క్లాసులను పరిపాలించేవి.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
క్లాసుల్లో ఈ కర్రసాము ఏమిట్రా నాయనా! అని మా మిత్రులు కొందరు దిగులుగా విసుక్కుంటే… “ఇప్పుడింకా నయం…కర్ర చుట్టు కొలత అంటే వ్యాసార్థంతో పాటు పొడవు కూడా బాగా తగ్గిపోయింది. మా నాయన కాలంలో అయితే టీచరు దండనకు ప్రత్యేక పరికరాలు, విధానాలు ఉండేవి. తొడపాశం, గుంజిళ్లు, ముక్కు పట్టుకుని చెంపలు వాయించడం, ఒంటికాలి మీద ఎండలో నిలుచోబెట్టడం, గ్రవుండంతా పది రౌండ్లు పరిగెత్తించడం, ఒక్కో సమాధానం పది సార్లు రాయించడం…లాంటి చిత్ర విచిత్ర శిక్షలు ఉండేవట. వాళ్లతో పొలిస్తే ఇప్పుడు మనకు తగులుతున్నవి తమలపాకు దెబ్బలేరా!” అని వాళ్ళ నాన్నలు తిన్న దెబ్బలను మైమరచి చెప్పడంతో…ఆ క్షణాన గాయాలు గాయాలు కాకుండా పోయేవి.హెడ్మాస్టారు, టీచర్లు బదిలీ అయినప్పుడు కర్రలను బాధ్యతగా ఒకరినుండి ఒకరికి బదిలీ చేసుకునే ప్రక్రియ కూడా చాలా గౌరవంగా, మాకు కనిపించేంత పారదర్శకంగా ఉండేది. “దేవుడికన్నా దెబ్బే గురువు” అన్న సూత్రాన్ని గురువులు మనసా వాచా కర్మణా నమ్మి ఆచరించిన కాలమది.
“విశ్వామిత్రా హి పశుషు
కర్దమేషు జలేషు చ
అంధే తమసి వార్ధక్యే
దండం దశగుణం భవేత్”
పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువుల దగ్గర; బురదలో, నీటిలో, గుడ్డితనంలో, చీకటిలో, ముసలితనంలో-
ఇలా పదిరకాలుగా దండం(కర్ర) ఉపయోగపడుతుందని అనుభవపూర్వకంగా శాస్త్రం సిద్ధాంతీకరించింది. అయితే శ్లోకంలో పై మూడు పాదాలను గాలికొదిలేసిన లోకం...”దండం దశగుణం భవేత్” అన్న చివరి నాలుగో పాదాన్ని మాత్రం పట్టుకుని- దండనే అన్నిటికీ పరిష్కారమని దౌర్జన్యంగా దురర్థాన్ని సాధించి…శక్తి వంచన లేకుండా దండిస్తోంది!
సందర్భం:-
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా. బొబ్బిలి మండలం. పెంట జడ్ పి హైస్కూల్. ఉదయం అసెంబ్లీ వేళ. పిల్లలందరూ వరుసలు, వరుసలుగా బుద్ధిగా నిలుచున్నారు. ప్రార్థన, ప్రతిజ్ఞ అయ్యాయి. హెడ్మాస్టర్ చింతా రమణ మనసుదోచే విజయనగరం యాసతో మాట్లాడ్డం మెదలుపెట్టారు.
“పిల్లలూ! మా శక్తికి మించి మీకోసం తాపత్రయపడుతున్నాం. పాఠాలు చెబుతున్నాం. మీరు బాగా చదువుకుని గొప్పవారైతే మాకంతకంటే కావాల్సిందేముంటుంది? మా ఒళ్ళు హూణమవుతోంది కానీ…మీ బుర్రలకు పాఠాలు ఎక్కడం లేదు. అక్షరం ముక్క రావడం లేదు. మీకు ఇక ఏ పద్ధతిలో చెబితే అర్థమవుతుందో కూడా తెలియడం లేదు. మిమ్మల్ను కొట్టకూడదు. తిట్టకూడదు. చేతులు జోడించి వేడుకుంటున్నా అని సాష్టాంగ నమస్కారం చేశారు. చెవులు చేతులతో పట్టుకుని గుంజిళ్ళు తీసి ప్రాధేయపడ్డారు. పది గుంజిళ్ళు కాగానే పిల్లలందరూ ముక్తకంఠంతో వద్దు సార్! వద్దు సార్! అన్నారే కానీ…కొట్టండి సార్ అని అనలేదు! తిట్టండి సార్ అని అనలేదు! బుద్ధిగా చదువుకుంటాం సార్ అని అనలేదు! ఆ క్షణాన ఆ పిల్లలకు ఎలా స్పందించాలో కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు.
“గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో!
అజునకైనా వాని యబ్బకైన;
తాళపుచెవి లేక తలుపెట్టులూడునో! విశ్వదాభిరామ వినురవేమ!”
బ్రహ్మకైనా, బ్రహ్మను కన్నవాడికైనా గురువు దెబ్బ పడకపోతే చదువెట్లా వస్తుందని వేమన ప్రశ్నించాడు. వేమన కాలానికి గురువు దెబ్బలు శిక్షణలో భాగం. ఇప్పుడు గురుడు కొడితే శిక్ష అనుభవించాల్సిన కాలం.
ఒకానొక గురువు చింతా రమణ బడి పిల్లలముందు వారి చదువుల గురించి చింతాక్రాంతుడై గుంజిళ్ళు తీస్తూ…చేతులు జోడించి నేలమీద పడి పిల్లలను చదువుకోమని వేడుకుంటూ…కెమెరా కంటపడ్డాడు. ఆధునిక విద్యావిధానంలో చదువుల చెంత చింత తీరని, కెమెరా కంట పడని గురు రమణలు ఎందరో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు