“దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతుంది”
-ప్రమోదంతో చూసి నేర్చుకోవడానికి, స్ఫూర్తి పొందడానికి ఒక ఆదర్శం.
“…దూరం బాధిస్తున్నా…ప్రాణం పోతున్నా…విమానం మన మాన ప్రాణాలను దోచుకుంటూనే ఉంటుంది”
-ప్రమాదంలో సందు చూసి దోచుకోవడానికి ఒక వ్యాపారమార్గం.
1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా విమానాన్ని గాల్లో నడిపిన క్షణం నుండి రెక్కలు కట్టుకుని మనం దాటిన దేశాలెన్నో! ఖండాలెన్నో! సముద్రాలెన్నో! దూరాలెన్నో! లెక్కే లేదు. ఒకప్పుడు విమానయానం సంపన్నులకే పరిమితం. ఇప్పుడు విమానయానం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ ఎయిర్ లైన్స్ ఒకటే. ఇప్పుడు రెక్కలు విప్పిన ప్రయివేటు విమానయన సంస్థలు లెక్కలేనన్ని.
ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్. ప్రస్తుతం సంవత్సరానికి 40కోట్లమంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఏటా ఈ సంఖ్య పదినుండి పన్నెండు శాతం పెరుగుతోంది. 24 అంతర్జాతీయ విమానాశ్రయాలతో కలిపి భారత్ లో 140 విమానాశ్రయాలున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య దాదాపు 375కు చేరవచ్చు. ఏటా విమానయాన రంగం వ్యాపార విలువ అయిదు లక్షల కోట్లు. ఇలా ఏటేటా పెరిగే విమానయాన పరిశ్రమగురించి పులకింతగా ఎన్ని లెక్కలైనా చెప్పుకోవచ్చు. కానీ విమానసంస్థల వ్యవహారం మాత్రం అంత గొప్పగా లేదు. చిత్ర విచిత్ర పద్ధతుల్లో ప్రయాణికులను దోచుకోవడంలో పోటీలు పడుతున్నాయి. సిగ్గూ ఎగ్గూ విడిచి ప్రవర్తిస్తున్నాయి.
మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరిగితే…“ఊళ్ళో పెళ్ళయితే…ఎవరికో హడావుడి” అన్నట్లు విమానయాన సంస్థలు భక్తులను పిండుకుని…కుంభమేళాను నిస్సిగ్గుగా సొమ్ము చేసుకున్నాయి.
తాజాగా మరింతగా తమ నగ్న స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరుపొందిన పహల్గాం కొండమీది బైసరన్ పచ్చిక బయళ్ళలో పర్యాటకులు ప్రకృతిని చూసి పరవశిస్తుండగా ముష్కరమూకలు దాడి చేశాయి. 26మంది అక్కడికక్కడే తూటాలకు బలై ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడి…ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు.
కొత్తగా పెళ్ళయి హనీమూన్ కు వచ్చి…కాళ్ళ పారాణి ఆరకముందే భర్తను కోల్పోయిన భార్యతో మొదలుపెట్టి జీవన తుది సంధ్యలో ఒక్కసారి కాశ్మీరు అందాలు చూడాలనుకుని వచ్చి ప్రాణాలు కోల్పోయిన పండు ముసలి వరకు ఒక్కొక్కరిది ఒక్కో గుండెలు పిండేసే విషాదగాథ.
ఇలాంటివేళ తనతో వచ్చిన పర్యాటకులను రక్షించడానికి ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి అసువులు బాసిన స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా లాంటి కన్నీటిగాథలకు ఎంతటి రాతిగుండెలైనా కరిగి నీరవుతాయి. కానీ…విమానయాన సంస్థల కరకు గుండెలు మాత్రం ఇంకా బండబారాయి. మరింత క్రూరంగా వ్యవహరించాయి.
పహల్గాం దాడి తరువాత జమ్మూ కాశ్మీర్ పక్షులు ఎగిరిపోయిన చెట్టులా ఉంది. వేలమంది వెనువెంటనే కాశ్మీరం వదిలి సొంత ఊళ్ళకు బయలుదేరారు. కాశ్మీర్ వెళదామనుకుని టికెట్లు కొనుక్కున్నవారు విమానం టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక్కసారిగా కాశ్మీర్ నుండి తిరుగు ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల భయాన్ని, ఆదుర్దాను, ఆందోళనను విమానసంస్థలు పోటీలు పడి సొమ్ము చేసుకున్నాయి. సాధారణంగా ఆరేడు వేలున్న టికెట్ ధరను అరవై, డెబ్బయ్ వేల వరకు పెంచారు. దేశమంతా దీని మీద వ్యతిరేకత చెలరేగడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కల్పించుకుని కొంత నియంత్రించగలిగారు. అయినా సాధారణ ధరతో పోలిస్తే ఇప్పటికీ…రెండింతలు, మూడింతలు ఎక్కువే ఉంది.
జపాన్ లో సంక్షోభ సమయంలో ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు సమాజానికి ఉచిత సేవలు చేస్తాయట. గల్ఫ్ యుద్ధ సమయంలో ఇండియన్ ఎయిర్ లైన్స్, భారత వాయుసేన వేలమందిని ఉచితంగా, భద్రంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ సాహసగాథల ఆధారంగా “ఎయిర్ లిఫ్ట్” లాంటి సినిమాలు కూడా వచ్చాయి.
ఒకపక్క రక్తపు మరకలతో ప్రయాణికులు భయపడుతుంటే…
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నపళాన సొంత ఊళ్ళకు వెళ్లిపోవాలని తొందరపడుతుంటే…
ఇదే సందని ప్రయివేటు విమానసంస్థలు నిర్దయగా దోచుకుంటున్నాయి. డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాయి.
మానంలేని విమానసంస్థలను తిట్టడానికి మన మానం అడ్డొస్తోంది.
థూ…వీళ్ళ బతుకులు!
వీళ్ళసలు మనుషులేనా?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు