Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహరికథా పితామహులు

హరికథా పితామహులు

ఆదిభట్ల విజయనగరం దగ్గర అజ్జాడ గ్రామంలో పుట్టారు. గౌరవవాచకం శ్రీమత్; ఊరిపేరు అజ్జాడ కలిపి శ్రీమదజ్జాడ; ఇంటిపేరు ఆదిభట్ల- మొత్తం “శ్రీమదజ్జాడ ఆదిభట్ల” అయ్యింది. తెలుగు హరికథను ప్రపంచ యవనిక మీద రెపరెపలాడించినవాడు కనుక హరికథా పితామహుడు. తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లీషు, అరబ్బీ, పారశీక భాషల్లో ప్రావీణ్యం సంపాదించినవాడు. అష్టావధానాలు చేసినవాడు. అచ్చతెలుగులో, సంస్కృతంలో, సంస్కృతభూయిష్టమైన తెలుగులో వివిధ విషయాలపై వందకు పైగా గ్రంథాలు రాసినవాడు.

గొంతెత్తి పాడి ప్రపంచాన్ని ఇక్షుసాగరంలో ముంచి తేల్చిన గాయకుడు. గద్యం, పద్యం, శ్లోకం, జానపదం ఎలా పాడాలో తెలిసినవాడు. ఆశువుగా పద్యాలు, శ్లోకాలు అల్లి శ్రోతలను ఊపేసినవాడు.
అసాధారణమయిన జ్ఞాపకశక్తి ఉన్నవాడు. ధారణకు తోడు అమృతతుల్యమయిన కవితా ధార ఉన్నవాడు.

ఆయన్ను కేవలం హరికథకుడిగా చూస్తే తెలుగు సాహితీ లోకం తనను తాను తక్కువ చేసుకున్నట్లు.

“ఇలాంటివాడొకడు ఉండేవాడా?” అని ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైనవాడు ఆదిభట్ల. ఆయన గురించి మనకు తెలిసింది గోరంత. తెలుసుకోవాల్సింది కొండంత.

జననం:-
31-08-1864

మరణం:-
02-01-1945

అసలు పేరు:-
సూర్యనారాయణ

ప్రావీణ్యం:-
పది భాషల్లో

ఇతర విషయాలు:-
సంగీతంలో అభినివేశం, అష్టావధాని

ప్రత్యేకత:-
ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత హై స్కూల్ మెట్లెక్కకపోయినా… సొంతంగా ఇష్టం కొద్దీ చదువుకున్నవాడు. తెలుగు హరికథను ఉత్తరభారతంలో చెప్పి శ్రోతల ప్రశంసలు పొందడం.

రాసిన గ్రంథాలు:-
వందకు పైగా

రచనలో ప్రత్యేకత:-
అచ్చ తెలుగులో అనన్యసామాన్యమయిన అల్లిక

కీర్తి:-
సంగీత సాహిత్య నాట్యాల మేళవింపుతో తెలుగు హరికథను హిమాలయం మీద ప్రతిష్ఠించడం. ఇప్పటిలా మైకులు, సౌండ్ బాక్సులు, ఎల్ ఈ డి స్క్రీన్లు లేని రోజుల్లో ఆదిభట్ల హరికథ కంచు కంఠంతో మారుమోగడం. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి ఆ హరికథలను వినడం.

హరికథకు కట్టిన ‘కోట’

కోట సచ్చిదానంద శాస్త్రి
జననం:-
12-08-1934, బాపట్ల జిల్లా అద్దంకి.

మరణం:-
16-09-2024, గుంటూరు

కీర్తి:-
# సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత
# ఆదిభట్ల నారాయణదాసు పురస్కారం
# హంస అవార్డు గ్రహీత
# పద్మశ్రీ అవార్డు గ్రహీత

ఆదిభట్ల దారిలో నడిచిన కోట సచ్చిదానంద శాస్త్రి హరికథకు పెట్టని కోట అయ్యారు. హరికథలో సందర్భానుసారంగా ప్రస్తావించదగ్గ మంచి సినిమా పాటలు పాడారు. పాటలకు తగిన నృత్యం చేశారు. పురాణకథలను సామాన్యులకు అర్థమయ్యేలా సరళీకరించి చెప్పారు. సంప్రదాయ హరికథకులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. ఆదిభట్ల స్ఫూర్తితో హరికథకు కాలానుగుణమైన మార్పులు చేశారు. దేశ, విదేశాల్లో దాదాపు ఇరవై ఒక్క వేల హరికథాగానం చేశారు. “ఆధ్యాత్మికత, సంగీతం, సాహిత్యం, నాటకం, నృత్యం కలగలిసిన కళ- హరికథ” అన్న ఆదిభట్ల సూత్రీకరణను కోట దారిదీపంగా పెట్టుకున్నారు. 1960-80ల మధ్య ఆయన హరికథ చెప్పని ఊరు లేదు అన్నంతగా సాగింది ఆ హరికథా జైత్రయాత్ర. హరికథకుల్లో “పద్మశ్రీ” పొందిన తొలివ్యక్తి కోట.

ఏ కళ అయినా సమకాలీన వాతావరణానికి, కొత్త తరం అభిరుచులకు అనుగుణంగా మలచకపోతే మనుగడలో ఉండదన్న సత్యాన్ని గ్రహించడంలో, గ్రహించి సంప్రదాయ కళకు కొత్త మెరుగులు దిద్దడంలో ఆదిభట్ల అందెవేసిన చేయి. ఆ ఆదిభట్ల చూపిన కొత్త ఒరవడికి కొనసాగింపుగా ‘కోట’ హరికథకు కోట కట్టి నిన్నటివరకు కాపాడుకున్నారు. ఇప్పుడు ఆ కోటలను కాపాడుకునేవారెవరు?

(సెప్టెంబర్ 16న కన్నుమూసిన కోట సచ్చిదానంద శాస్త్రికి నివాళిగా ఆయన గురువు ఆదిభట్లతో కలిపి స్మరణ)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్