Friday, March 29, 2024
HomeTrending Newsపేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం

పేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల సౌకర్యార్థం వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వారితో పెద్ద సంఖ్యలో వస్తున్న అటెండెంట్ లు సరైన వసతి, సౌకర్యాలు లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించిన నేపథ్యంలో నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో షెల్టర్లు ఏర్పాటు చేయాడానికి నేడు సాయంత్రం బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటెండెంట్స్ వసతి కోసం అన్ని ప్రధాన ఆసుపత్రుల పరిసరాల్లో తగు షెల్టర్లను గుర్తించాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. ఈ దసరా నుండే వీటిని ప్రారంభించాలని స్పష్టం చేశారు. హరే కృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అటెండెంట్‌ల సౌకర్యార్థం అన్ని వసతులు కలిగిన ఆశ్రయం, తాగునీరు, శానిటేషన్ లతోపాటు మహిళా అటెండెంట్‌లకై ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు.
నిమ్స్, నిలోఫర్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, టిమ్స్, కింగ్ కోటి, ఫీవర్ హాస్పిటల్, ఎంజె క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వంటి ఆసుపత్రులకు రోగులతో పాటు పెద్ద సంఖ్యలో అటెండర్లు వస్తున్నారు. వీరందరికీ దసరా పండుగ నుండి ఈ సౌకర్యాలను కల్పించాలని స్పష్టం చేశారు. దీనివల్ల రోగులతో పాటు అధిక సంఖ్యలో వచ్చే అటెండెంట్లకు ప్రయోజనం చేకూరుస్తుందని సోమేశ కుమార్ తెలిపారు.
ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య కార్యదర్శి SAM రిజ్వీ, హరే కృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సి.ఈ.ఓ కౌంతేయ దాస్, సి.ఎం. ఓ.ఎస్.డి డాక్టర్ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఎం.డి. చంద్రశేఖర్, క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డా. జయలత, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారామ్, డాక్టర్ శంకర్ లతోపాటు కింగ్ కోటి హాస్పిటల్, నిలోఫర్, టిమ్స్ మరియు కోటి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్లు సమావేశానికి హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్