Tuesday, April 16, 2024
HomeTrending Newsఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ జయకేతనం

ఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ జయకేతనం

ఢిల్లీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. ఇప్పటివరకూ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ అటు కేంద్రం, ఇటు స్ధానిక సంస్ధల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆప్ ప్రభావం పూర్తిగా కనిపించ లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈసారి స్దానిక సంస్ధల ఎన్నికల్లోనూ ఆప్ కే పట్టం కట్టారు. ఆప్ విజయంపై స్పందించిన కేజ్రివాల్.. ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. మార్పు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలన్నారు. మొత్తం 250 సీట్లున్న కార్పోరేషన్ లో ఆప్ 135 సీట్లు గెల్చుకుని జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ఆప్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ 103 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ కు 9 సీట్లు, ఇతరులకు మూడు సీట్లు దక్కాయి. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో తొలిసారి ఆప్ మేయర్ రాబోతున్నారు. అదే సమయంలో 15 ఏళ్లుగా ఢిల్లీ పీఠంపై ఉన్న కమలం పార్టీ పాలనకు ఆప్ చరమగీతం పాడినట్లయింది.
ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ క్లీన్ స్వీప్ సాధించబోతున్నట్లు అంచనా వేసినప్పటికీ బీజేపీ గట్టిపోటీతో ఆప్ సాధారణ విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ కార్పోరేషన్ పునర్ వ్యవస్ధీకరణ తర్వాత ఇవి తొలి ఎన్నికలు. 2017లో అప్పటి 270 మునిసిపల్ వార్డుల్లో 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఆప్ 48 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్