Friday, March 29, 2024
HomeTrending Newsఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే క్లాసులు

ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే క్లాసులు

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు కొత్త ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభం కాబోతున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్‌లో ఈ క‌ళాశాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌వుతాయ‌ని చెప్పారు. రాజ‌మండ్రి ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌కు కూడా ఎన్ ఎంసీ అనుమ‌తులు ల‌భించిన నేప‌థ్యంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని గుంటూరులోని ఐబీలో గురువారం మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే 5 మెడికల్‌ కాలేజీలకు అనుమతి లభించడం అరుదైన ఘనతని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డని చెప్పారు.

కొత్త క‌ళాశాల‌ల్లో మొత్తం 750 సీట్లు:
రాష్ట్రంలోని విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్ట‌ణం, రాజ‌మండ్రి… ఇలా నాలుగు చోట్ల మెడిక‌ల్ క‌ళాశాల ప్రారంభోత్స‌వం కోసం ప్ర‌భుత్వం ఎన్ ఎంసీ కి విన్న‌వించ‌గా.. అధికారులు వ‌చ్చి త‌నిఖీలు నిర్వ‌హించార‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్ట‌ణంలో అనుమ‌తులు వ‌చ్చాయ‌ని రాజ‌మండ్రి మెడిక‌ల్ కళాశాల‌కు కూడా గురువారం అనుమ‌తులు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ఆగ‌స్టు నెల‌లో ఈ ఐదు క‌ళాశాల‌ల‌ను అధికారికంగా ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. నాణ్య‌మైన ఉన్న‌త వైద్యం, వైద్య విద్య మ‌న రాష్ట్ర విద్యార్థుల‌కు అందాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న‌న్న అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచే ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి న‌డుం బిగించార‌ని తెలిపారు. పార్ల‌మెంట్ జిల్లాకు క‌నీసం ఒక మెడిక‌ల్ క‌ళాశాల ఉండాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న‌న్న ప‌నిచేస్తున్నార‌ని చెప్పారు. మొత్తం 17 మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి రూ.8500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఆ ఫ‌లితంగానే ఈ ఏడాది ఏకంగా 5 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభం కాబోతున్నాయ‌ని తెలిపారు. ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అద‌నంగా మ‌న రాష్ట్రానికి రాబోతున్నాయ‌ని చెప్పారు. మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా మన రాష్ట్రంలోనే వైద్య విద్యను చదువుకునే అపూర్వ అవకాశం ఈ కాలేజీల ద్వారా ల‌భిస్తుంద‌ని తెలిపారు.

మ‌న రాష్ట్రంలో మొద‌టి ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల 1923వ సంవ‌త్స‌రంలో విశాఖ ప‌ట్ట‌ణంలో ఏర్పాటైంద‌ని, అప్ప‌టి నుంచి ఈ వందేళ్ల కాలంలో కేవ‌లం 11 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లు మాత్ర‌మే గ‌త ప్ర‌భుత్వాలు ఏర్పాటుచేయ‌గ‌లిగాయ‌ని వివ‌రించారు. జ‌గ‌న‌న్న ఒకే సారి చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరుగ‌ని విధంగా 17 మెడిక‌ల్ క‌ళాశాలల నిర్మాణానికి న‌డుంబిగించార‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక కేవ‌లం నాలుగే నాలుగేళ్ల‌లో 5 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాలను సాధించుకుని, త‌ర‌గ‌తులు కూడా ప్రారంభించ‌బోతున్నామ‌ని వివ‌రించారు. రానున్న రెండు ,మూడేళ్లలో ద‌శలవారీగా మిగిలిన 12 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని, ఆయా చోట్ల నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో సిబ్బందిని పెంచ‌డం, వ‌స‌తులు గ‌ణ‌నీయంగా పెంచ‌డం, మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయ‌డం, ప‌రిక‌రాలు పెంచ‌డం.. ఇలా ఎన్నో చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా పీజీ సీట్ల‌ను పెంచుకోగ‌లుగుతున్నామ‌న్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల‌ను 3257కు పెంచిందన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ద్వారా ఊరూరికీ వైద్య సేవలు అందిస్తున్న ఘనత త‌మ ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌న్నారు. మండలానికి రెండు పీహె చ్‌సీలు ఉండాల‌ని నియమం పెట్టుకుని, ఆ మేర‌కు భారీ పీహెచ్‌సీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్ప‌త్రులు, టీచింగ్ ఆస్ప‌త్రుల‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామ‌ని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ క‌నివినీ ఎరుగ‌ని విధంగా 49 వేలకు పైగా నియామకాలు చేప‌ట్టిన ఘ‌న‌త జ‌గ‌న‌న్న‌కే ద‌క్కుతుంద‌ని చెప్పారు.

చంద్రబాబు హయాంలో సెల్‌ఫోన్‌ లైట్లలో వైద్యం సేవలు అందించార‌ని మండిప‌డ్డారు. ఈ రోజు త‌మ‌ ప్రభుత్వంలో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వానంగా మారాయని, మందులు, వైద్యసిబ్బంది లేక మౌలిక వసతులు కరవై ఎందుకూ కొరగాకుండా పోయాయని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చింది కూడా చంద్రబాబేనని  విమర్శించారు. ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను కూడా చంద్రబాబు తీసుకురాలేకపోయారని మండిప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్