రచయిత శ్రీరమణ అని కొడితే గూగుల్లో ఆయన బయోడేటా అంతా దొరుకుతుంది. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఆయన కథకుడు, కాలమిస్ట్. వ్యంగ్య రచనల్లో అందెవేసిన చేయి. ఆయన రాసిన “మిథునం” కథ రెండే పాత్రలతో సినిమాగా వచ్చింది. బాపు- రమణలతో ఆయన దాదాపు పాతికేళ్లు ప్రయాణం చేశారు. జర్నలిస్టుగా విజయవాడ, హైదరాబాదుల్లో పెద్దవారితో కలిసి పనిచేశారు- లాంటి వివరాలన్నీ అందరికీ తెలిసినవే. అవే చెబితే పునరుక్తి అవుతాయి.
హాస్యనటుడు, తెలుగు పద్యాలంటే మైమరచిపోయే ధర్మవరపు సుబ్రహ్మణ్యం నా శ్రేయోభిలాషి. నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన ఒకరోజు శ్రీరమణను నాకు పరిచయం చేసి…ఈయన మాట్లాడేప్పుడు జాగ్రత్తగా విను మధూ! లేకపోతే చాలా మిస్సయిపోతావు అన్నారు. ఆ క్షణం నుండి ధర్మవరపు చెప్పినట్లు ఒళ్లంతా చెవులు చేసుకుని శ్రీరమణను విన్నాను. ఒళ్లంతా కళ్లు చేసుకుని చదివాను. మా మధ్య గంటలు సెకెన్లలా దొర్లిపోయేవి.
“విశ్వనాథ పద్యాలు రాయరు…నోటికి చెబుతుంటే శిష్యులు రాసేవారట…” అని విజయవాడ వీధిలో రిక్షాలో వెళుతున్న విశ్వనాథవారిని ఏనుగు ఎక్కి విజయనగర విరూపాక్ష గుడి ముందు వెళుతున్న కవిరాజులా శ్రీరమణ చెబుతుంటే విని పులకించిపోయేవాడిని.
లండన్లో ఎవరింటికో పలకరింపుకు వెళ్లిన శ్రీశ్రీ టేబుల్ మీద ఉన్న ఇంగ్లీషు పదకేళిని రెండు నిముషాల్లో పూర్తి చేస్తే…నాలుగు రోజులుగా దాన్ని పూర్తి చేయలేకపోయిన ఆ ఇంటి యజమాని, సాహితీ పిపాసికి నోట మాట రాలేదని…తేరుకున్నాక ఆయన శ్రీశ్రీ ఇంగ్లీషు పరిజ్ఞానం గురించి ఎలా హాశ్చర్యపోయాడో శ్రీరమణ చెబుతుంటే వినాలి.
నమ్మినవారు మోసం చేయగా ముళ్లపూడి వెంకటరమణ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాపు కుటుంబం ఎలా బాధ్యత తీసుకుందో శ్రీరమణ చెబితే ఒళ్లు పులకిస్తుంది.
సినారె రాసుకొచ్చిన పాటకు బాపు ఎలా స్పందించారో, ముళ్లపూడి ఎలా సవరణలు చెప్పకుండానే చెప్పారో శ్రీరమణ చెబుతుంటే…ఓహో అందుకా బాపు సినిమాల్లో తెలుగు తెలుగులా ఉంటుందని పొంగిపోవాలి.
అంత్యప్రాసల ఆరుద్ర అంటే బాపు ఎందుకు మైమరచిపోతారో శ్రీరమణ చెబుతుంటే…సినిమాలో పాట ప్రాసలో రాక మిగిలిన ముత్యాల ప్రాసలను ఏరుకోవాలి.
వేటూరి కృష్ణా తరంగాల్లో రాయని కావ్యాలు పలికిన మధురిమలు శ్రీరమణ చెబుతుంటే…అర్జంటుగా వేటూరి కాళ్ళెక్కడ ఉన్నాయని వెతుక్కోవాలి.
గుంటూరు శేషేంద్ర చెట్టంత కవిత్వంలో కొమ్మలు, రెమ్మలు, పూలు, కాయలను విడమరచి శ్రీరమణ చెబుతుంటే ఆ చెట్టు నీడలో సేద తీరాలి.
ఒకటా? రెండా? ఇరవై ఏళ్ల మా సాహితీ స్నేహంలో ఎన్నెన్ని పులకింతలో? ఎన్నెన్ని జ్ఞాపకాలో? కలిసినా, ఫోన్లో మాట్లాడుకున్నా గంటకు తక్కువ మాట్లాడిన సందర్భాలు ఉండనే ఉండవు. వెయ్యేళ్ల రాజరాజనరేంద్రుడి ప్రత్యేక సంచిక, ఆయన రాసిన నాలుగో ఎకరం…ఇలా నా లైబ్రరీలో ఆయన ప్రేమతో సంతకం చేసి బహూకరించిన పుస్తకాలు లెక్కలేనన్ని ఉన్నాయి.
ఒకరోజు హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానం ఎదురుగా ఉన్న ఒక ప్రఖ్యాత హోటల్లో నేను, ధర్మవరపు, శ్రీరమణ ఉదయాన్నే కలిశాము. అప్పటికే మేమిద్దరమూ టిఫిన్ చేశాము…అయినా ధర్మవరపు వదలరు. ఆయన ఇష్టంగా తింటారు. అంతే ఇష్టంగా ఎదుటివారికి వడ్డిస్తారు. మేమిద్దరం కాఫీ మాత్రం తాగుతామంటే ఆయన వినలేదు. కొద్దిగా ఏదో ఒకటి తినాలని మొహమాటపెడితే సరే అన్నాము. ఒక ప్లేటు ఉప్మాను ముగ్గురికి తీసుకురమ్మన్నారు. వాడు ఒక ప్లేటులోనే మూడు భాగాలు చేసి…మూడు స్పూన్లు పెట్టి…వెళ్లబోతే…ధర్మవరపు ఇంకో రెండు ప్లేట్లు తీసుకు రా అన్నారు. “వేరే ప్లేట్లెందుకు? వద్దులేండి…శ్మశానం ముందున్నాడు కదా? వీడికి సంప్రదాయం తెలిసినట్లుంది…పళ్లెంలో అరిటాకు వేసి…మూడు పిండాలు పెట్టాడు…ఇలాగే కానిద్దాం… శ్రేష్ఠమయిన ఉత్పిండాలివి…” అని శ్రీరమణ తాపీగా అంటే మేమిద్దరం పడి పడి నవ్వుకున్నాం.
నిజమే-
ధర్మవరపు అన్నట్లు శ్రీరమణ మాటల్లో ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. లేకపోతే వాక్యానికో హాస్యరస గుళికను కోల్పోతాం.
19-07-23 తెల్లవారుజామున తుదిశ్వాస వదిలిన శ్రీరమణ తుదిశ్వాస వరకు పదహారణాల తెలుగు కోసం పరితపించారు. “మీలాగా తెలుగు వచన రచనలో ప్రతిపదంలో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని, తెలుగుతనాన్ని, తెలుగు ధనాన్ని దట్టించడం ఎలాగో నాకు నేర్పండి” అని ఆయన్ను అడిగితే…”అబ్బే…మీది మరీ ఇంత బ్యాడ్ టేస్ట్ అనుకోలేదండీ!” అని ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయిన శ్రీరమణ గారికి శిరసు వంచి నివాళి అర్పిస్తున్నాను.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018