Sunday, February 23, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభార్యా బాధితులు

భార్యా బాధితులు

Complaint on Wife:
వృత్తి రీత్యా ప్రవచనకారులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రవృత్తి రీత్యా ప్రవచనకారులు ఎందరో ఉంటారు.
మొన్న కర్నూలు జిల్లా పెద్ద కడబూరు పోలీస్ స్టేషన్ కు కేసు పెట్టాలంటూ వచ్చిన చిన్న పిల్లాడిని పెద్ద మనసు చేసుకుని…రాజీ చేసుకో! అని పెద్ద మనసుతో సూచించిన పోలీసు వీడియో వైరల్ అయ్యింది. ఐ ధాత్రిలో ప్రచురితమయిన ఆ వార్త లింక్ ఇది.

రాజీ మార్గం

తాజాగా హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు ధర్మ ప్రవచనం వీడియో వైరల్ అయ్యింది.

ఆరోజు ఎప్పటిలా సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోయాడు. పక్షులు గూళ్లకు తిరిగి వచ్చేశాయి. లోకం ముద్ద నోట్లో వేసుకుని, ముసుగు తన్ని పడుకుని గుర్రు పెడుతోంది. అర్ధరాత్రి అవుతోంది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ పోలీసులు నిద్రపోకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఈలోపు పోలీస్ స్టేషన్ గుమ్మం ముందు ఒక యువకుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చేతులతో కన్నీళ్లు తుడుచుకుంటున్నా పొంగి వచ్చే కన్నీళ్లు ఆగడం లేదు. అతడిని అతడి భార్య రోజూ కొడుతోందట. భార్య భౌతిక హింస భరించలేక సాంత్వన కోసం, రక్షణ కోసం, ఆ రాత్రికి తనను తాను రక్షించుకోవడం, కరువుతీరా ఏడవడం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడు సరయిన చోటుకే వెళ్లాడు. భార్య కొట్టిన దెబ్బలకు ఏడుస్తున్న అతడిని పోలీసు ఎంత సహజంగా, ఆర్తిగా ఓదారుస్తున్నాడో మీరే చూడండి.

నిజమే.
జమానా మారిపోయింది. మహమ్మద్ అలీ! ఏడవకు ఏడవకు…పెండ్లాము అన్నంక కొడతరు…మన మగోళ్ల బతుకులు అట్ల అయిపోయినయి…పొద్దుగల్ల రా పో…ఏడవకు…అని పోలీసు ఓదారుస్తున్నారు. రెండు మాటల ఓదార్పులో అంతులేని సమకాలీన ధార్మిక ప్రవచనాన్ని దట్టించిన ఈ పోలీసు చాగంటికి తక్కువేమీ కాడు.

నిజమే- మహమ్మదలీ!
మగోళ్ల బతుకులు ఇట్లయినయి!
పెండ్లామన్నంక కొడతది!
దెబ్బలకు ఓర్చుకోవాలె. వాతలు తేలితే వెన్న రాసుకోవాలె. రక్తాలు కారితే ఆయింట్ మెంట్ పూసుకోవాలె. ఎముకలు విరిగితే కట్లు కట్టుకోవాలె.
అర్ధరాత్రిళ్లు ఇళ్లల్లో ఏడవకుండా…మైలార దేవుళ్ల ముందు వెక్కి వెక్కి ఏడవాలె. పొద్దుగల్ల అన్నీ మరచిపోయి…మళ్లీ దెబ్బలకు సిద్ధం కావాలె.
ఏడవకు …
ఏడవకు…
ఊకో…ఊకో!

ఉపసంహార వాక్యం:-

భార్య దెబ్బలకు ఒళ్లు చిల్లులు పడేలా ఏడుస్తున్న మహమ్మదలీ బాధను అర్థం చేసుకుంటూ…అతడికి సానుభూతి తెలుపుతూ…
భర్త భార్యను గానీ, భార్య భర్తను గానీ కొట్టాల్సిన అవసరం రాని సమసమాజం నవసమాజం ఏర్పడాలని కోరుకుంటూ…

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

చెంప చెళ్లు పాఠం

RELATED ARTICLES

Most Popular

న్యూస్