Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకారాగారంలో ఏకాంతం

కారాగారంలో ఏకాంతం

Variety Scheme: ప్రజాసేవ…పరిచయం అక్కర్లేని పదం. నిజానికి ‘సేవ’కు పెద్ద పోటీ ఉండదు కానీ  ‘ప్రజాసేవ’కు  విపరీతమైన పోటీ ఉంటుంది. ఏదో ఒక పదవి సంపాదించి, విపరీతంగా ప్రజాసేవ చేయాలని నానా తంటాలు పడతారు.   ‘మానవ సేవే – మాధవ సేవ’ అని వీరు బలంగా నమ్ముతారు.

మానవులు అంటే.. మనుషులంతా అని పొరబడకండి.  ఇక్కడ మానవులు అంటే – కులం, మతం, జాతి, వర్గం, ప్రాంతాలకు “మన” అనే విశేషణాన్ని కలిపి.. అవసరాన్ని బట్టి నిర్వచనం మారుస్తూ ఉంటారు.

ఒక పదవి చేపట్టగానే ఇంకా పెద్ద, పెద్ద పదవులు చేపట్టి సేవను ‘విపరీతం’ చేయాలన్న ఆలోచన వీరిని వేధిస్తూ ఉంటుంది.
తానొక్కడే సేవ చేస్తుంటే.. తృప్తి కలగదు. ‘వారసులను’ రంగంలోకి దించుతుంటారు.  ఈ వారసులు కూడా తమ తండ్రినో, తాతనో మించి సేవ చేయాలని తెగ ఉబలాటపడతారు. ప్రజాసేవ మత్తు అలాంటిది అనుకోండి.

ఇక ప్రజాసేవ లో పోటీ ఎక్కువ అవడంతో.. సేవలు ఎలా చేయాలి, ప్రజలను ఎలా మెప్పించాలని నేతలు తెగ మధన పడిపోతుంటారు.
తాము అందిస్తున్న సేవలు  అన్నివర్గాల ప్రజలకు అందుతుందో లేదో అని వీరు పడే తపన మాటల్లో వర్ణించలేము.

ఈ సేవలో కూడా వినూత్నంగా ఆలోచించేవారు మరికొందరు. వాటిపై తమ “ముద్ర” వేయాలని ఆరాటపడతారు. ఇక “సేవకు” నోచుకోని వాడు ఇంకా ఎవడున్నాడా.. అని దుర్భిణీలు వేసి మరి వెదుకుతూ ఉంటారు.
ఇక అలా దొరికినవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని “ప్రత్యేక సేవా పధకాలు” ప్రకటిస్తుంటారు.

అందుకే కొత్త ప్రభుత్వాలు రాగానే సరికొత్త్తత పతకాలు వేర్వేరు పేర్లతో కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తాయి. ఈ విధంగా ఈ ప్రజలను దొరికించుకొని సేవ చేసే దాకా ఈ ప్రజా సేవకులకు నిద్రపట్టదు. అలా ఈ ప్రజాసేవకులకు దొరకకుండా ఇనాళ్ళుగా తప్పించుకొన్న ఒక వర్గం వారిని.. పంజాబ్ లో “ఆప్” ప్రభుత్వం గుర్తించింది.

వారే.. జైళ్ళలో చిరకాలంగా మగ్గుతూ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు.
వాళ్ళకు “ప్రత్యేక సేవ” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆ ప్రత్యేక సేవ ఏటంటే- ఈ ఖైదీలతో ప్రతి మూడు నెల్లకు ఒకసారి  “ ఓ రెండు గంటల కాపురం” చేయించడం.

అది తమ అధికారిక, చట్టపరమైన భాగస్వామితోనే ఆట లెండి.
దీని కోసం పంజాబ్ జైళ్ళలో ప్రత్యేక బాత్రూమ్ లతో కూడిన బెడ్ రూమ్ లు ఏర్పాటు చేశారట.
ప్రస్తుతానికి గాంగ్ స్టర్లు, తీవ్ర నేరగాళ్లకు, లైగిక నేరగాళ్లకు ఈ సదుపాయం లేదట.
దీర్గకాలికంగా జైల్లో ఉండే వారు.. తీవ్ర నేరగాళ్ళు కాని వారు.. ఈ సేవకు అర్హులట.

భాగస్వాములు జీవించి లేనివారికి,
ఒకరికంటే అధికంగా భాగస్వాములు ఉన్నవారికి,
అనధికార భాగస్వాములు మాత్రమే ఉన్నవారికి..
ఏక లింగ భాగస్వాములు మాత్రమే ఉన్నవారికి..  కూడా ప్రత్యేక మైన ఏర్పాట్లు ఏమైనా చేస్తారేమో ముందు, ముందు.

ఏమైనా.. ప్రజాసేవ లో కొత్త పుంతలు తొక్కుతున్న.. ఈ ప్రజాసేవగాళ్లను అభినందిచవలసిందే. 

– శ్రీ వెంకట సూర్య ఫణి తేజ 

Also Read :

చెడులో చెడు

Also Read :

ఏది చర్చ? ఏది రచ్చ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్