Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందిస్ ఈజ్ టు సర్టిఫై దట్...

దిస్ ఈజ్ టు సర్టిఫై దట్…

Manchi Donga: యుద్ధంలో శత్రువు మెలకువను సాయంత్రం గుడారంలోకి వచ్చాక…విరిగిన ఎముకలకు వెదురు బద్దలు- సున్నం కట్లు కట్టించుకుంటూ…గాయాలకు ఆయింట్ మెంట్ పూసుకుంటూ…వాపులకు వేడి నీళ్ల కాపడం పెట్టించుకునే వేళ అయినా తలచుకుని…ప్రయివేటుగా ప్రశంసించాలంటాడు చాణక్యుడు. ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్నా…చెప్పింది సాక్షాత్తూ చాణక్యుడు కాబట్టి…ఇందులో ఏదో బోధ ఉందని లోకం బుర్ర పెట్టి ఆలోచించగా…చించగా… కొన్ని విషయాలు అర్థమయ్యాయి.

1 . ఇంతింత తోలు, లోహ కవచాలు, శిరస్త్రాణాలు, డాలు, కత్తులు నా దగ్గర ఉండగా…వాడు నన్నెలా పొడవగలిగాడు? అన్న దృశ్యాన్ని రీకాల్ చేసుకోవడం వల్ల రేపు యుద్ధంలో జాగ్రత్త పడవచ్చు. లేదంటే ఈరోజు కత్తి గాటే. రేపు తెగేది తలే.
2 . ఖడ్గ, గదా, ధనుర్విద్యలో వాడు ఏ లెవెల్లో ఉన్నాడో అంచనాకు రాకపోతే కొంప కొల్లేరే.
3 . వాడు నన్ను భలే పొడిచాడు కదా అని మంత్రితోనో , సర్వ సైన్యాధ్యక్షుడితోనో ప్రయివేటుగా అనడం అంటే…మీరు తిండికి తిమ్మరాజులు- పనికి పోతరాజుల్లా తిండి దండగ బ్యాచ్ లా ఉన్నారు. రేపు వాడు ఇలాగే నన్ను చంపినా వెర్రి వెంగళప్పల్లా చూస్తూ ఉంటార్రా? యూ బ్లడీ ఫూల్స్! అని రెచ్చగొట్టడం! కోప్పడడం!
4 . నిజంగానే శత్రువు మెలకువను ప్రశంసించడం.

చాణక్యుడు చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. రెండున్నర వేల సంవత్సరాల కిందట రాసినా…ఇప్పటికీ అన్వయమవుతాయి ఆయన సిద్ధాంతాలు. ఎప్పటికీ అన్వయమవుతూనే ఉంటాయి.

తెలంగాణ మంచిర్యాల జిల్లా వెన్నెల గ్రామీణ బ్యాంకును దోచుకోవడానికి ఒక అమావాస్య చిమ్మ చీకటి రోజు ఒక దొంగ చోర ముహూర్తం నిర్ణయించుకున్నాడు. గళ్ల లుంగీ, కలర్ కట్ బనీన్, మెడకు ఎర్ర కర్చీఫ్, బుగ్గన పావలా బిళ్ళంత నల్లటి చుక్క, నెత్తికి ముసుగు, ఒక చేతిలో టార్చ్ లైట్, మరో చేతిలో సుత్తితో…వృత్తిగతమయిన సంప్రదాయ ఫార్మల్ డ్రస్ కోడ్ తో బ్యాంక్ వెనుక వైపు నుండి ఎడమ కాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించాడు.

అన్ని టేబుల్ సొరుగులు వెతికాడు. క్యాష్ కౌంటర్లన్నీ ఓపెన్ చేశాడు. మేనేజర్ రూములో అల్మరాలన్నీ వెతికాడు. స్ట్రాంగ్ (లాకర్) రూమ్ తలుపు బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. మిల్లీ మీటర్ కూడా లాకర్ రూమ్ తలుపు కదల్లేదు. బ్యాంక్ లో ఎక్కడా రూపాయి బిళ్ల కూడా దొరకలేదు.

దొంగ నిరుత్సాహపడలేదు. తనకు ఒక్క వంద నోటయినా దొరకనందుకు బాధపడలేదు. అంత పకడ్బందీగా బ్యాంకును నిర్వహిస్తున్నందుకు పొంగిపోయాడు. ఉబ్బి తబ్బిబ్బులయ్యాడు. బ్యాంకును మనస్ఫూర్తిగా ప్రశంసించాలనుకున్నాడు. అక్కడే ఒక న్యూస్ పేపర్ మీద మార్కర్ పెన్నుతో-
“గుడ్ బ్యాంక్.
ఒక్క రూపాయి దొరకలేదు.
నా ఫింగర్ ప్రింట్స్ దొరకవు.
నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు”
అని గొప్పగా రాసి పెట్టి వెళ్లాడు.

బ్యాంకులను వేల కోట్లకు ముంచి...లండన్లో తేలే దొంగాతిదొంగలు, గజ గజాతి దొంగలు, రాజకీయనాయకుల ముసుగులో బ్యాంకుల ఉసురు తీసిన ముసుగు దొంగలతో పోలిస్తే…ఈ దొంగ చాలా సున్నిత హృదయుడు. సంస్కారం ఉన్నవాడు. ఎదుటివారి గొప్పను నిండు మనసుతో అభినందించే గొప్ప సంస్కారం ఉన్నవాడు. చాణక్యుడి సూత్రీకరణకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది.

ఊరి పేరు వెన్నెల అట. వింటేనే ఎంత చల్లగా, హాయిగా ఉందో!
అక్కడ దొంగల మనసులను కూడా దోచిన వెన్నెల ఇలా దోసిళ్లలో ప్రశంసలు కురిపిస్తూ ఉందేమో!

దిస్ ఈజ్ టు సర్టిఫై దట్… అంటూ వెన్నెల ఊళ్లో ఒక వెన్నెల కురవని రాత్రి బ్యాంకుకు ఒక దొంగ ఇచ్చిన వెలలేని వెన్నెల సంతకమిది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్