Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Realizing The True Value Of Slap And Hand Blow :

దేవుడికన్నా దెబ్బే గురువు.
దెబ్బకు దయ్యం దిగి రావాలి.
మనిషికో మాట- గొడ్డుకో దెబ్బ.

దేవుడికంటే గొప్పవయిన దెబ్బల విలువ చిన్నప్పుడు తెలుసుకోలేరు. పెద్దయ్యాక అలా దెబ్బలు వేసేవారు లేరే అని బాధపడుతూ ఉంటారు.

మన చేత అక్షరాలు దిద్దించినవి దెబ్బలే. మార్కులు సరిగ్గా రాకపోతే శిక్షించినవి దెబ్బలే. క్లాసుకు ఆలస్యంగా రాకుండా క్రమశిక్షణలో పెట్టినవి దెబ్బలే. అల్లరి చేస్తే దండించినవి దెబ్బలే. స్కూళ్లలో పిల్లలను టీచర్లు కొడితే ఇప్పుడు హత్యానేరంలా మారి…విడ్డురంగా ఉంది కానీ…నాలుగయిదు దశాబ్దాల క్రితం అయ్యవారి చేతి ఆభరణం బెత్తం.

మా రోజుల్లో ప్రేయర్ కు ముందు మేమే చింత చెట్లు ఎక్కి ఒక్కో అయ్యవారికి తగినట్లు చింత కొమ్మలను విరిచి…ఆకులు దూసి…మమ్మల్ను కొట్టండని మేమే బెత్తాలను అయ్యవార్ల చేతుల్లో పెట్టేవాళ్లం. సాయంత్రం లోపు ఆ బెత్తాలు బాధ్యతగా విరిగిపోయేవి. బెత్తం వాతలు పడకుండా కొందరు రెండు మూడు నిక్కర్లు, రెండు చొక్కాలు కూడా వేసుకునేవారు. టెస్ట్ పేపర్లకు మార్కులు ఇచ్చే రోజు అన్ని క్లాసుల్లో అదనపు బెత్తాల అవసరం ఉండేది. సార్, మేడం చెయ్ చాచు అంటే చాచి కొట్టించుకోవాల్సిందే. కానీ దెబ్బలకు లెక్కలుండేవి. ఒక చేతికి ఒక దెబ్బే. తప్పు పెద్దయితే రెండు చేతులకు రెండు దెబ్బలు. మరీ పెద్ద తప్పులకు వీపు విమానం మోత. భరించలేని తప్పులకు తొడపాశం. చిన్న తప్పుకు క్లాసు బయట ఎండలో నిలుచోవాలి. ఒక మోస్తరు తప్పుకు అయిదు నిముషాలు గోడ కుర్చీ వేయాలి. ఒంటికాలి మీద పది నిముషాలు నిలుచోవడం, చెంపలు వాయించడం, కాళ్లు పైకి, తలకిందికి వచ్చేలా తాళ్లతో కట్టి వేలాడదీయడం లాంటి క్రమశిక్షణ శిక్షలు కూడా ఉండేవి అనేవారు కానీ…బహుశా అవి మా తరానికి ముందువి అయి ఉంటాయి.

లేపాక్షి వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మా సోషల్ టీచర్ నంజుండప్ప సార్ మూడేళ్లపాటు చెప్పిన చరిత్ర పాఠాలు మాకు ఇప్పటికీ దారిదీపాలు. క్లాసు మొదలవ్వగానే ఆయన పుస్తకం చూడరు. మమ్మల్ను చుడనివ్వరు. నోట్స్ చెప్పరు. కానీ ఆయన చెప్పే ప్రతి అక్షరం కళ్ల ముందు దృశ్యంగా కదిలేది. ప్రపంచ చరిత్రను మా మట్టి బుర్రలకు ఎక్కించడానికి ఆయన ఎంత తపస్సు చేసేవారో? పాఠ్య పుస్తకంలో లేని ఉపగ్రహాలు, వాతారణం, వ్యవసాయం, ఎన్నికల ప్రక్రియలు…ఇలా ఆయన చెప్పనిది ఏదీ లేదు. ఆయనకు సాధారణంగా కోపం రాదు. వచ్చిందో నరసింహావతారమే.

ఒకరోజు హోమ్ వర్క్ చేయని నా మిత్రుడిని పిలిచి…రేయ్ రేపు మీ నాయన్ను తోడుకొని రా! అన్నారు. ఏనాడూ ఏ హోం వర్క్ చేయడం వాడికి అలవాటు లేదు. మా నాయన సర్పంచ్ సార్…చానా పనులుంటాయి…అని వెటకారంగా అన్నాడు. అంతే చెంప ఛెళ్లుమంది. రెండు నిముషాల్లో వాడి బుగ్గలో బూరె చేరింది. చెంప మీద ఎర్రగా నాలుగు వేళ్ల వాతలు తేలాయి. మరుసటి రోజు పొద్దున్నే యెజ్డీ బండెక్కి డుగ్గు డుగ్గు అని సర్పంచ్ గారు వేంచేశారు. ఆరుబయట చెట్ల కింద పొద్దుటి నీరెండలో ప్రేయర్ జరుగుతోంది. ప్రేయర్ మొదలయ్యాక ఎవరయినా గేటు బయట వెయిట్ చేయాల్సిందే. సర్పంచ్ బయటే నిలుచున్నాడు. ప్రేయర్ కాగానే నంజుండప్ప సార్ గేటు దగ్గరికి వెళ్లి…నీ కొడుకుకు బాధ్యత లేదు…సంస్కారం లేదు అన్నారు. సార్ మీ దెబ్బకు వాడికి జ్వరమొచ్చింది అని ఏదో నసిగాడు. వాడు చదవకపోతే నాకొస్తోంది జ్వరం అని సార్ అన్నాడు. నువ్ చదివిస్తావా? లేక గాలికి వదిలేస్తావా? అని గడ్డి పెట్టారు. అంతే ఒక్క ఉదుటున లోపలికి వచ్చి మా మిత్రుడిని ఓపిక ఉన్నంతసేపు కొట్టాడు ఆ సర్పంచ్ తండ్రి. వాడికి దెబ్బలు తగులుతుంటే మాకు ఏడుపొచ్చింది. నంజుండప్ప సారే వెళ్లి ఆయన్ను ఆపి…మా మిత్రుడిని ఆ పూటకు రక్షించారు. అప్పుడు మాకు కలిగిన జ్ఞానం ఏమిటంటే…టీచర్ కొడితే ఒక్క దెబ్బతో పోతుంది…అనవసరంగా తండ్రులకు ఫిర్యాదు చేస్తే అసెంబ్లీ ప్రేయర్ వేళ అందరి ముందు ఒళ్లంతా వాతలు తేలుతాయని. టీచర్లకు కొట్టే అధికారం ఉంటుందని సమాజం అంగీకరించిన కాలమది.

మా నాన్న కూడా టీచరే. ఎప్పుడో తప్ప కొట్టేవారు కాదు. కొట్టినప్పుడు మాత్రం నాలుగయిదేళ్లకు సరిపడా కోటా ఉండేది. వాతలకు ఆయింట్ మెంట్ పూసి ఓదార్చే బాధ్యతను మా నాన్న పర్మిషన్ తో ఆయన విద్యార్థులే తీసుకునేవారు.

దెబ్బలు తినని బాల్యం ఉంటుందా? ఉంటే అది బాల్యం అయి ఉంటుందా?

అమెరికాలో ఒక భారతీయుడు సొంతంగా ఒక కంపెనీ పెట్టుకుని ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తనకు రోజంతా ఫేస్ బుక్ చూడ్డం ఒక వ్యసనంగా మారిపోయింది. దాంతో తను ఫేస్ బుక్ చూడబోయిన ప్రతిసారి చెంప చెళ్లుమనిపించడానికి ఒక ఉద్యోగిని నియమించుకున్నాడు. మొదట అందరూ నవ్వుకున్నారు. తీరా ఆ ఉద్యోగి డ్యూటిలోకి వచ్చి ఇతడి చెంపలు వాయించడం మొదలు పెట్టాక…30 శాతం సమయం ఆదా అవుతోందట. చెంప దెబ్బ భయానికి ఫేస్ బుక్ జోలికే వెళ్లకపోవడంతో కంపెనీ వ్యవహారాలు చక్కగా సాగుతున్నాయట.

ఈ దెబ్బలకు కొనసాగింపుగా ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి వరిగడ్డితో పేనిన చెర్నాకోలతో చేతి మీద కొట్టించుకున్నారు. అక్కడ అదొక సంప్రదాయమట.

నిజమే.
వయసుతో పనేముంది?
తప్పు చేస్తే చెంప చెళ్ళుమనిపించేవాళ్ళు లేక కదా మనమిలా అఘోరిస్తున్నాం!
ప్రతి ఇంట్లో, ఆఫీసుల్లో చెర్నాకోలల అవసరం చాలా ఉంది.

నిజమే.
దేవుడికంటే దెబ్బే గురువు.
ఇక ఆ గురువే దెబ్బలు వేస్తే…అది మన బంగారు భవితకు డబుల్ కా మీఠా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :   ఇండియన్ ఇంగ్లీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com