Saturday, November 23, 2024
HomeTrending Newsఆర్టికల్ 370 రద్దు చేసి ఐదేళ్ళు

ఆర్టికల్ 370 రద్దు చేసి ఐదేళ్ళు

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆగస్ట్ 5 వ తేదికి ఐదేళ్ళు పూర్తయ్యాయి. కాశ్మీర్ కు గుదిబండగా మారిన ఈ ఆర్టికల్ రద్దుకు చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భారత దేశ చరిత్రలో నిలిచారు. తెరవెనుక మంత్రాంగం నడిపించిన విదేశాంగమంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశ ప్రజల మనసు చురగొన్నారు.

ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఒక నిబంధన. దీనిద్వారా జమ్మూ కశ్మీర్‌కు భారత రాజ్యాంగం పరిమితంగా వర్తించేది. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని వివరించే ఆర్టికల్ 1 మినహా, జమ్మూ కశ్మీర్‌కు మరే ఇతర ఆర్టికల్ వర్తించేది కాదు. ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని, కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉండేది.

దీనికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జమ్ము-కశ్మీర్ రక్షణ, విదేశాంగ అంశాల్లో, కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉండింది. వీటన్నింటికి చెల్లుచీటీ చెపుతూ భారత పార్లమెంటు ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దుకు ఆమోదం తెలిపింది.

మొదట ఆర్టికల్ 367ను సవరించి ఆ మరుసటి రోజు ఆగష్టు 6 – 2023న, రాష్ట్రపతి రెండవ ఉత్తర్వు జారీ చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ భారత యూనియన్‌లో అన్ని రాష్ట్రాలతో సమానంగా మారింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఆగస్ట్ 9, 2019న, పార్లమెంటు జమ్మూ,కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019ని ఆమోదించింది. ఈ చట్టం రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే చట్టాలు ఈ రెండు ప్రాంతాలకు వర్తిస్తాయి. జమ్మూకాశ్మీర్‌లో దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఆస్తుల కొనుగోలు, సంస్థల స్థాపనకు మార్గం సుగమం అయింది. దశాబ్దాల అశాంతితో అల్లాడుతున్న ప్రాంతంలో రాజ్యాంగ హోదా రాత్రికి రాత్రే మారిపోయింది.

రద్దు చేసిన వెంటనే, దేశంలోని అనేక మంది వ్యక్తులు మరియు సంస్థలు దాని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆర్టికల్ 370 రద్దును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. లోయలో అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. 2024-25 సంవత్సరానికి గాను  జమ్మూ కాశ్మీర్ కు 42,277 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఫ్తీ మహమ్మద్ సయీద్, ఫరూక్ అబ్దుల్లా రెండు కుటుంబాల పెత్తనం పోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అడ్డుపెట్టుకొని ఆ రెండు కుటుంబాలే లబ్ది పొందాయని కాశ్మీర్ మేధావులు విశ్లేషిస్తున్నారు.

ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆందోళనల వెనుక ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు, వేర్పాటువాదులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో క్రమంగా సామాన్య ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్