తాగితే మరిచిపోగలను… తాగనివ్వదు…
ఇప్పుడు ఆ తాగుడు వ్యవహారం ఏకంగా ఓ దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి కల్పించింది.
నాలుగైదు రోజులుగా ఇంటా బైటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవిని వదులుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. రెండేళ్ళ క్రితం కోవిడ్ మొదటి దశ ఉధృతంగా ఉన్న సమయంలో ఆంక్షలను అతిక్రమించి తన అధికారిక నివాసంలో మందు పార్టీ ఇచ్చిన సంగతి… ఈ ఏడాది మొదట్లో ఓ మీడియా ప్రతినిధి ఆధారాలతో సహా బైట పెట్టాడు. దీనిపై ఐ-ధాత్రి అప్పట్లో పోస్ట్ చేసిన కథనం ఓసారి గమనించండి….
ఈ అంశం అప్పటి నుంచీ నలుగుతూనే ఉంది, ఈ ‘పార్టీ గేట్’ వార్త బైటకు వచ్చిన వెంటనే ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణ చెప్పారు. కానీ అక్కడి ప్రతిపక్ష నేతలు బోరిస్ ను విమర్శించాలనుకున్నప్పుడల్లా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చేవారు. ప్రజల మనస్సులో కూడా ఆయనపై ఓ దురభిప్రాయం కలిగింది. పుండు మీద కారం చల్లినట్లుగా బోరిస్ జాన్సన్ ఏరి కోరి తన ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ విప్ గా నియమించుకున్న క్రిస్ పించర్ తాగి ప్రవర్తించిన తీరు కూడా తిరిగి బోరిస్ మెడకే చుట్టుకుంది.
గత నెల జూన్ 29న లండన్ జేమ్స్ స్ట్రీట్ లోని కార్ల్ టన్ క్లబ్ లో పించర్ మందు తాగి ఇద్దరు పురుషులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఆరోపణలు రాగానే పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది…. పించర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే బోరిస్ వ్యతిరేకులు మరోసారి తమ విమర్శలకు పదును పెట్టారు, పించర్ ప్రవర్తన సరిగా లేదని తెలిసి కూడా ఆయన్ను అత్యంత ప్రతిష్టాత్మక డిప్యూటీ చీఫ్ విప్ పదవిలో నియమించారని తూర్పారబట్టారు. అతని ప్రవర్తన గురించి ముందుగా తనకు తెలియదని బోరిస్ బుకాయించినా… పించర్ ప్రవర్తనపై బోరిస్ కు ముందే సమాచారం ఉందన్న ఆధారాలు బైటికి రావడంతో బ్రిటన్ ప్రధానికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. మూడ్రోజుల క్రితం బోరిస్ కేబినెట్ లో ఇద్దరు కీలక మంత్రులు…ఆర్ధిక మంత్రి రిషి సునాక్ (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు), ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ లు రాజీనామా సమర్పించడంతో సంక్షోభం తారా స్థాయికి చేరింది. ప్రధానిపై విశ్వాసం కోల్పోయామని, తాము కొనసాగలేమని బైటికి వచ్చారు. వీరి స్థానంలో బోరిస్ ఇద్దరు కొత్త మంత్రులను కూడా నియమించారు. మరోవైపు ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభించారు. కేబినేట్ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగడం మొదలు పెట్టి… గురువారం నాటికి ఆ సంఖ్య భారీగా పెరిగింది. మంత్రులకు తోడు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, దౌత్యాధికారులు కూడా రాజీనామాలు చేయడం ప్రారంభించారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న బోరిస్ తనకు తానుగా గౌరవంగా తప్పుకున్నారు. కొత్త ప్రధాని ఎన్నుకొనే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు.
మందు పార్టీలో పాల్గొనడం… ప్రవర్తన సరిగాలేని ఒక ఎంపీకి పదవి ఇవ్వడం అనే రెండు కారణాలతోనే బోరిస్ పదవి కోల్పోవాల్సి రావడం గమనార్హం.
మనదేశంలో ఇలాంటి వార్తలు కేవలం ఓ వారం పది రోజులపాటు మాత్రమే హల్ చల్ చేస్తాయి.. ఈలోగా మరో కొత్త సంచలన వార్త బైటికి రాగానే పాత విషయాన్ని మర్చిపోతాం…కానీ బ్రిటన్ లో రెండేళ్ళ క్రితం ఒక మందు పార్టీ విషయం ఈ ఏడాది మొదట్లో వెలుగు చూడడం, ఈ వ్యవహారం ఓ ప్రధాని పదవిని కోల్పోయేలా చేయడం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవంగా చెప్పుకోవచ్చు.
ఇలాంటి మందు పార్టీలు, సెక్సువల్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించాల్సి వస్తే మనదేశంలో ఇప్పటికి ఎంతమంది మాజీలు అయి ఉండేవారో?