Saturday, January 18, 2025
HomeTrending Newsప్రధాని మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ

ప్రధాని మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ

Aao Dhekho Seekho : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలోని ముఖ్యాంశాలు….

హైదరాబాద్ కు వస్తున్న బీజేపీ నాయకులకు మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరపున స్వాగతం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా మారి అద్భుతమైన అభివృద్దితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న హైదరాబాద్ లో మీ పార్టీ సమావేశం పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం ఏమీ అనిపించడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ లు కొలువైన మీ రాష్ట్రాల్లో ఇప్పటికీ నెలకొనిఉన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయని నేను భావిస్తున్నాను. కారణాలు ఏవైనా మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్ లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, ఇక్కడి గాలి గానం చేసే… గంగా జమునా తెహజీబ్ ను గుండెల నిండా నింపుకోండని సలహా ఇస్తున్నాను.

మీ పార్టీ డి.ఎన్.ఏ లోనే విద్వేషాన్ని, సంకుచితత్వాన్ని నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కులం,మతం, జాతి ఆధారంగా సమాజాన్ని ఖండ ఖండాలుగా విడదీసే మీ దుర్మార్గ రాజకీయాల చుట్టూనే మీ చర్చలు సాగుతాయనడంలో నాకెలాంటి అనుమానం లేదు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల అసలు అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసు

ఇరిగేషన్- ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఇన్నోవేషన్- ఇంక్లూజివ్ నెస్ వంటి వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోంది. అందరిని కలుపుకు పోయే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్పూర్తితో అభివృద్ధి ఏజెండాను చర్చించేందుకు తెలంగాణకు మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు. అయితే మీ విధానాలు, నినాదాలను మార్చుకుంటారో లేదంటే, మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటారో మీ ఇష్టం. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. కాని మీ అస్తవ్యస్థ విధానాలు, అసమర్థ పాలనతో కలుగుతున్న దుష్పరిణామాలను అనుభవిస్తున్న ఈ దేశ పౌరుడిగా ఈ మాత్రం ఆశించడం అత్యాశ కాదనుకుని మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాలను అధ్యయనం చేయడానికి ఈ రెండు రోజుల సమయం మీకు సరిపోదని తెలుసు. అందుకే ఆవో..దేఖో… సీకో (Aao-Dhekho-Seekho) (రండి-చూడండి-నేర్చుకొండి)అంటున్నాం.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి దేశ సాగునీటి రంగాన్ని ఎలా బలోపేతం చేయాలో నేర్చుకోండి. తెలంగాణ ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో పూర్తైన వైనాన్ని కళ్లారా చూడండి. మీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ సాగునీటి రంగ పురోగతిని కేస్ స్టడీలా చూపించండి.

46వేల చెరువులకు పునర్జన్మనిస్తూ భూగర్భ జలాల సంరక్షణలో అల్ ఇండియా అధికారులకు శిక్షణపాఠంగా మారిన మిషన్ కాకతీయ విజయ గాథను తెలంగాణ మట్టి మనుషులు చెపుతారు ఓపిగ్గా విని తెలుసుకోండి. మీ బూటకపు డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించండి.

వ్యవసాయాన్ని కార్పోరేట్ లకు అప్పగించే కుట్రలను ఎదురించి సాగును పండుగలా మార్చి, అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సర్కార్ మాది. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు భీమా పథకాలు, రైతువేదికలతో అన్నదాత తలరాత మారుస్తున్న మా ప్రభుత్వ సంకల్పాన్ని చూసైనా ఈ దేశ వ్యవసాయ రంగంపై మీ ప్రభుత్వానికి ఉన్న కక్షాపూరిత వైఖరిని మార్చుకోండి. మా రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రారంభించిన మీ పియం కిసాన్ యోజనలో గత మూడు సంవత్సరాలుగా కొత్త రైతులకు అవకాశం ఇయ్యకుండా, ఎకరానికి కేవలం 6వేలతో సరిపుచ్చుతున్న మీ విధానాన్ని సవరించి, దేశ రైతాంగానికి మరింత చేయూతనివ్వండి

75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భారతం ఓ వైపునుంటే… గడప ముందట గోదారమ్మ, కృష్టానమ్మల జలధారాల సవ్వడితో మెరుస్తున్న ఆడబిడ్డల ముఖాలు తెలంగాణలో కనిపిస్తాయి. తరతరాలుగా తిష్ట వేసుకుని కూర్చున్న ప్లొరైడ్ రక్కసిని తెలంగాణ నుంచి మేం తరిమికొట్టిన తీరును మీరు కచ్చితంగా తెలుసుకోండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి నీరు అందిస్తున్న తొలి రాష్ర్టం తెలంగాణ ఘనతను గుర్తించి ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు మా మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.

2018లోనే ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చామంటూ మీరు చెప్పిన అబద్దాలను దేశం ముందు నిలబెట్టేలా, మీ పార్టీ తరపున దేశ ప్రథమ పౌరులిగా పోటీ చేస్తున్న ద్రౌపతి ముర్ము సొంత గ్రామంలో కరెంటు రాని పరిస్థితి మీ దగ్గరున్నది. స్వయంగా మీ సొంత రాష్ర్టం గుజరాత్ లో కరెంటు సరఫరా చేయలేక చేతులెత్తేసి పవర్ హలీడేలు ప్రకటిస్తున్న పరిస్ధితి ఉంటే… కనురెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల విద్యుత్ తో నిత్యం ప్రకాశిస్తున్న తెలంగాణ మా దగ్గరుంది. మీ అసమర్ధ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో చీకట్లు ఎలా తొలగించాలో తెలుసుకోండి.

తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క నవోదయ పాఠశాలను కేటాయించకున్నా సూమరు 1000 గురుకులాలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా కార్పోరేట్ విద్యను అందిస్తున్న సరస్వతి దేవి కొలువైన గడ్డ ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సదుపాయాలు కల్పించడంతో పాటు విదేశీ విద్య కోసం స్కాలర్ షిప్పులు ఇస్తున్న రాష్ట్రం మాది.

కేంద్రంలో ఉన్న మీరు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వంగా మేమే సొంతంగా జిల్లాకొక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ పల్లెలోనూ ప్రాథమిక వైద్యాన్ని పటిష్టంగా మారుస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో బస్తీకొక దవాఖానా ఏర్పాటుచేసి ఖరీదైన వైద్యాన్ని పేదోడి గుమ్మం ముందుకు తెచ్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమం కంటి వెలుగును చేపట్టాము. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలీకరణ చేస్తున్నాము. చేతనైతే ఇలాంటి మా వైద్య విధానాలను అధ్యయనం చేయండి. మీ మీ రాష్ట్రాల్లో అమలుచేయండి.

45 ఎండ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగితను పట్టించుకొకుండా పకోడీలేయడమూ ఉద్యోగమే అని నీతులు చెప్పే నాయకులు నిండుగా ఉన్న పార్టీ మీది. అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పింది మీరు. ఒకవైపు ఉద్యోగాలియ్యమంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, ఉన్న ఉద్యోగాలతో పాటు, బలహీన, బడుగు వర్గాల రిజర్వేషన్లను గండి కొడుతున్నది మీరు. మీకు భిన్నంగా సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం మాది. దీంతోపాటు పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ప్రైవైటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన చేతల ప్రభుత్వం ఇక్కడున్నది. యువత ఉద్యోగార్ధులుగా మిగిలిపోకూడదు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసిన వినూత్న ప్రభుత్వం మాది. యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో, వాళ్ళ ఆశలకు రెక్కలు ఎలా తొడగాలో తెలంగాణ ప్రభుత్వం నుంచి నేర్చుకోండి. ఇలా మేము ఒకవైపు స్టార్ట్ అప్ అంటుంటే, మీరు మాత్రం 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపకుండా, ప్రయివేట్ రంగంలోని ఉద్యోగాలను ఊడగొడుతూ ప్యాకప్ అంటున్నారు.

తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన మీరు ఈ గడ్డ బాగు కోరుతారని ఇక్కడ ఎవరూ భావించడం లేదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత ఎన్నటికి మరిచిపోదు. ఐటీఐఆర్ ను రద్దుచేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామనుకున్న మీ నికృష్ట రాజకీయాలకు మా పనితీరుతోనే జవాబు చెప్పినం. ఈ8 ఏండ్లలో తెలంగాణ ఐటి ఎగుమతులను 3 రెట్లు చేసి లక్షా ఎనభైమూడు వేల కోట్లకు చేర్చినాము. గత ఏడాది దేశ ఐటీ రంగం నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే అందులో మూడోవంతు తెలంగాణకే దక్కాయి.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ద హామీ ఐన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఇవ్వకుండా తెలంగాణను దారుణంగా వంచించిన చరిత్ర మీది. ప్రైవేటు రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చి మీకు మూ తోడ్ జవాబ్ ఇచ్చాము. దేశానికే తలమానికంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని నిలిపిన తెలంగాణ నుంచి పారిశ్రామిక పాఠాలు కొన్నైనా నేర్చుకోండి

మీ పాలనలో దేశ ఆర్థిక రంగం అయోమయంలో ఉంది. ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. వాట్పాప్ యూనివర్సిటీ పాఠాలు తప్ప ఎకానమీ లెక్కలు తెలియని మీ నాయకత్వం, దిక్కుతోచక బిత్తిరి చూపులు చూస్తుంటే తెలంగాణలోని మా ప్రగతిశీల ప్రభుత్వం మాత్రం సంపద సృష్టించు-సమాజానికి పంచు అన్న ఉదాత్తమైన లక్ష్యంతో పనిచేస్తున్నది. రేసుగుర్రంలా దూసుకుపోతున్న మా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పెషల్ క్లాసులు చెప్పించుకోండి. జాతీయ సగటు కన్నా అదికంగా పెరుగుతున్న మా GSDP, రెట్టింపు అయిన సగటు తలసరి అదాయం, చిన్న రాష్ట్రం అయినా దేశ అర్ధిక వ్యవస్థకు అత్యకంగా నిధులు అందిస్తున్న 4వ రాష్ర్టంగా తెలంగాణ ఉన్న తీరు నుంచి అర్ధిక పాఠాలు నేర్చుకొండి.

మీపాలనలో ప్రపంచంలోనే అత్యధిక వంటగ్యాస్ సిలిండర్ ధర మన దేశంలో ఉంది. ఆకాశాన్ని అంటుతూ, సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న నిత్యావసర సరుకులు, పెట్రో ధరలపై మీకు దమ్ముంటే ఈ సమావేశాల్లో చర్చ పెట్టండి.

సంక్షేమానికి సరికొత్త అర్ధాన్నిచ్చేలా, పేదల ముఖాలలో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణ లక్ష్మి పథకాలతోపాటు 450 కి పైగా సంక్షేమ పథకాలను స్టడీ చేసి, మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయండి.

చివరగా ఒక్కమాట. హైదరాబాద్ మెహమాన్ నావాజ్గీ కీ బాత్ హీ కుచ్ అలగ్ హై అంటారు. అందుకే హైదరాబాద్ లో దమ్ బిర్యానీ రుచి చూడండి. శాఖహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది అడగడం మర్చిపోకండి. ఇరానీ చాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి. అందుకే అంటున్నాం “ఆవో… దేఖో… సికో” అని.

RELATED ARTICLES

Most Popular

న్యూస్