గత వారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, దీనిపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తన సస్పెన్షన్ చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పు కాపీని లేఖతో జత చేశారు. కాగా, ఎంకే మీనా ఈ లేఖను తదుపరి ఆదేశాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
రక్షణ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్దిస్తూ తీర్పు చెప్పింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయగా అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఆయనకు పోసింగ్ ఇవ్వాలంటూ 2022 ఏప్రిల్ 22న తీర్పు చెప్పింది, రెండునెలల తర్వాత ఏపీ ప్రభుత్వం ఏబీని ప్రింటింగ్ స్టేషనరీ డిజిగా నియమించింది. తదనంతరం రెండు వారాల్లోనే ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది.
దీనిపై ఏబీ క్యాట్ ను ఆశ్రయించగా విచారణ జరిపిన అనంతరం ఈనెల 8న సస్పెన్షన్ కొట్టివేేస్తూ తీర్పు చెప్పింది. రెండోసారి సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన క్యాట్ వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ఆదేశించింది. ఈనెల 31న ఏబీ సర్వీసు నుంచి రిటైర్ కానున్నారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆయనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని ఏబీ వాదిస్తూ తగిన ఆదేశాలు సిఎస్ కు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు.