Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచావుకొచ్చిన స్మార్ట్ ఫోన్

చావుకొచ్చిన స్మార్ట్ ఫోన్

కొన్ని వార్తలు చదవకపోతేనే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది. డిజిటల్ వ్యామోహంలో మనుషులు ఎలా మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి చదవకతప్పదు. డిజిటల్ వ్యసనంలో పడ్డవారు వావి వరుసలు మరచి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుని జాగ్రత్తపడాలి కాబట్టి తెలుసుకోక తప్పదు.

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఒకానొక మధ్యతరగతి దంపతులు. వారికి ఒక కొడుకు. సంసారం హాయిగా సాగుతుండగా సెల్ ఫోన్ వారి సంసార నౌకను కుదిపేసింది. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఎవడితోనో భార్య రాత్రీ పగలు అచ్చికబుచ్చికములాడుతోంది. ఏదోలే స్మార్ట్ ఫోన్ సరదా అనుకుని మొదట్లో భర్త పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను అదే వ్యాపకమై ఇల్లూ వాకిలి మరచిపోయేసరికి అత్తవారింటికి వెళ్లి…పంచాయతీ పెట్టాడు. ఆమె తల్లిదండ్రులు బాధ్యతగా కూతురిని మందలించి… సంసారంలో చేతులారా నిప్పులు పోసుకోకు అని జాగ్రత్తలు చెప్పారు.

కొన్ని రోజులు వాతావరణం గంభీరంగా గడిచింది. మళ్లీ షరా మామూలే. చేతిలో ఫోన్ ఉంటేనే కదా ఈ సమస్య! అని భర్త భార్య చేతిలో ఫోన్ లాక్కుని ఎక్కడో దాచేశాడు. రాత్రి పడుకోబోయే ముందు ప్రశాంతంగా నేను పరుపు మీద వాలి సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉండగా నా చేతిలో ఫోన్ లాక్కుని…దాచి…పడుకుంటాడా! అని కుపితురాలైన భార్య భర్తకు నిద్రలోనే లేవకుండా మత్తు మందు ఇచ్చింది. మంచానికి తాళ్లతో కట్టేసింది. కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ చేతబట్టి భర్త దేహమే పిచ్ గా పిచ్చ పిచ్చగా బ్యాటింగ్ వీర విహారం చేసింది. బ్యాటింగ్ మధ్యలో స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకొని కరెంట్ షాకులు కూడా ఇచ్చింది. ఆమె చేస్తోన్న సింగిల్స్, ఫోర్లు, సిక్స్ లు సౌండ్ పెరిగి కొడుకు లేచి వచ్చాడు. గ్రవుండ్ రక్తసిక్తమై ఉండేసరికి తండ్రి వికెట్ హరీమనేలా ఉందని గ్రహించి…ప్రాణాలకు తెగించి తల్లి బ్యాటింగ్ కు ఎదురెళ్లాడు. తగిన మోతాదులో బ్యాటింగ్ దెబ్బలు తిన్నాడు. పరిమిత ఓవర్ల బ్యాటింగ్ అయ్యాక తల్లి అలసిపోయి పక్కకు వెళ్లగా...అతి కష్టం మీద తండ్రి కట్లు విడిపించి…పక్కవారి సాయంతో ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లారు.

ఆసుపత్రి బెడ్ మీద స్పృహలోకి వచ్చిన భర్త అటు నుండి అటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి…భార్య మీద కేసు పెట్టాడు. భర్తకు విరిగిన కొన్ని ఎముకలు శాశ్వతంగా విరిగినట్లే. కొడుకు మాత్రం కోలుకోవచ్చు.

ఫోన్ లాక్కుంటే…నా భార్య ఇలా నాకు మత్తు మందు ఇచ్చి…నన్ను ఇలా మంచానికి కట్టేసి…ఇలా హెలిక్యాప్టర్ షాట్స్ తో లాస్ట్ బాల్స్ లో జార్ఖండ్ డైనమైట్ ధోని చెలరేగినట్లు ఇలా నాపై బ్యాటింగ్ చేస్తుందని తెలిస్తే…నేనేందుకు లాక్కుంటాను చెప్పండి! అని అమాయకంగా అడుగుతున్నాడు ఆ భర్త.

అదే ఆగ్రాలో చనిపోయిన భార్యకు గుర్తుగా యమునా తీరంలో తాజ్ మహల్ కట్టి…కుమిలి కుమిలి ఏడ్చాడు షాజహాను. అదే ఆగ్రాలో అదే తాజ్ మహల్ పక్కన భార్య కొట్టిన దెబ్బలకు విరిగిన ఎముకలను చూపుతూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఈ భర్త.

అంతకుముందు అదే ఉత్తర ప్రదేశ్ లో జరిగిన మరో ఉదంతమిది. ఒక జంట. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు పిల్లలు. అతడు ట్రావెల్ ఏజెంట్. ఆమె గృహిణి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి తగ్గి…తీరిక దొరికింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారూ ఈరోజుల్లో జేమ్స్ కెమెరాన్లకు, రాజమౌళులకు దర్శకత్వ కెమెరా యాంగిల్ పాఠాలు చెప్పగలరు. అది నవీన యుగధర్మం కాబట్టి…ఖాళీగా ఉండే బదులు క్రియేటివ్ గా ఏవయినా వీడియోలు, ఆడియోలు, వ్యాఖ్యలు చేయవచ్చు కదా! అని ఆమె అనుకుని సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించింది. భర్తకు కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండడం ఇష్టం.

మొదట్లో అంతా బాగానే ఉంది. కొన్నేళ్లు గడిచే సరికి భార్యా- భర్తల మధ్య షేర్లు, లైకులు, కామెంట్లు, ఫాలోయర్లు, సబ్ స్క్రైబర్ల సంఖ్య పోటీ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో భర్త కంటే భార్యకే ఫాలోయర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇద్దరి మధ్య ఈ విషయంలో వాగ్వాదాలు మొదలయ్యాయి. చివరికి ఇన్ స్టాలో భర్త ఫాలో కాకుండా భార్య బ్లాక్ చేసింది. దాంతో భార్యకు అక్రమ సంబంధం అంటగట్టాడు భర్త. అయినా భార్య సోషల్ మీడియాలో దిన దిన ప్రవర్ధమానమవుతోంది.

భార్య సోషల్ మీడియాలో సెలెబ్రిటీ కావడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. తన కంటే తక్కువ ఫాలోయర్లు ఉన్నంతవరకు భార్యను సహించిన భర్త…తనను దాటివెళ్లడంతో సహించలేకపోయాడు. మాటా మాట పెరిగింది. జుట్లు పట్టుకున్నారు. చివరికి కన్న పిల్లల కళ్లెదుటే భార్య గొంతు నులిమి చంపేశాడు తాళి కట్టిన భర్త.

తల్లి లేదు. తండ్రి జైలు పాలయ్యాడు. పిల్లలు అనాథలయ్యారు. ఇది లోకంలో వెలుగులోకి వచ్చిన వార్త. వెలుగులోకి రాక…సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకుని…పరస్పరం జుట్లు పట్టుకుంటున్న, గొంతులు పట్టుకుంటున్న, అసూయ ద్వేషాలతో రగిలిపోతున్న, కత్తులు దూసుకుంటున్న ఆదర్శ అభ్యుదయ డిజిటల్ వ్యామోహ దాంపత్యాలెన్నెన్ని ఉన్నాయో?

సంసారాల్లో డిజిటల్ చిచ్చు భగ్గున మండి…లైకులు, కామెంట్ల బూడిద మిగులుతోంది. మండే అగ్గిలోకి మరింత పెట్రోల్ పొసే ఫాలోయర్లకు కొదవలేదు.

ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలె గూడు.
జ్ఞానమొక వాట్సాప్ యూనివర్సిటీ.
జీవన దృశ్యమొక ఎడతెగని యూట్యూబ్.
మనిషి పేస్ ఒక ఫేస్ బుక్.
ఇష్టమొక ఇన్ స్టా గ్రామ్.
అభిప్రాయమొక పొట్టి ట్విట్టర్.
బలమయిన ఆహారం లైకులు.
అంతులేని ఆవేదన కామెంట్లు.
తరగని ఆస్తి సబ్ స్క్రిప్షన్.
జీవన సర్వస్వమొక సోషల్ మీడియా వ్యసనం.

…చివరకు మిగిలేది వర్చువల్ బూడిద!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్