Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపురాణ పాత్రలను ఎలా అన్వయించుకోవాలి?

పురాణ పాత్రలను ఎలా అన్వయించుకోవాలి?

ప్రఖ్యాత తెలుగు అధ్యాపకుడు, పండితుడు, వ్యాఖ్యాత, అసాధారణ ఉపన్యాసకుడు అప్పజోడు వెంకటసుబ్బయ్య తొంభై ఏళ్ళ వయసులో మొన్న(27-11-24) కర్నూల్లో కన్నుమూశారు. 86ఏళ్ళ వయసువరకు ఆయన ఆధ్యాత్మిక, సాహిత్య వ్యాసంగాల్లో తలమునకలుగా ఉన్నారు. వయసువల్ల వచ్చిన ఆరోగ్యసమస్యలతో కొంతకాలంగా ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు శాశ్వతంగా దూరమయ్యారు.

అప్పజోడు వెంకటసుబ్బయ్య(1935-2024). అనంతపురం, గూడూరు, నంద్యాల, హైదరాబాద్, కర్నూల్లో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరయ్యారు. “మహాభారతం- మానవ స్వభావ చిత్రణ” అన్న విషయం మీద ఉస్మానియాలో పి హెచ్ డి చేశారు. రామాయణ, భారతాల మీద తెలుగునేల మీద కొన్ని వేల ఉపన్యాసాలు చేసి ఉంటారు. భారతి పత్రిక మొదలు అనేక పత్రికలకు కొన్నివేల వ్యాసాలు రాశారు. పెద్దవారు. వందలమంది అభిమానులయిన శిష్యగణాన్ని సంపాదించుకున్నారు.

మొన్న మొన్నటిదాకా నాలాంటివారి పిచ్చి ప్రశ్నలకు పుస్తకాలు వెతికి రెఫెరెన్సులతో ఓపికగా సమాధానాలు చెప్పేవారు. రామాయణాన్ని పారాయణ చేస్తే పుణ్యమే కానీ… అర్థం, అంతరార్థం తెలుసుకుని పాటిస్తేనే పుణ్యం, పురుషార్థం అని వారు చెబుతుంటే వినడం ఒక భాగ్యం. ఎదుటిమనిషి స్థాయికి దిగి విడమరిచిచెబుతారు.

టీ టీ డి ధర్మప్రచారపరిషత్ కార్యదర్శిగా మా నాన్న పమిడికాల్వ చెంచు సుబ్బయ్య పనిచేశారు. అప్పజోడువారు అంతకుముందు అదే స్థానంలో కార్యదర్శిగా పనిచేశారు. ఇద్దరికీ చాలాకాలంగా స్నేహం. హిందూపురంలో, తిరుపతిలో మా ఇంటికి వారు ఎన్నోసార్లు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ మా నాన్నకు కొన్ని పుస్తకాలు ఇచ్చి వెళ్ళేవారు. అలా మా నాన్న చదివాక అప్పజోడువారి “రామాయణం చదివారా? అయితే ఈ పుస్తకం చదవండి” నా చేతికి వచ్చింది. 475 పేజీలు. పుస్తకం టైటిలే విచిత్రంగా ఉండి వెంటనే చదివాను. అందరికీ అర్థమయ్యే అత్యంత సరళమయిన శైలి. మానాన్న ద్వారా ఆయనతో పరిచయం పెంచుకుని వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి విసిగించేవాడిని. కొంతకాలానికి నాకు ఎలాంటి సందేహాలున్నాయో ఆయనే కనుక్కుని నేను అడక్కుండానే చెప్పేవారు. నాలాంటి వేలమంది స్టూడెంట్స్ ను హ్యాండిల్ చేసిన అనుభవం మరి. వార్ధక్యం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి కలవడం, మాట్లాడడం క్రమంగా తగ్గించాను. అయినా అరవై ఏళ్లపాటు మాట్లాడాల్సినదంతా మాట్లాడారు. రాయాల్సినదంతా రాశారు. ఇప్పుడు ఆయన మౌనం కూడా మాట్లాడుతూనే ఉంటుంది.

ఎప్పుడెప్పుడో రామాయణంలో పాత్రలమీద ఆయన రాసిన వ్యాసాలకు కొన్ని శ్లోకాలు, కొంత వ్యాఖ్య జోడించి ఒక పద్ధతిలో రూపొందించిన పుస్తకమిది. శబరి మొదలు శ్రీరాముడి దాకా 27 పాత్రలను ప్రస్తావిస్తూ 27 వ్యాసాల సమాహారం. క్రమపద్ధతిలో అయితే మొదట వసిష్ఠుడో, వాల్మీకో రావాలి. శబరితో మొదలయ్యింది. శ్రీరాముడు చిట్ట చివర ఉన్నాడు. రచయిత చమత్కారం ఇక్కడే ఉంది. రాముడిని మించిన రామభక్తి రూపుదిద్దుకున్న పాత్రలకు మొదట పట్టం కట్టారు. 475 పేజీల్లో విస్తరించిన 27 వ్యాసాలను ఇక్కడ ప్రస్తావించడం కుదరదు.

“శ్రీ వేంకటసుబ్బయ్య గారు పాత్రలను ఎంచుకొనే క్రమంలో ఒక ప్రత్యేకత చూపించారు. స్త్రీ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో మొదట శబరిని, చివర సీతాదేవిని ఎంచుకున్నారు. పురుష పాత్రలను త్రిజటుడితో ప్రారంభించి రాముడితో ముగించారు. ‘మహర్షుల సేవకు అంకితమైన జీవితం శబరిది. ఆమెది పరిచారికా భక్తి’ అన్నారు వేంకటసుబ్బయ్య గారు. “శ్రీమద్రామా యణంలో శబరి ఒక అడవిమల్లె” అన్నారాయన. త్రిజటుడు “లోకంలోని పేదరికం అంతా ఒక్క చోటికి చేరి దాల్చిన ఆకారం” అన్నారు. పురుషులలో ఉంఛవృత్తితో జీవిస్తున్న త్రిజటుడికి, స్త్రీలలో పరిచారిక శబరికి వ్యాస క్రమంలో అగ్రస్థానం ఇవ్వడంలో గ్రంథకర్త ఉద్దేశం రామాయణంలో ఏ పాత్రా తక్కువ చేసి చూడదగినది కాదని చెప్పటమే అనిపిస్తుంది. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల గ్రంథకర్తకు ఉన్న సానుభూతినీ, అభిమానాన్నీ కూడా ఇది వ్యక్తం చేస్తుంది.

ప్రతి వ్యాసానికి ముందు ఆయా పాత్రలను గురించి కొన్ని పరిచయ వాక్యాలు వ్రాయటం గ్రంథకర్త అనుసరించిన పద్ధతి. ఇలా రాయటంలో ఎన్నో సార్వకాలిక సత్యాలు, లోకరీతులు చోటు చేస్తున్నాయి. జటాయువు గురించి వ్రాస్తూ ‘మంచి మిత్రుడు మన సంతోషాన్ని అంతకంత అధికం చేస్తాడు. మన దు:ఖాన్ని కొంతకు కొంతైనా పంచుకొంటాడు. మిత్రుల్లో కొందరు స్వార్థపరులుంటారు. వాళ్ళు సంపదలున్నప్పుడు చెంత చేరుతారు. ఆపద సమయంలో అగుపడకుండా పోతారు’ అని ఒక లోకరీతిని చాటారు. మంథర గురించి వ్రాస్తూ “ పచ్చటి కుటుంబాల్లో చిచ్చు పెట్టే మంథరలు ఈ నాటికీ లోకంలో ఎందరో ఉన్నారు. అందరూ వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండటం ఎంతో అవసరం “ అని హెచ్చరించారు”- అని పుస్తకానికి ముందుమాటలో ప్రఖ్యాత పత్రికా సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు.

“తెలుగులో అనేక రామాయణాలున్నాయి. వాటిలో అనేక కల్పనలు కూడ ఉన్నాయి. ఏ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకొని పాత్రల విశ్లేషణ చెయ్యాలన్నది పెద్ద సమస్య. అందువల్ల పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణాన్నే చదివి, ఆ రామచంద్రుని జీవిత మార్గంలో నేను దర్శించి పులకించిన పాత్రల్ని, సన్నివేశాల్ని పాఠకులు కూడా దర్శించేటట్లు చేయ్యాలని, నేను పొందిన అనుభూతుల్ని పాఠకులు కూడా పొందేటట్లు చెయ్యాలని చేసిన ఒక చిన్న రచనే ‘జీవన చిత్రాలు’.

ఇది విమర్శ గ్రంథమే అయినా, అనుభూతి ప్రధానంగా సాగిన రచన. కనుక అక్కడక్కడ కొంత భావుకత చోటు చేసుకొంది. కొన్ని అలంకారాలు క్రొత్తవి రూపుదిద్దుకొన్నాయి. అయితే, అవన్నీ ఆయా సన్నివేశాలకు అనుగుణమైనవే; వాల్మీకి హృదయానికి భిన్నం కానివే.

ఈ నాటి యువతలో మన సంస్కృతిని, మానవత్వపు విలువలను, సంప్రదాయాలను నెలకొల్పే ప్రయత్నానికి పూనుకోగలరని, రామాయణాన్ని కనీసం అనువాద రూపంలోనైనా చదవాలన్న ఆసక్తిని విద్యావంతులందరిలో రేకెత్తించగలరని “రామాయణం చదివారా…? అయితే ఈ పుస్తకం చదవండి” అన్నపేరుతో ఈ ద్వితీయ ముద్రణను వెలువరిస్తున్నాను. సహృదయతతో అందరు ఈ గ్రంథాన్ని ఆదరించగలరని ఆశిస్తున్నాను”- అని తన హృదయాన్ని “సహృదయా!” అని మనల్ను సంబోధిస్తూ ఆవిష్కరించారు అప్పజోడువారు.

ఒకసారి కర్నూల్ వెళ్ళినప్పుడు నేను, ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు కలిసి సార్ దగ్గరికి వెళ్ళాము. “నాకు భారతపాత్రలు గజిబిజిగా అనిపిస్తాయి సార్. రామాయణ పాత్రలు స్పష్టంగా ఉంటాయి…” అన్నాను. “నువ్వింకా త్రేతాయుగంలోనే ఉన్నట్లున్నావ్…ద్వాపర దాటి కలియుగంలోకి రా నాయనా! నీ చుట్టూ అన్ని భారత పాత్రలు స్పష్టంగా కనిపిస్తాయి” అన్నారు. వెళ్ళిన ప్రతిసారీ రెండు పుస్తకాలు చేతిలో పెట్టేవారు. సార్! మీకివ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు…ప్రతిఫలంగా నాలుగు పద్యాలు పాడుతాను అని “పెన్నేటిపాట” పద్యాలు పాడేవాడిని. నా ముందు పెన్నను కట్టేసి, విద్వాన్ విశ్వాన్ని నిలబెట్టి పోతున్నావ్! ఇందులో నీళ్ళున్నాయా? లేవా? అని చమత్కరించేవారు. దాదాపు పదేళ్ళ పాటు తెలుగు భాష, పురాణ పాత్రల గురించి సార్ తో మాట్లాడిన మాటలన్నీ నా చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

వేలమంది విద్యార్థులకు తెలుగు రుచి చూపించిన అధ్యాపకుడికి;
పురాణ పాత్రలమీద వేనవేల వ్యాసాలు రాసిన వ్యాఖ్యాతకు;
గంగాప్రవాహంలాంటి ఉపన్యాసాలతో తెలుగునేల నలుచెరగులా ప్రతిధ్వనించిన వాగ్ధాటికి;
పురాణ పాత్రలనుండి మనమేమి నేర్చుకోవాలో చెప్పిన పండితుడికి…
అక్షరాంజలితో నివాళి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్