Afghan Is Now The Number One Producer Of Opium In The World :
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చాక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మైనారిటీలపై ఐసిస్ ఉగ్రవాదుల దాడులు, పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, పౌష్టికాహార కొరత తదితర సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణ తాలిబన్లకు తలనొప్పిగా తయారైంది. గతంలో తమ కార్యకలాపాల కోసం మాదకద్రవ్యాల ఎగుమతుల్ని ప్రోత్సహించిన తాలిబన్లకు ఇప్పడు అదే ఆదాయవనరు తిరగబడటం ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. ఇన్నాళ్ళు మతప్రాతిపదికన ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిన తాలిబన్లతో ప్రపంచ దేశాలకు ఇప్పుడు నార్కో – టెర్రరిజం ముప్పు పొంచి ఉంది.
దేశంలోని దక్షిణ ప్రాంతంలో గంజాయి సాగు విరివిగా జరుగుతోంది. దీనికి తోడు ఒపియం ఉత్పత్తిలో ఆఫ్ఘన్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పండించే ఒపియంలో 87 శాతం ఆఫ్ఘన్ లోనే ఉత్పత్తి అవుతుంది. హెరాయిన్ తయారు చేసేందుకు ఒపియం ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒపియం కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. కందహార్,హెల్మాండ్ ప్రాంతాల్లో వేల కుటుంబాలు తమ జీవనాధారంగా ఒపియం సాగు చేస్తున్నాయి. కరువు, అనావృష్టి, ఉపాధి లేకపోవటంతో ఓపియం సాగు వైపు ఆఫ్ఘన్లు మొగ్గు చూపుతున్నారు. ఆఫ్ఘన్ హెరాయిన్ తో రష్యా అధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటోంది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణపై తాలిబాన్ ప్రతినిధి జబిఉల్ల ముజాహిద్ మాట్లాడుతూ తమ రైతులను ప్రపంచ దేశాలు ఆదుకుంటే ఓపియం సాగు నిలువరించ వచ్చని, వారిని ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించవచ్చన్నారు. తాలిబాన్ ప్రతినిధి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని యూరోపియన్ యూనియన్ అసహనం వ్యక్తం చేసింది. శాంతి,సుస్థిరత,మహిళలు,మైనారిటీలకు సమాన హక్కులతోపాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణ నిరోదిస్తేనే ప్రపంచ దేశాల నుంచి తాలిబన్లు సహకారం ఆశించవచ్చని ఈయు వర్గాలు అంటున్నాయి.
Must Read : ఆఫ్ఘన్లో ప్రబలుతున్న అంటువ్యాధులు